తెలంగాణ కాంగ్రెస్‌లో రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాల ఎంపికపై ఉత్కంఠ వీడింది.. వరంగల్–ఖమ్మం–నల్గొండ, హైదరాబాద్–రంగారెడ్డి–మహబూబ్‌నగర్ నియోజకవర్గాల్లో వచ్చే ఏడాది మార్చిలో ఖాళీ కానున్న సీట్ల కోసం పార్టీ అంతర్గత కసరత్తు తుది దశకు చేరుకుంది. ఒక్కో సీటుకు ముగ్గురి పేర్లను పీసీసీ ఖరారు చేసి హైకమాండ్‌కు పంపినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
వరంగల్–ఖమ్మం–నల్గొండ స్థానానికి రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి, పీవీ శ్రీనివాస్, చనగాని దయాకర్ పేర్లు పరిశీలనలో ఉన్నాయి. వీరిలో సర్వోత్తమ్ రెడ్డి పోటీపై ఆసక్తి చూపడం లేదన్న సమాచారం నేపథ్యంలో మిగిలిన ఇద్దరి పేర్లపై ప్రధానంగా చర్చ జరుగుతున్నట్లు తెలుస్తోంది. పీవీ శ్రీనివాస్‌కు బ్రాహ్మణ సామాజిక వర్గం ప్రాతినిధ్యం ఉండగా, చనగాని దయాకర్ బీసీ వర్గానికి చెందిన నాయకుడిగా ఉన్నారు. దీంతో ఈ సీటు ఎంపికలో సామాజిక సమీకరణం కూడా ప్రాధాన్యం సంతరించుకుంది.
ఇక హైదరాబాద్–రంగారెడ్డి–మహబూబ్‌నగర్ స్థానానికి మన్నె సత్యనారాయణరెడ్డి, గౌరీ సతీశ్, సామా రామ్మోహన్ రెడ్డి పేర్లు పీసీసీ జాబితాలో ఉన్నట్లు సమాచారం. మన్నె సత్యనారాయణరెడ్డి పోటీకి ఆసక్తి చూపడం లేదన్న ప్రచారం నేపథ్యంలో మిగిలిన ఇద్దరి పేర్లు కూడా పరిశీలనలో ఉన్నాయని పార్టీ వర్గాల్లో చర్చ సాగుతోంది.
ఈ రెండు స్థానాల విషయంలో కాంగ్రెస్ వ్యూహం కేవలం అభ్యర్థుల ఎంపికకే పరిమితం కావడం లేదు. తాజాగా ఎన్నికల సంఘం ఈ రెండు పట్టభద్రుల నియోజకవర్గాలకు కొత్తగా ఓటర్ల జాబితా సిద్ధం చేయాలని నిర్ణయించింది. నవంబర్ ఒకటిని అర్హత తేదీగా నిర్ణయించగా, సెప్టెంబర్ 28 నుంచి పట్టభద్రుల ఓటర్ల నమోదు ప్రక్రియ ప్రారంభం కానుంది. ఫారమ్-18 దరఖాస్తులకు నవంబర్ 6 వరకు అవకాశం ఉంది. అంటే అభ్యర్థి ఎంపికతో పాటు ఓటర్ల నమోదు కూడా పార్టీలకు కీలకమైన రాజకీయ, సంస్థాగత అంశంగా మారింది.
ఇదే సమయంలో బీజేపీ, బీఆర్ఎస్ ఇప్పటికే తమ స్థాయిలో ఎన్నికల సన్నాహాలను ప్రారంభించాయి. బీఆర్ఎస్ ఓటర్ల నమోదు షెడ్యూల్‌పై ఎన్నికల అధికారులను సంప్రదించగా, బీజేపీ రెండు పట్టభద్రుల నియోజకవర్గాలపై సంస్థాగత సమావేశాలు నిర్వహించింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌కు అభ్యర్థి ఎంపికతో పాటు గ్రౌండ్ లెవల్‌లో ఓటర్ల నమోదు, పార్టీ క్యాడర్ సమన్వయం, పట్టభద్రుల వర్గాలతో అనుసంధానం కూడా కీలకంగా మారుతోంది.
మరోవైపు పీసీసీ పంపిన జాబితాపై అధిష్ఠానం నిర్ణయం తీసుకున్నాకే కాంగ్రెస్ వ్యూహంపై స్పష్టత రానుంది. సెప్టెంబర్ 29న ఢిల్లీ కార్యక్రమాల తర్వాత అభ్యర్థులెవరనేది తేలవచ్చు. మొత్తానికి ఈ రెండు ఎమ్మెల్సీ స్థానాలు.. కేవలం అభ్యర్థుల ఎంపికకే కాకుండా, సామాజిక సమీకరణ, సంస్థాగత బలాన్ని నిరూపించుకోవడానికి కాంగ్రెస్‌కు కీలకంగా మారాయని తెలుస్తుంది..









