జాతీయ రహదారులపై నిత్యం ప్రయాణించే వాహనదారులకు కేంద్ర రోడ్డు, రవాణా మంత్రిత్వ శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. ఫాస్టాగ్ ఏడాది పాస్ విధానంలో ప్రస్తుతం అమలవుతున్న వాటిలో కీలక మార్పులు చేస్తూ కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. టోల్ ప్లాజాల సమీపంలో నివసించే స్థానికులకు తక్కువ ధరకే సంవత్సర పాస్ అందించేలా కొత్త నిబంధనలను అమల్లోకి తెచ్చింది.
జాతీయ రహదారి ఫీజు నిర్ధారణ, సేకరణ నిబంధనలకు సంబంధించి కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ ఈ మేరకు అధికారిక గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. తాజా నిబంధనలు నవంబర్ 1 నుంచి దేశవ్యాప్తంగా అమల్లోకి రానున్నాయి. కమర్షియల్ వాహనదారుల ప్రయోజనాల కోసం రిజిస్టర్ అయి, ఫాస్టాగ్ కలిగి ఉన్న ఓనర్స్ తమ స్థానిక ప్రాంతాల్లోని టోల్ ప్లాజాల వద్ద రాయితీ పాస్‌లను పొందేందుకు అర్హులు అవుతారు.
టోల్ ప్లాజాకు సుమారు 20 కి.మీ దూరంలోపు స్థానికంగా నివసించే వాహనదారులకు ఈ నిబంధన వర్తించనుంది. టోల్ ప్లాజా ఏదైనా మున్సిపాలిటీ, స్థానిక పట్టణ ప్రాంత పరిధికి బయట ఉంటే, ఏడాదికి రూ.1,500 చెల్లించి స్థానిక పాస్ పొందే సదుపాయం కల్పించారు. టోల్ ప్లాజా మున్సిపాలిటీ, స్థానిక పట్టణ ప్రాంత పరిధి లోపల ఉంటే ఏడాదికి రూ.3 వేల ఫీజును నిర్ణయించారు.
ఈ ధరలను ప్రతి ఏడాది ఏప్రిల్ 1న కేంద్ర ప్రభుత్వం సవరించే అవకాశం ఉంటుంది. ఓపెన్ టోల్ సిస్టమ్ కాకుండా ‘క్లోజ్డ్ యూజర్ ఫీ కలెక్షన్ సిస్టమ్’ ఉన్న రహదారులు, ఆల్టర్ నేట్ సర్వీసు రోడ్లు అందుబాటులో ఉన్న మార్గాలకు లోకల్ రాయితీ పాస్‌లు వర్తించవని తెలుస్తోంది. తాజా మార్పుల ద్వారా టోల్ ప్లాజాల చుట్టూ తిరిగే స్థానిక వాహనదారులకు ప్రయాణ ఖర్చులు భారీగా తగ్గే అవకాశం ఉంది. స్థానికేతరులకు మాత్రం రెగ్యులర్‌గా అమలయ్యే ధరలు వర్తించనున్నాయి.


