తెలంగాణ

Hyderabad: హైదరాబాద్ మెట్రో స్వాధీనం పై రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం!!..

రచన: Venu•••6 నిమిషాల పఠనం

హైదరాబాద్‌ మెట్రో ఫేజ్‌-1 విషయంలో తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన కీలక ప్రక్రియ ప్రస్తుతం రుణాల రీఫైనాన్సింగ్‌ చుట్టూ తిరుగుతోంది. దసరా నాటికి ఆర్థిక అంశాలను కొలిక్కి తీసుకురావాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది.

హైదరాబాద్‌ మెట్రో ఫేజ్‌-1 విషయంలో తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన కీలక ప్రక్రియ ప్రస్తుతం రుణాల రీఫైనాన్సింగ్‌ చుట్టూ తిరుగుతోంది. దసరా నాటికి ఆర్థిక అంశాలను కొలిక్కి తీసుకురావాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది. అయితే భారీ రుణాన్ని తక్కువ వడ్డీకి సమీకరించడమే ప్రభుత్వానికి సవాల్ గా మారింది.

ఇక 69 కిలోమీటర్ల మేర మూడు కారిడార్లతో ఉన్న హైదరాబాద్‌ మెట్రో ఫేజ్‌-1ను ఎల్‌అండ్‌టీ 2017 నుంచి నిర్వహిస్తోంది. 2017 నవంబర్‌లో మియాపూర్‌–నాగోల్‌ మార్గంతో ప్రారంభమైన సేవలు.. 2018లో ఎల్‌బీనగర్‌, 2019లో హైటెక్‌సిటీ–రాయ్ దుర్గ్‌, 2020లో జేబీఎస్‌–ఎంజీబీఎస్‌ మార్గాలకు విస్తరించాయి. మొత్తంగా 69 కిలోమీటర్ల నెట్‌వర్క్‌ పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చింది.

అలా మెట్రో ప్రాజెక్టు పబ్లిక్‌–ప్రైవేట్‌ పార్ట్‌నర్‌షిప్‌ విధానంలో సాగింది. అయితే అధిక వడ్డీతో తీసుకున్న రుణాలు, నిర్వహణ ఖర్చులు, కరోనా సమయంలో ప్రయాణికుల సంఖ్య తగ్గడం వంటి అంశాలు సంస్థ ఆర్థిక పరిస్థితిపై ఒత్తిడి పెంచాయి. దీంతో ఫేజ్‌-1ను ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకురావాలనే ప్రక్రియ వేగం పుంజుకుంది.

ఈ ఏడాది ఏప్రిల్‌లో తెలంగాణ ప్రభుత్వం ఎల్‌అండ్‌టీ మెట్రో రైల్‌ హైదరాబాద్‌ లిమిటెడ్‌లోని 100 శాతం ఈక్విటీని రూ.1,461.47 కోట్లకు కొనుగోలు చేసేందుకు ఒప్పందం కుదుర్చుకుంది. అదే సమయంలో సంస్థపై ఉన్న సుమారు రూ.13,538.53 కోట్ల రుణాన్ని రాష్ట్ర ప్రభుత్వ హామీతో రీఫైనాన్స్‌ చేయాలని నిర్ణయించారు.

ఇక్కడే సమస్య మొదలైంది. మేలో ఇండియన్‌ రైల్వే ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ నుంచి రూ.13,600 కోట్ల వరకు రీఫైనాన్సింగ్‌ సదుపాయానికి ఒప్పందం కుదిరింది. అధిక వడ్డీతో ఉన్న పాత రుణాలను తక్కువ వ్యయంతో దీర్ఘకాలిక రుణంగా మార్చడం ఈ ప్రతిపాదన ప్రధాన ఉద్దేశం.

కానీ ఆ రుణం అనుకున్న సమయానికి విడుదల కాకపోవడంతో పరిస్థితి మళ్లీ మారింది. జూన్‌లో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కేంద్ర మంత్రులతో చర్చలు జరిపారు. రుణ విడుదలపై రాష్ట్ర ప్రభుత్వం, కేంద్రం మధ్య భిన్నమైన వాదనలు కూడా వెలువడ్డాయి.

ఆ తర్వాత ఫేజ్‌-1 ఆర్థిక నిర్మాణం, విలువ నిర్ధారణతో పాటు ఫేజ్‌-2 విస్తరణను కూడా సమగ్రంగా పరిశీలించేందుకు ఎస్‌బీఐ క్యాప్స్‌ను కన్సల్టెంట్‌గా నియమించారు. తక్కువ వడ్డీతో రుణాలు అందించే బ్యాంకులు, ఆర్థిక సంస్థలను గుర్తించే బాధ్యత కూడా ఈ ప్రక్రియలో కీలకంగా మారింది.

ఇప్పటికే కొన్ని బ్యాంకులతో సంప్రదింపులు జరిగినా.. అధిక వడ్డీ రేట్లు ప్రభుత్వానికి ప్రధాన అడ్డంకిగా మారుతున్నాయి. దాదాపు 7 నుంచి 8 శాతం పరిధిలో రుణం తీసుకుంటే మెట్రోపై ఆర్థిక భారం మరింత పెరిగే అవకాశం ఉంది. అందుకే తక్కువ వడ్డీతో, ముఖ్యంగా యెన్‌ ఆధారిత రుణాల వంటి ప్రత్యామ్నాయ మార్గాలపై కూడా పరిశీలన సాగుతోంది.

ఒకవేళ తక్కువ వడ్డీకి రీఫైనాన్సింగ్‌ సాధ్యం కాకపోతే ప్రత్యామ్నాయ మార్గాలపైనా ప్రభుత్వం దృష్టి పెట్టింది. హెచ్‌ఎండీఏ నిధులను వినియోగించే అవకాశాలు, ఇతర బ్యాంకులు లేదా ఆర్థిక సంస్థల ద్వారా రుణ సమీకరణ, ఐఆర్‌ఎఫ్‌సీ ప్రతిపాదనను మళ్లీ ముందుకు తీసుకెళ్లే ప్రయత్నాలు పరిశీలనలో ఉన్నాయి.

మరోవైపు హైదరాబాద్‌ మెట్రో ఫేజ్‌-1 స్వాధీనం ప్రక్రియలో కీలక ఘట్టం ఇప్పటికే పూర్తయినా, దాని వెనుక ఉన్న వేల కోట్ల రుణాన్ని తక్కువ వడ్డీతో పునర్వ్యవస్థీకరించడమే ఇప్పుడు ప్రభుత్వానికి పరీక్షగా మారింది. ఈ ఆర్థిక సమీకరణ కొలిక్కి వస్తేనే మెట్రో ఫేజ్‌-1 తో పాటు ఫేజ్‌-2 విస్తరణ పై స్పష్టత వచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది..

#telangana#hyderabad#metro#taken-over#dasara#Revanth government
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి