ఏపీని అర్నబ్ తుపాను గజగజ వణకిస్తోంది. తీరంలో కెరటాలు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నాయి. అలలు సైతం ముందుకు వచ్చినట్టు తెలుస్తోంది. ఉదయం నుంచి జోరుగా వర్షం కురవడంతో జనాలు బయటకు వచ్చేందుకు జంకుతున్నారు.ఈదురు గాలులు బలంగా వీస్తుండటంతో వాతావరణం గందరగోళంగా మారింది. ఈదురుగాలుల ధాటికి ఎక్కడికక్కడ చెట్లు కూలుతున్నాయి. విశాఖపట్నంలోని అంగడి దిబ్బలో ఓ ఇంటిపై వృక్షాలు కూలాయి.
దీనికి తోడు ఆంధ్రా యూనివర్సిటీలో రోడ్డుకు అడ్డంగా చెట్టు పడినట్టు తెలిసింది.తుపాను నేపథ్యంలో విశాఖలోని పర్యాటక ప్రాంతాలన్నింటనీ ముందుగానే అధికారులు మూసివేశారు. అదే విధంగా ఆంధ్రా యూనివర్సిటీకి 10 రోజుల పాటు సెలవులు ప్రకటించారు. విద్యాసంస్థలకు కూడా రెండు రోజులు సెలవు ఇచ్చారు.
అవసరమైతే తప్ప ప్రజలు బయటకు రావొద్దని అధికారుల సూచించారు. అర్నబ్ తుఫాన్ ప్రభావంతో తీర ప్రాంతాల్లో అలజడి నెలకొనడంతో మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. కోనసీమలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది.సముద్రంలో అలలు ఎగసిపడుతుండటంతో తీర ప్రాంత ప్రజలను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.వాసాలతిప్పలో మత్స్యకార కుటుంబాల తరలింపు ప్రక్రియ చేపట్టారు.
నక్కపల్లి నుంచి వేటకు వచ్చిన 400 మంది మత్స్యకారులకు షెల్టర్లలో ఆశ్రయం కల్పించారు. అమలాపురం డివిజన్‌లో 1,000 నుంచి 1,500 మందిని తరలించేందుకు చర్యలు చేపట్టారు. విశాఖ జిల్లా, డివిజన్, మండల కేంద్రాల్లో కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేశారు. ఇక కాకినాడ జిల్లా ఉప్పాడ తీరంలోనూ అలలు ఉవ్వెత్తున ఎగసిపడుతున్నాయి.
శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలం అక్కుపల్లిలో తుపాను ప్రభావం కారణంగా విద్యుత్ తీగలపై కొబ్బరి చెట్లు విరిగిపడటంతో విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. దీంతో ప్రధాన రహదారిపై రాకపోకలు నిలిచాయి. చెట్లు, స్తంభాలు అడ్డంగా పడటంతో వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలోనే స్థానికులు, అధికారులు సహాయక చర్యలు చేపట్టారు.


