తెలంగాణ

Telangana: కేసీఆర్ మౌనం.. బీఆర్‌ఎస్‌కు ప్లస్సా? మైనస్సా?..

రచన: Venu•••8 నిమిషాల పఠనం

తెలంగాణలో బీఆర్‌ఎస్‌ రాజకీయంగా సవాళ్ళు ఎదుర్కొంటుంది. అధికారం కోల్పోయి దాదాపు మూడేళ్లు కావస్తున్నా.. పార్టీ ఇంకా బలంగా ప్రజల్లోకి వెళ్ళే ప్రయత్నాలు చేయడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

తెలంగాణలో బీఆర్‌ఎస్‌ రాజకీయంగా సవాళ్ళు ఎదుర్కొంటుంది. అధికారం కోల్పోయి దాదాపు మూడేళ్లు కావస్తున్నా.. పార్టీ ఇంకా బలంగా ప్రజల్లోకి వెళ్ళే ప్రయత్నాలు చేయడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కేటీఆర్‌, హరీశ్‌రావు మాత్రం తమ ఉనికిని చాటుకునే ప్రయత్నంలో ప్రభుత్వంపై అప్పుడప్పుడు పోరాడుతున్నారు. అసెంబ్లీలో ప్రశ్నిస్తున్నారు. జిల్లాల్లో పర్యటిస్తున్నారు. నిరసనలు చేస్తున్నారు. కానీ పార్టీ అధినేత కేసీఆర్‌ మాత్రం ఎక్కువగా తెరవెనుకే ఉండటం చర్చాంశనీయంగా మారింది.

ఇక 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు బీఆర్‌ఎస్‌ను పదేళ్ల సుదీర్ఘ పాలన తర్వాత ఒక్కసారిగా ప్రతిపక్షంలోకి నెట్టివేశాయి. ఇలాంటి కీలక సమయంలో ఏ నాయకుడైనా ప్రతిరోజూ ప్రజల్లో ఉంటూ ప్రభుత్వాన్ని నిలదీసే మార్గాన్ని ఎంచుకోవడం సహజం. కానీ, కేసీఆర్‌ ఒక భిన్నమైన వ్యూహాన్ని ఎంచుకున్నారని ప్రచారం జరుగుతుంది. ఆయన మౌనం వెనుక రాజకీయ వ్యూహం ఉందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

ఒకవైపు రోజువారీ రాజకీయ పోరాటాలు, క్షేత్రస్థాయి నిరసనలు, విలేకరుల సమావేశాల బాధ్యతలను కేటీఆర్‌, హరీశ్‌రావుల భుజస్కంధాలపై ఉంచారు. దీనివల్ల ద్వితీయ శ్రేణి నాయకత్వానికి మరింత బలం చేకూరడమే కాకుండా, ప్రతిపక్ష పోరాటంలో వారి స్థానాన్ని సుస్థిరం చేసే అవకాశం లభించింది.

మరోవైపు, కొత్తగా అధికారంలోకి వచ్చిన ప్రభుత్వానికి కొంత సమయం ఇవ్వడం కూడా ఈ వ్యూహంలో భాగమే. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చే హామీలు, వారి పాలనా తీరును ప్రజలే స్వయంగా చూసి అంచనా వేసేందుకు కేసీఆర్‌ ఒక వ్యూహాత్మక వ్యవధిని ఇచ్చారు.

అంతేకాకుండా, ప్రతి చిన్న విషయానికీ రోజువారీగా స్పందిస్తే మాట ప్రభావం తగ్గుతుందన్నది సుదీర్ఘ అనుభవం ఉన్న నాయకుడి ఆలోచన. అందుకే సరైన సమయం వచ్చినప్పుడు, కీలకమైన ప్రజా సమస్యలపై స్వయంగా రంగంలోకి దిగితే ఆ మాట ప్రభావం తీవ్రంగా ఉంటుందని ఆయన భావిస్తున్నట్టు చెబుతున్నారు.

మొత్తంగా చెప్పాలంటే.. కేసీఆర్ పాటిస్తున్న ఈ మౌనం రాజకీయం నుండి తప్పుకోవడం ఎంతమాత్రమూ కాదు! పదేళ్ల అధికార అనుభవం తర్వాత, తెరవెనుక ఉండి పార్టీని నడిపించే ఒక పక్కా రాజకీయ వ్యూహం అని పేర్కొంటున్నారు. మరోవైపు రాజకీయాల్లో ప్రజలకు కనిపించని నాయకుడి స్థానాన్ని మరొకరు భర్తీ చేసే అవకాశం ఉంటుంది.

అదేవిధంగా కేసీఆర్‌ ప్రజల్లో తక్కువగా కనిపిస్తే.. కాంగ్రెస్‌ తనకు అనుకూలంగా రాజకీయ ప్రచారం చేసుకునే అవకాశం ఉంటుంది. బీజేపీ కూడా బీఆర్‌ఎస్‌ స్థానాన్ని తనకు అనుకూలంగా మార్చుకునేందుకు ప్రయత్నిస్తుంది. ముఖ్యంగా ఎన్నికల ఓటమి తర్వాత కార్యకర్తలు, స్థానిక నాయకులు పార్టీకి ఎంత దగ్గరగా ఉన్నారు? ఎక్కడ నాయకులు దూరమయ్యారు? ఏ నియోజకవర్గంలో పార్టీ బలంగా ఉంది? ఎక్కడ బలహీనంగా ఉంది? అనే విషయాలను అధినేత ఎప్పటికప్పుడు తెలుసుకోవాలి.

ఇది కేవలం సమావేశాలతో పూర్తయ్యే పని కాదు. క్షేత్రస్థాయిలో నాయకులు, కార్యకర్తలు చెప్పే మాట నేరుగా అధినేతకు చేరాలి. అప్పుడే ఎక్కడ మార్పులు చేయాలో తెలుస్తుంది. ఇక కేసీఆర్‌ గజ్వేల్‌ ఎమ్మెల్యే మాత్రమే కాదు.. బీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత కూడా. ఆయన సభకు వస్తే.. కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని నేరుగా ప్రశ్నించే అవకాశం ఉంటుంది. తన పదేళ్ల పాలనపై వస్తున్న ఆరోపణలకు సమాధానం చెప్పే అవకాశం కూడా ఉంటుంది. కానీ ఆయన సభకు దూరంగా ఉంటే.. అదే విషయాన్ని కాంగ్రెస్‌ తన రాజకీయ ప్రచారానికి ఉపయోగించుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది.

ఇక్కడ కేటీఆర్‌, హరీశ్‌రావు పోరాటం ఎంత ఉన్నా.. కేసీఆర్‌ స్థానాన్ని పూర్తిగా భర్తీ చేయడం సాధ్యం కాదు. ఎందుకంటే బీఆర్‌ఎస్‌ ఏర్పడినప్పటి నుంచి పార్టీకి ప్రధాన నాయకత్వం కేసీఆర్‌దే. అందుకే ఆయన ప్రజల్లో కనిపించే తీరు పార్టీ కార్యకర్తలపైనా ప్రభావం చూపుతుందని క్షేత్ర స్థాయిలో చర్చించుకుంటున్నారు.. మరోవైపు కేసీఆర్‌ ఒక అంశాన్ని ఎంచుకుని మాట్లాడటం మాత్రమే సరిపోదు.

ఆ సమస్యపై కేటీఆర్‌, హరీశ్‌రావు నుంచి గ్రామస్థాయి కార్యకర్త వరకు అందరూ కలిసి పనిచేయాలి. ప్రజల సమస్యను పట్టుకుని జిల్లాల నుంచి గ్రామాల వరకు పార్టీ కార్యక్రమాలు నిర్వహించాలి. అప్పుడు మాత్రమే కేసీఆర్‌ మౌనం వెనుక ఉన్న వ్యూహం ఫలిస్తుందా లేదా అనేది తెలుస్తుంది. లేకపోతే ప్రజల్లో బీఆర్ఎస్ మీద నెగెటివ్ టాక్ ఏర్పడే ప్రమాదం ఉందని విశ్లేషకులు వివరిస్తున్నారు.

కాబట్టి కేసీఆర్‌ మౌనం ఒక్కటే బీఆర్‌ఎస్‌ భవిష్యత్తును నిర్ణయించదు. ఆయన మళ్లీ ఎప్పుడు ప్రజల్లోకి వస్తారు? ఏ సమస్యను తీసుకుంటారు? ఆ సమస్యపై పార్టీని ఎంతకాలం నడిపిస్తారు? కార్యకర్తలను ఎంతవరకు కలుపుకుంటారు? ఇవే ఇప్పుడు పార్టీ వర్గాలలో కీలకంగా మారిన అంశాలు

ప్రస్తుతం బీఆర్‌ఎస్‌లో కనిపిస్తున్న పరిస్థితిని ఒక్క మాటలో చెప్పాలంటే.. కేసీఆర్‌ రాజకీయంగా పక్కకు తప్పుకున్నట్లు కనిపించడం లేదు. కానీ రోజువారీ రాజకీయ పోరాటాన్ని మాత్రం ఇతర నేతలకు అప్పగించారు. ఈ విధానం పార్టీని తిరిగి బలోపేతం చేస్తుందా.. లేక ప్రజలకు, కార్యకర్తలకు అధినేత మరింత దూరమయ్యే పరిస్థితి తెస్తుందా అనేది రాబోయే రోజుల్లో కేసీఆర్‌ తీసుకునే నిర్ణయాలపై ఆధారపడి ఉంటుందని అంటున్నారు..

#Telangana#BRS#KCR#Harish Rao#KTR#Congress#BJP
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి