చిట్టీల వ్యాపారం పేరుతో సామాన్య ప్రజలు, బంధువుల నుంచి ఏకంగా రూ.10కోట్లకు పైగా వసూలు చేసి ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు కుటుంబంతో సహా పరారైన ఘోర మోసం సూర్యాపేట జిల్లాలో తీవ్ర కలకలం రేపింది. బాధితులు శనివారం జిల్లా పోలీసు సూపరింటెండెంట్ (ఎస్పీ) నరసింహను కలిసి ఫిర్యాదు చేయడంతో ఈ భారీ స్కామ్ వెలుగులోకి వచ్చింది. పక్కా ప్రణాళికతో అమాయక ప్రజలను నమ్మించి వంచించిన సదరు ఉపాధ్యాయుడి చర్యపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
పోలీసుల కథనం ప్రకారం.. చివ్వెంల మండలం ఏనేగండి తండాకు చెందిన సదరు నిందితుడు ఆత్మకూర్ (ఎస్) మండలం శెట్టిగూడెం పాఠశాలలో ఎస్జీటీ (SGT) ఉపాధ్యాయుడిగా విధులు నిర్వర్తిస్తున్నాడు. సూర్యాపేటలోని విద్యానగర్‌లో నివాసముంటూ గత ఆరేళ్లుగా చిట్టీల వ్యాపారం నడుపుతున్నాడు. తన సొంత తండాతో పాటు చుట్టుపక్కల ఉన్న 12గ్రామాల ప్రజలు, బంధువులు, ఇతర ప్రభుత్వ ఉద్యోగుల నమ్మకాన్ని ఆసరాగా చేసుకుని ఒక్కొక్కరి నుంచి రూ.లక్ష నుంచి రూ.1.30కోట్ల వరకు భారీ మొత్తంలో వసూళ్లకు పాల్పడ్డాడు.
అధిక లాభాలు ఇస్తానని, నెలకు ప్రామిసరీ నోట్లు రాసిచ్చి నమ్మబలికిన నిందితుడు గత ఏడాది కాలంగా బాధితులు డబ్బులు తిరిగి చెల్లించాలని ఒత్తిడి చేయడంతో కాలయాపన చేస్తూ వచ్చాడు. ఈ క్రమంలోనే పరారయ్యేందుకు ముందస్తు ప్లాన్ వేసి, తనకున్న 4 ఎకరాల భూమిని ఇతరుల పేరిట రిజిస్ట్రేషన్ చేయించాడు. పది రోజుల క్రితం హైదరాబాద్‌లో ఓ హోటల్‌కి బాధితులను తీసుకెళ్లి, అప్పుల్లో ఉన్నానని డ్రామా ఆడి అక్కడి నుంచి జారుకున్నాడు.
బాధితులు ఇళ్లకు వెళ్లి చూడగా తాళాలు వేసి ఉండటంతో దిక్కుతోచక పోలీసులను ఆశ్రయించారు. బాధితుల ఫిర్యాదు మేరకు సూర్యాపేట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు వేగవంతం చేశారు. సేకరించిన రూ.10కోట్ల భారీ మొత్తాన్ని నిందితుడు ఎక్కడ దాచాడు? లేదా ఏదైనా వ్యాపారంలోకి మళ్లించాడా? అనే కోణంలో విచారణ జరుపుతున్నారు. నిందితుడితో పాటు అతని కుటుంబ సభ్యుల కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు ముమ్మరం చేసినట్లు అధికారులు వెల్లడించారు.







