క్రైమ్

ఫిట్స్ నాటకం.. సబ్‌జైలు నుంచి 17మంది ఖైదీలు పరారీ!

రచన: Mamatha puppala••4 నిమిషాల పఠనం

ఫిట్స్ నాటకం ఆడి జైలు నుంచి 17మంది ఖైదీలు పరారయ్యారు. ఈ ఘటన తమిళనాడులోని తేని జిల్లాలోని తేక్కంపట్టి సబ్ జైలులో చోటుచేసుకుంది. సోమవారం రాత్రి వేళ జైలు సిబ్బందిని నమ్మించి, వారిపై విచక్షణారహితంగా దాడి చేసి ఖైదీలు పరారైనట్లు జైలు అధికారులు వెల్లడించారు.

ఫిట్స్ నాటకం ఆడి జైలు నుంచి 17మంది ఖైదీలు పరారయ్యారు. ఈ ఘటన తమిళనాడులోని తేని జిల్లాలోని తేక్కంపట్టి సబ్ జైలులో చోటుచేసుకుంది. సోమవారం రాత్రి వేళ జైలు సిబ్బందిని నమ్మించి, వారిపై విచక్షణారహితంగా దాడి చేసి ఖైదీలు పరారైనట్లు జైలు అధికారులు వెల్లడించారు. సినీ ఫక్కీలో జరిగిన ఈ ఘటనతో అప్రమత్తమైన తమిళనాడు పోలీస్ యంత్రాంగం రాష్ట్రవ్యాప్తంగా హై అలర్ట్ ప్రకటించి, సరిహద్దుల్లో తనిఖీలను తీవ్రతరం చేసింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సబ్‌జైలులోని ఒకే సెల్‌లో ఉన్న 17మంది ఖైదీలు సోమవారం రాత్రి సమయం చూసి తమతో ఉన్న ఒక ఖైదీకి తీవ్రంగా ఫిట్స్(మూర్ఛరోగం) వచ్చినట్లు నాటకమాడారు. ఖైదీ ప్రాణాపాయంలో ఉన్నాడని భావించిన జైలు గార్డులు తక్షణ సాయం అందించేందుకు సెల్ తలుపులు తీసి లోపలికి ప్రవేశించారు. ఇదే అదునుగా భావించిన ఖైదీలు ఒక్కసారిగా విరుచుకుపడి గార్డులపై భౌతిక దాడికి దిగారు. ఈ దాడిలో ఒక జైలు గార్డు తలకు తీవ్ర గాయమవ్వగా, మరో ఇద్దరు సిబ్బందికి గాయాలయ్యాయి.

గాయాలపాలైన గార్డును వెంటనే సమీప ఆసుపత్రికి తరలించారు. జైలు సిబ్బందిని దెబ్బతీసిన వెంటనే ఖైదీలంతా కట్టకట్టుకుని జైలు కాంపౌండ్ దాటి పారిపోయారు. ఈ విధి నిర్వహణ లోపం, ఖైదీల పరారీ ఘటనపై సౌత్ జోన్ ఐజీ విజయేంద్ర బిదారి తక్షణమే స్పందించారు. పరారైన 17మంది ఖైదీల్లో మధురైకి చెందిన ఒకరిని జైలు వెనుక ఉన్న దట్టమైన అటవీ ప్రాంతంలో కూంబింగ్ ఆపరేషన్ నిర్వహించి పోలీసులు మంగళవారం ఉదయానికి అదుపులోకి తీసుకున్నారు.

మిగిలిన 16 మంది ఖైదీల కోసం 17 ప్రత్యేక పోలీస్ బృందాలను (Special Teams) రంగంలోకి దించినట్లు ఐజీ వివరించారు. పొరుగున ఉన్న మధురై, దిండుగల్ జిల్లాలతో పాటు పక్కనే ఉన్న కేరళ రాష్ట్రంలోని ఇడుక్కి జిల్లా సరిహద్దుల్లోనూ తీవ్రమైన హై అలర్ట్ ప్రకటించారు. రాష్ట్ర సరిహద్దుల్లో ప్రత్యేక చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి ప్రతీ వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. పరారైన ఖైదీల ఫొటోలను పత్రికలు, సోషల్ మీడియా, అన్ని పోలీస్ స్టేషన్లకు విడుదల చేసి ప్రజలను అప్రమత్తం చేశారు. సబ్‌జైలు భద్రతా లోపాలపై కేసు నమోదు చేసి లోతైన విచారణ జరుపుతున్నట్లు అధికారులు తెలిపారు.

#TamilNaduJailBreak#Thenijailbreak2026#TamilNaduNewsTelugu#NationalNewsTelugu#CrimeNewsTelugu#SouthZoneIGVijayendraBidari#HighAlertTamilNadu#PoliceSearchOperation
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి