ప్రపంచ ఐటీ దిగ్గజం మైక్రోసాఫ్ట్ (Microsoft) తన ఉద్యోగులకు భారీ స్వచ్ఛంద నిష్క్రమణ (Voluntary Separation) ఆఫర్‌ను ప్రకటించి టెక్ ప్రపంచంలో తీవ్ర కలకలం రేపింది. సంస్థలో పనిచేస్తున్న సుమారు 60,000 మంది ఉద్యోగులు స్వచ్ఛందంగా కంపెనీని వీడేందుకు (వీఆర్ఎస్ తరహాలో) ఈ వెసులుబాటు కల్పించింది. అమెరికా, భారత్, బ్రిటన్, కెనడా వంటి నాలుగు ప్రధాన దేశాల్లోని ఎంపిక చేసిన విభాగాల ఉద్యోగులకు ఈ పథకాన్ని వర్తింపజేస్తున్నారు.
ఉద్యోగి హోదా, సీనియారిటీ స్థాయి (ల్యాడర్ లేయర్ 70 వరకు), పనిచేసిన కాలాన్ని బట్టి ఆకర్షణీయమైన పరిహారం, ఆరోగ్య బీమా, షేర్ల ప్రయోజనాలు చెల్లించనున్నట్లు ప్రకటించడంతో ఐటీ వర్గాల్లో దీనిపై తీవ్ర చర్చ సాగుతోంది. ఉద్యోగులకు అందిస్తున్న పరిహారం వివరాలను పరిశీలిస్తే.. అమెరికాలోని ఉద్యోగుల లెక్కల ప్రకారం 64వ స్థాయి వరకు ఉన్న ఉద్యోగులకు ప్రతి ఆరు నెలల సర్వీసుకు వారం రోజుల ప్రాథమిక వేతనం అందిస్తారు. 65 నుంచి 67 స్థాయిల్లో ఉన్నవారికి ప్రతి ఆరు నెలలకు రెండు వారాల బేసిక్ సాలరీ లభిస్తుంది (గరిష్టంగా 39 వారాల వేతనం దాటకుండా పరిమితి ఉంటుంది).
ఇక 68వ స్థాయిలో ఉన్న సీనియర్ ఉద్యోగులకు ఏకంగా 12 నెలల (ఒక ఏడాది) పూర్తి జీతానికి సమానమైన ప్యాకేజీని పరిహారంగా ఇచ్చే అవకాశం ఉంది. దీంతో పాటు హెల్త్ ఇన్సూరెన్స్, స్టాక్ బెనిఫిట్స్ కూడా కొనసాగుతాయి. అయితే భారత్ సహా ఇతర దేశాల స్థానిక చట్టాలకు అనుగుణంగా ఈ నిబంధనల్లో కొన్ని మార్పులు ఉండవచ్చు. అయితే ‘ఈ ఆఫర్‌ను వద్దని తిరస్కరిస్తే ఉద్యోగం ఊడుతుందా?’ అనే పెద్ద సందేహం ఉద్యోగుల్లో నెలకొంది. దీనిపై మైక్రోసాఫ్ట్ ఎలాంటి ప్రత్యక్ష హెచ్చరిక చేయలేదు.
ఆఫర్ వద్దన్నంత మాత్రాన వెంటనే ఉద్యోగం నుంచి తొలగిస్తారని కంపెనీ ఎక్కడా పేర్కొనలేదు. అయితే, భవిష్యత్తులో పింక్ స్లిప్పులు ఉండవని లేదా లేఆఫ్‌లు (Layoffs) జరగవని సంస్థ ఎలాంటి హామీ ఇవ్వకపోవడం గమనార్హం. అర్హులైన ఉద్యోగులు డిసెంబర్ ప్రారంభంలోగా తమ నిర్ణయాన్ని తెలపాల్సి ఉండగా, ఆఫర్ అంగీకరించిన వారు ఈ ఏడాది చివరి నాటికి (డిసెంబర్ 31) కంపెనీని వీడాల్సి ఉంటుంది.
ఇలాంటి ప్యాకేజీని మైక్రోసాఫ్ట్ ప్రకటించడం ఇదే మొదటిసారి కాదు. ఈ ఏడాది ఏప్రిల్‌లో అమెరికాలో 8,750 మందికి స్వచ్ఛంద నిష్క్రమణ ఆఫర్ ఇచ్చి, ఆ తర్వాత జూలైలో ప్రపంచవ్యాప్తంగా 4,800 మంది ఉద్యోగులను తొలగించింది. ప్రస్తుతం సంస్థ నిర్మాణ వ్యయాలను తగ్గించుకోవడంతో పాటు, కృత్రిమ మేధ (AI) వంటి నూతన సాంకేతికతల ఆధారంగా మారుతున్న వ్యాపార అవసరాలకు అనుగుణంగా ఉద్యోగుల సంఖ్యను పునర్వ్యవస్థీకరించడానికే మైక్రోసాఫ్ట్ ఈ ప్రతిపాదన తెచ్చినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు.


