ఒక కుటుంబంలో ఇంటి పెద్ద సక్రమంగా ఉంటే ఆ కుటుంబం బాగుపడుతుంది. అలాగే రాష్ట్రం అభివృద్ది చెందాలంటే రాష్ట్రాన్ని పాలించే నేతలు నిస్వార్థంగా ఉండాలి. కానీ స్వార్థం అడుగడుగునా నింపుకున్న నేటి రాజకీయాల్లో నిస్వార్థపరులైన నేతలు భూతద్దం పెట్టిన దొరకని పరిస్థితి నెలకొంది.. ఇక తెలంగాణ దోపిడికి గురవుతుందనే భావనతో ప్రజలు మార్పు కోరుకున్నారు. అందుకే పదేళ్ల బీఆర్ఎస్ పాలనకు ముగింపు పలికి, కాంగ్రెస్ పార్టీకి అధికారం అప్పగించారు.
గత ప్రభుత్వ వైఫల్యాలను సరిదిద్దుతామని, ఆరు గ్యారెంటీలతో ప్రతి కుటుంబానికి భరోసా కల్పిస్తామని కాంగ్రెస్ ఇచ్చిన హామీ జనం నమ్మారు కాబట్టే ఈ రోజు ఆ మార్పునకు ప్రతీకగా రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెట్టారు.. కానీ అధికారం మారినా, నేతలు మారిన ప్రజల తలరాతలు మాత్రం మార్చడం వీలుకాదని రేవంత్ సర్కార్ నిరూపిస్తున్నట్టు చెప్పుకుంటున్నారు..
ఇక గత బీఆర్ఎస్ ప్రభుత్వం.. మిగులు రాష్ట్రంగా ఏర్పడిన తెలంగాణను లక్షల కోట్ల అప్పుల పాలు చేసిందని, అవినీతికి కేంద్రంగా మార్చిందని ఆరోపిస్తూ కాంగ్రెస్ పార్టీ అధికార పగ్గాల కోసం హంగామా సృష్టించింది. ఈ క్రమంలో రేవంత్ రెడ్డి నేతృత్వంలో ప్రజాపాలన పేరుతో కొత్త అధ్యాయం మొదలైందని భావించిన తెలంగాణ ప్రజలకు, కాలం గడిచేకొద్దీ భ్రమలు తొలగిపోతున్నాయనే టాక్ వినిపిస్తుంది.
దీనికి కారణం లేకపోలేదు.. ఎందుకంటే అమలుకు వీలు లేని హామీలు ఇచ్చిన కాంగ్రెస్.. అధికారంలోకి వచ్చాక వాటిని దాటవేస్తున్న విషయాన్ని గమనిస్తున్న ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నట్టు చెబుతున్నారు. అయితే ప్రస్తుతం రేవంత్ సర్కార్ అమలు చేస్తున్న పథకాల వల్ల పడుతున్న ఆర్థిక భారాన్ని ఏదో ఒక రూపంలో మళ్లీ ప్రజలపైనే రుద్దుతుందనే విషయం స్పష్టంగా అర్థం చేసుకుంటున్నారు ప్రజలు..
గత బీఆర్ఎస్ ఈ పని చేయలేదా? అంటే.. అందుకే కదా ఆ పార్టీని పక్కకు పెట్టారు అనే సమాధానం వస్తుంది. ఇక అవసరానికి నోటికి వచ్చిన హామీలు ఇవ్వడం అమలు చేయలేక ప్రజల రక్తాన్ని పీల్చడం నేటి రాజకీయ నేతలకు ఒక అలవాటుగా మారిందనే విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. మరోవైపు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరాలు గడుస్తున్నా, ఆరు గ్యారెంటీలు ఎటు పోయాయి? ఆర్థిక పరిస్థితి సుస్థిరమైందా లేదా మరింత దిగజారిందా? అన్నది రాష్ట్రంలో చర్చాంశనీయంగా మారిందని అంటున్నారు.
బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రం నాశనమైందని చెప్పిన కాంగ్రెస్.. ఇప్పుడు తెలంగాణను ఏ దిశలో నడిపిస్తోందనే ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి.. సాధారణంగా పేదలకు విద్య, వైద్యం వంటి ప్రాథమిక రంగాలు అందుబాటులోకి తీసుకురావడానికి ప్రభుత్వం కృషి చేయాలి.. కానీ ప్రభుత్వం మహాలక్ష్మి ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని ఎంతో ఆర్బాటంగా అమల్లోకి తెచ్చింది. దీనివల్ల మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వల్ల సౌకర్యం కలిగిందనే మాట నిజమే..
కానీ ఒక ఇంటి యజమాని ఏ పని చేయకుండా దమ్మిడి ఆదాయం లేకుండా కూర్చుని తింటే.. ఆ కుంటుంబ పరిస్థితి ఏమవుతుందో అందరికీ తెలిసిందే. అంతెందుకు కూర్చుని తింటే కొండలయిన కరుగుతాయనే సామెత ఉంది. ప్రస్తుతం ఆర్టీసీ పరిస్థితి కూడా ఇలాగే ఉందనే ఆరోపణలు తీవ్రంగా వెల్లువెత్తుతున్నాయి.. ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ప్రవేశ పెట్టిన పథకం వల్ల.. ఆర్టీసీ తీవ్ర నష్టాలు ఎదురవుతున్నాయనే చర్చలు అంతర్గతంగా సాగుతున్నట్టు తెలుస్తుంది.
మరోవైపు ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించి ఆర్టీసీకి చెల్లించాల్సిన వేల కోట్ల రూపాయల రీయింబర్స్‌మెంట్‌ను ప్రభుత్వం సకాలంలో ఇస్తోందని మంత్రులు చెప్పడం తెలిసిందే.. అయితే ప్రభుత్వం ఆర్టీసీకి డబ్బులు చెల్లిస్తున్నామని చెబుతున్నా క్షేత్ర స్థాయిలో ఇందులో ఉన్న నిజం ఎంత అనేది క్లారిటీ లేదు.. ఒకవేళ ఆర్టీసీకి డబ్బులు చెల్లిస్తుంటే.. ఆ నిధులన్నీ మద్యం పన్నులు, విద్యుత్ ఛార్జీల పెంపు, పన్నుల భారం రూపంలో సామాన్య ప్రజల జేబుల నుంచే వసూలు చేస్తున్నారన్నది బహిరంగ రహస్యం అంటున్నారు..
ఈ పరిస్థితుల్లో రవాణా రంగం తీవ్ర సంక్షోభంలోకి వెళ్తుంటే, సుదీర్ఘ కాలంలో ఆర్టీసీ మనుగడ ప్రశ్నార్థకంగా మారే ప్రమాదం ఉందనే హెచ్చరికలు కూడా ఆర్థిక విశ్లేషకుల నుంచి వస్తున్నాయి. ఇక రాష్ట్ర వనరులను, భూములను, ఇసుకను గత బీఆర్ఎస్ ప్రభుత్వం దోచుకుందని నాడు రేవంత్ రెడ్డి తీవ్రంగా ఆరోపించారు. తమ ప్రభుత్వం వస్తే, ఆ వనరుల ద్వారా వచ్చే ప్రతి రూపాయిని పారదర్శకంగా రాష్ట్ర ప్రజలకు పంచుతామని హామీ ఇచ్చిన విషయం ఇంకా ప్రజలు మరచిపోలేదు..
అందుకే ఇన్నాళ్ల కాంగ్రెస్ పాలనలో ప్రభుత్వం ఎంత కొత్త ఆదాయాన్ని సృష్టించిందనే ప్రశ్నలు వేస్తున్నారు.. దానిలో ప్రజలకు ఎంత పంచారనే విషయాలపై స్పష్టమైన లెక్కలు చెప్పే ధైర్యం రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఉందా అని అడుగుతున్నారు.. ముఖ్యంగా అధికారంలోకి రాకముందు మాట్లాడిన కొత్త రాబడి మాటలు, అధికారంలోకి వచ్చాక ఆచరణలో కనిపించడం లేదనే విమర్శలు రేవంత్ సర్కార్ పై ఉన్నాయి..
పారదర్శకత అనే పదం ప్రకటనలకే పరిమితమైందని ఆదాయ సృష్టి లేకపోగా, నిత్యం కొత్త అప్పుల కోసం రిజర్వ్ బ్యాంక్ తలుపు తట్టడం, వేలం పాటల ద్వారా ప్రభుత్వ భూములను విక్రయించడం కాంగ్రెస్ ఆర్థిక విధానంగా మారిందనే విమర్శలు ఉన్నాయి. మరోవైపు దేశ రాజకీయాల్లో కాంగ్రెస్ అంటేనే కరప్షన్ అనే ముద్ర దశాబ్దాలుగా ఉందనేది విపక్షాలు ప్రధానంగా చేస్తున్న ఆరోపణ. ఈ నేపథ్యంలో మేము రాష్ట్రాన్ని దోచుకోవడం లేదు, పారదర్శకంగా పాలిస్తున్నామని కాంగ్రెస్ నేతలు చెబుతున్న మాటలను ప్రజలు నమ్మే పరిస్థితి లేదని అంటున్నారు..
పాలనలో ముఖాలు మారాయి కానీ, తెలంగాణలో ఉన్న విలువైన వనరులు ఇప్పటికీ దోపిడీకి గురవుతున్నాయనేది నిష్టూర సత్యమని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. అదేవిధంగా పారదర్శకమైన పాలన అందిస్తామన్న ప్రభుత్వం, కనీసం నిధుల కేటాయింపులపై శ్వేతపత్రాలు విడుదల చేయడానికి కూడా వెనకడుగు వేస్తుండటం పలు అనుమానాలకు బలాన్ని చేకూరుస్తోందనే టాక్ వినిపిస్తుంది.
ప్రజా సంక్షేమాన్ని గాలికి వదిలేసి కేవలం ఓటు బ్యాంకు రాజకీయాల కోసమే ప్రాధాన్యత లేని ఉచిత పథకాలకు వేల కోట్లు మళ్లిస్తున్నారనే విమర్శలు రోజు రోజుకు రేవంత్ సర్కార్ పై తీవ్రమవుతున్నాయి. బస్తీ దవాఖానాల్లో, ప్రభుత్వ పాఠశాలల్లో, కళాశాలల్లో మౌలిక వసతులు లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. అలాగే ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఔషధాల కొరత, ఆరోగ్యశ్రీ నిధుల బకాయిలు పెరిగిపోతున్నాయనే ఆరోపణలున్నాయి..
మరోవైపు రైతు భరోసా, రుణమాఫీ, మహిళలకు నెలకు 2,500 వంటి కీలక గ్యారెంటీల అమలులో ప్రభుత్వం కొర్రీలు పెడుతూ ప్రజలను తీవ్ర నిరాశకు గురిచేశారు. ఎన్నికల సమయంలో సరియైన ప్రణాళిక లేకుండా హామీలు గుప్పించి, ఇప్పుడు వాటిని నెరవేర్చలేక అప్పుల ఊబిలోకి నెట్టడం వల్ల రాష్ట్ర భవిష్యత్తు ప్రమాదంలో పడుతోందనే సంకేతాలు ఉన్నట్టు విశ్లేషకులు చెబుతున్నారు..
ఇక అమలుకు సాధ్యం కాని హామీలతో అధికారంలోకి రావడం ఒక ఎత్తయితే, వాటి భారాన్ని మోయలేక ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేయడం మరొక ఎత్తు.. బీఆర్ఎస్ పాలనలో మొదలైన అప్పుల సుడిగుండం, కాంగ్రెస్ పాలనలో ఉచిత పథకాల మోజులో మరింత తీవ్రరూపం దాల్చుతోందనే ఆందోళనలు కూడా వ్యక్తం అవుతున్నాయి.. ముఖ్యంగా రాష్ట్ర వనరుల దోపిడీ ఆగకుండా, ఆదాయ సృష్టి జరగకుండా, కేవలం అప్పులు తెచ్చి అరకొర పథకాలు అమలు చేసుకుంటూ పోతే తెలంగాణ భవిష్యత్తు రానున్న రోజుల్లో తీవ్రంగా కుదేలవడం ఖాయమనే హెచ్చరికలు వ్యక్తమవుతున్నాయి.
ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికైనా ప్రకటనలకు స్వస్తి చెప్పి, వాస్తవ ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా స్పష్టమైన ప్రణాళికతో ముందుకు సాగకపోతే ప్రజల ఆగ్రహానికి గురికాక తప్పదనే సంకేతాలు వెలువడుతున్నట్టు విశ్లేషకులు తెలుపుచున్నారు.. పాలక పార్టీ మారింది. కానీ సామాన్యుడి జీవితంలో రావాల్సిన మార్పు అదే స్థాయిలో కనిపిస్తోందా అనే సందేహాలు కూడా ఉన్నాయి.. రైతుకు భరోసా, నిరుద్యోగికి ఉద్యోగం, మధ్యతరగతికి ఆర్థిక ఉపశమనం, యువతకు భవిష్యత్తుపై నమ్మకం.. ఇవన్నీ ప్రభుత్వ పనితీరుకు అసలైన కొలమానాలుగా చెప్పబడతాయి. కానీ రాష్ట్రంలో హామీలు కాగితాలకే పరిమితం అయినట్టు చర్చలు సాగడం కనిపిస్తుంది.
ఇక సాధారణంగా ప్రభుత్వం ఒక పథకాన్ని ప్రకటించినప్పుడు ప్రజల్లో ఆశలు పెరుగుతాయి. ఆ పథకం కోసం ఎదురు చూసే కుటుంబాలు పెరుగుతాయి. అప్పుడే పని పూర్తికాదు. ఆ పథకం తాలూకు లబ్ధి అందినప్పుడే ఆ హామీకి అర్థం ఉంటుంది. కానీ ప్రస్తుతం రేవంత్ ప్రభుత్వంలో హామీ ఇచ్చినప్పుడు కనిపించిన వేగం.. అమలు విషయంలోనూ కనిపించడం లేదనే ఆరోపణలున్నాయి.. అందుకే ప్రజల్లో ఏర్పడిన ఆశలు క్రమంగా అసంతృప్తిగా మారుతున్నాయని చర్చించుకుంటున్నారు..
అయితే గత ప్రభుత్వం చేసిన తప్పులను సరిదిద్దే క్రమంలో కొత్త తప్పులకు ప్రస్తుత ప్రభుత్వం తావివ్వకూడదని అంటున్నారు.. ఇక 2026–27 బడ్జెట్ విశ్లేషణ ప్రకారం, తెలంగాణ స్థూల దేశీయోత్పత్తి సుమారు రూ.19.62 లక్షల కోట్లుగా అంచనా వేయగా, ద్రవ్యలోటు రూ.58,459 కోట్లుగా నిర్దేశించారు. అదే సమయంలో ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి రాష్ట్ర బకాయి బాధ్యతలు జీఎస్డీపీలో 28.7 శాతానికి చేరవచ్చని అంచనా వేశారు.
అయితే ఈ గణాంకాలు రాష్ట్ర ఆర్థిక నిర్వహణలో ఇంకా పెద్ద సవాళ్లుగా మారే అవకాశం ఉన్నట్టు స్పష్టం చేస్తున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. అందుకే ప్రభుత్వంపై ప్రజల్లో అసంతృప్తి పూర్తిగా కలుగక ముందే.. కేసీఆర్ పాలనలో తప్పులు జరిగాయని చెప్పడం మానేసి.. తన పాలనలో తెలంగాణకు జరిగిన మేలు ఏంటో వివరించవలసిన బాధ్యత కూడా రేవంత్ రెడ్డిపైన ఉందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
ఇక ప్రజలను ఆకర్షించడానికి పథకాల పేరుతో అభివృద్ధి పనులను పూర్తిగా పక్కన పెట్టినా.. అభివృద్ధి పేరుతో పేదల సంక్షేమాన్ని నిర్లక్ష్యం చేసినా ప్రభుత్వానికి ప్రమాదమే.. అందుకే రేవంత్ రెడ్డి ప్రభుత్వం మూడు విషయాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.. అందులో మొదటిది.. సంక్షేమ పథకాల లబ్ధిదారులకు చెల్లింపుల్లో జాప్యం లేకుండా చూడటం. రెండోది.. అప్పులు, వడ్డీల భారం తగ్గించేలా ఆదాయ వనరులను పెంచడం. మూడోది.. భవిష్యత్తులో రాష్ట్రానికి ఆదాయం, ఉపాధి కల్పించే పెట్టుబడులకు ప్రాధాన్యత ఇవ్వడం..
ఇందుకు రాష్ట్రంలో సంపదను సృష్టించాలి. ఆ సంపదలో ప్రజలకు న్యాయమైన వాటా అందాలి. ఈ రెండింటినీ కలిపి ముందుకు తీసుకెళ్లినప్పుడే తెలంగాణ ఆర్థికంగా బలపడుతుందని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.. కాబట్టి రేవంత్ రెడ్డి ప్రభుత్వం గతాన్ని తవ్వుకుంటూ.. వర్తమానాన్ని నిర్లక్ష్యం చేస్తే.. పార్టీ రాజకీయ భవిష్యత్తుకు ఇదే చివరి అవకాశం అయినా ఆశ్చర్యపోవలసిన అవసరం లేదని అంటున్నారు..


