మల్కాజిగిరి బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్‌కు బిగ్ షాక్ తగిలింది. జవహర్‌నగర్ డంపింగ్ యార్డ్ తరలింపు కోసం ఆయన ఇవాళ చేపట్టిన పాదయాత్రను పోలీసులు అడ్డుకున్నారు. నాలుగు రోజుల మహా పాదయాత్రకు అనుమతిని నిరాకరించారు. మంగళవారం ఘట్‌కేసర్ మండలం ఎదులాబాద్ నుంచి పాదయాత్ర ప్రారంభించేందుకు బీజేపీ శ్రేణులు ఏర్పాట్లు చేయగా.. సుమారు 5 వేల మంది పార్టీ నాయకులు, కార్యకర్తలతో యాత్రను ప్రారంభించేందుకు సన్నాహాలు చేశారు. ఈ క్రమంలోనే పోలీసులు రంగప్రవేశం చేసి పాదయాత్రకు అనుమతి లేదని పేర్కొంటూ నాయకులను అడ్డుకున్నారు.
ఈటల పూజలు..
మహా పాదయాత్ర ప్రారంభానికి ముందు ఎంపీ ఈటల రాజేందర్ ఎదులాబాద్ లోని రంగనాయక స్వామి ఆలయంలో పూజలు చేశారు.పాదయాత్ర కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. డంపింగ్ యార్డ్‌తో పరిసర ప్రాంతాల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంతో పాటు, దాన్ని అక్కడి నుంచి వేరే చోటుకు తరలించాలనే డిమాండ్ చేశారు. యార్డు తరలింపే లక్ష్యంగా నాలుగు రోజుల కార్యక్రమానికి రూట్ మ్యాప్ రూపొందించారు.
అనుమతి నిరాకరణ.. ఈటల స్పందన
పాదయాత్రకు అనుమతి ఇవ్వకపోవడంపై ఎంపీ ఈటల రాజేందర్ స్పందించారు. తన పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలో ప్రజలతో మమేకమై వారి సమస్యలపై పర్యటించే హక్కు తనకు ఉందని స్పష్టంచేశారు. పాదయాత్ర కోసం మల్కాజ్‌గిరి పోలీస్ కమిషనర్‌కు అనుమతి కోరుతూ లేఖ పంపినట్లు వెల్లడించారు. డంపింగ్ యార్డ్ సమస్యపై గతంలో రేవంత్ రెడ్డి ఎంపీగా ఉన్న సమయంలో పార్లమెంటులో ప్రశ్న లేవనెత్తారని గుర్తుచేశారు. అదే సమస్యపై తాను ఇప్పుడు పాదయాత్ర చేస్తానంటే అడ్డుకోవడం సరైన పద్ధతి కాదని అభిప్రాయపడ్డారు.
పాదయాత్ర రూట్ మ్యాప్..
మొదటి రోజు ఎదులాబాద్ నుంచి మర్రిపల్లిగూడెం, ఎన్‌ఎఫ్‌సీ నగర్, బొక్కేగూడ, ఘన్‌పూర్ మీదుగా అన్నోజీగూడ వరకు పాదయాత్ర చేపట్టేందుకు ప్రణాళిక రచించారు. రెండో రోజు ఘట్‌కేసర్, యమ్నంపేట్, ఇస్మాయిల్‌ఖాన్‌గూడ, రాంపల్లి, కరీంగూడ మీదుగా కీసర వరకు చేపడతారు. మూడో రోజు కీసర, చిర్యాల, గృహకల్ప, బండ్లగూడ చౌరస్తా మీదుగా రాంపల్లి చౌరస్తా వరకు పాదయాత్ర కొనసాగనుంది. నాలుగో రోజు నాగారం, దమ్మాయిగూడ మీదుగా జవహర్‌నగర్‌కు చేరుకుని భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు. కాగా, పోలీసులు ఈటల పాదయాత్రకు అనుమతి ఇస్తారా? నిరాకరిస్తారా? యాత్ర ముందుకు సాగుతుందా? లేదా? అనేది తెలయాల్సి ఉంది.


