తెలంగాణ

TG : వీఆర్‌ఎస్‌కు దరఖాస్తు.. జయేశ్ రంజన్ సంచలన నిర్ణయం

రచన: Kumar••5 నిమిషాల పఠనం

తెలంగాణ ప్రభుత్వంలో కీలక హోదాలో పనిచేస్తున్న ఐఏఎస్ అధికారి జయేశ్ రంజన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తదుపరి సీఎస్‌ బాధ్యతలు చేపట్టేందుకు అర్హుడిగా లైన్‌లో ఉన్న ఆయన స్వచ్ఛంద పదవీ విరమణ (వీఆర్ఎస్) కోసం దరఖాస్తు చేసుకోవడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.

తెలంగాణ ప్రభుత్వంలో కీలక హోదాలో పనిచేస్తున్న ఐఏఎస్ అధికారి జయేశ్ రంజన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తదుపరి సీఎస్‌ బాధ్యతలు చేపట్టేందుకు అర్హుడిగా లైన్‌లో ఉన్న ఆయన స్వచ్ఛంద పదవీ విరమణ (వీఆర్ఎస్) కోసం దరఖాస్తు చేసుకోవడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.కాగా, ఆయన వీఆర్ఎస్ అప్లికేషన్‌పై కేంద్ర సిబ్బంది శిక్షణా వ్యవహారాల శాఖ(డీవోపీటీ), తెలంగాణ ప్రభుత్వం నిబంధనలను అనుసరించి నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.

ప్రస్తుతం రేవంత్ ప్రభుత్వంలో కీలక బాధ్యతల్లో ఉన్న జయేశ్ రంజన్.. సర్వీస్ కాలం ముగియడానికి ముందే వీఆర్ఎస్ తీసుకోవాలని నిర్ణయించుకోవడం బ్యూరోక్రసీ వర్గాల్లో హాట్ టాపిక్‌ అయ్యింది. ఇదిలాఉండగా, పాలనాపరమైన నిర్ణయాలు, ప్రాధాన్యత విషయంలో తన సీనియార్టీకి తగిన గుర్తింపు, గౌరవం దక్కలేదని ఆయన అసహనంతో ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది.

ఏపీ, తెలంగాణలోనూ కీలక బాధ్యతలు..

ఉమ్మడి ఏపీలో కడప, గుంటూరు, మెదక్ జిల్లాలకు కలెక్టర్‌గా పనిచేసిన జయేశ్ రంజన్.. హైదరాబాద్ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (HUDA) వైస్ చైర్మన్‌గా మూడేళ్ల పాటు పనిచేశారు. గతంలో ఏపీ పర్యాటక అభివృద్ధి సంస్థ (APTDC) మేనేజింగ్ డైరెక్టర్‌గా, పర్యాటక-సాంస్కృతిక శాఖ కార్యదర్శిగానూ పనిచేశారు. ఐటీడీఏ ప్రాజెక్ట్ ఆఫీసర్‌గా, గిరిజన సంక్షేమం, సహజ వనరుల నిర్వహణ, పేదరిక నిర్మూలన వంటి సామాజిక రంగాల్లో దాదాపు 12 ఏళ్లకు పైగా పనిచేశారు.

బీఆర్ఎస్ ప్రభుత్వంలో కీలక పాత్ర..

2014లో ఏర్పడిన బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఐటీ,పారిశ్రామిక రంగాల అభివృద్ధిలో జయేశ్ అత్యంత కీలక పాత్ర పోషించారు. గత పదేళ్లలో సమాచార సాంకేతిక (IT), పరిశ్రమలు, వాణిజ్య శాఖల ముఖ్య కార్యదర్శిగా, ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా చాలాకాలం పాటు సేవలు అందించారు.‘టీ-హబ్’ ఏర్పాటు, ఉన్నత ఐటీ విధానాల రూపకల్పనలో కీలక సూత్రధారిగా ఉన్నారు. రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ (TSIIC), పారిశ్రామిక అభివృద్ధి సంస్థ (TSIDC)లలో ఎండీగాను బాధ్యతలు చేపట్టారు.

కాంగ్రెస్ ప్రభుత్వంలోనూ సేమ్..

ఈ ఏడాది ఏప్రిల్ నెలలో సీఎంవో ఆఫీస్ పరిశ్రమలు, పెట్టుబడుల సెల్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టిన జయేశ్ రంజన్.. ప్రభుత్వ ప్రాజెక్టులను వేగవంతం చేసే ‘స్పీడ్’ చొరవకు సీఈఓగా ఉన్నారు. ప్రస్తుతం ప్రభుత్వ మెట్రోపాలిటన్ ప్రాంత, పట్టణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. యూత్ అడ్వాన్స్‌మెంట్, పర్యాటక, సాంస్కృతిక, క్రీడల శాఖల అదనపు బాధ్యతలను కూడా చూస్తున్నారు. జయేశ్ రంజన్ 30 సెప్టెంబర్ 2027న పదవీ విరమణ చేయాల్సి ఉంది. కానీ, ఏడాది ముందే ఆయన వీఆర్ఎస్‌కు దరఖాస్తు చేసుకోవడం ప్రభుత్వ వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యింది.

#IAS officer jayesh ranjan#VRS#applied#telangana#congress government#swechaanews
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి