కేంద్ర ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ రాజీనామాకు డిమాండ్, ఎస్ఐఆర్కు వ్యతిరేకంగా నేషనల్ కాంగ్రెస్ పార్టీ దేశరాజధాని ఢిల్లీలో నిరసనలకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ పిలుపుమేరకు నవంబర్ 1 సుమారు 10వేల మందితో నిరసన ప్రదర్శన నిర్వహించాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. కేంద్రంలోని మోడీ సర్కార్.. సీఈసీని అడ్డం పెట్టుకుని ఓట్ చోరీకి పాల్పడుతోందని, అందుకే జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని నిరసనలకు రాహుల్ పిలుపునిచ్చారు.
దేశవ్యాప్తంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఢిల్లీకి తరలివెళ్లేందుకు సిద్ధమయ్యారు. దీంతో న్యూ ఢిల్లీలో కేంద్రం పటిష్ట పోలీసు బందోబస్తును ఏర్పాటు చేసింది. ఎక్కడికక్కడ రోడ్లను బ్లాక్ చేస్తున్నారు.ఇదిలాఉండగా, నవంబర్ 1న రాంలీలా మైదానంలో నిర్వహించ తలపెట్టిన నిరసన ర్యాలీని దీపావళి పండుగ ముగిసే వరకు వాయిదా వేయాలని ఢిల్లీ వ్యాపార సంఘాలు మరోసారి రాహుల్ గాంధీని కోరాయి. ఈ నిరసన ర్యాలీ కారణంగా పండుగ సీజన్ బిజినెస్ పూర్తిగా స్తంభించిపోతుందని, సుమారు 20 లక్షల మంది సాధారణ ప్రజలు, చిరువ్యాపారుల జీవనోపాధి తీవ్రంగా దెబ్బతింటుందని వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
రాంలీలా మైదానానికి 5 కిలోమీటర్ల పరిధిలోనే చాందినీ చౌక్, సదర్ బజార్, చావ్డీ బజార్ సహా 20కి పైగా ప్రముఖ హోల్సేల్ మార్కెట్లు విస్తరించి ఉన్నాయి. ధన్తేరాస్, దీపావళి పండుగ సందర్భంగా ముందస్తు కొనుగోళ్లు జరుగుతాయని, ఈ మార్కెట్లకు ప్రతిరోజూ దాదాపు 3 నుంచి 4 లక్షల మంది వినియోగదారులు వస్తుంటారని గుర్తుచేశారు. ఢిల్లీలో ఇటీవల వరుసగా నిరసనలు చేపడుతుండటం వలన గత 25 రోజులుగా బారికేడ్లు, ట్రాఫిక్ ఆంక్షల కారణంగా తాము ఇప్పటికే రూ.3వేల కోట్ల మేర వ్యాపారంలో నష్టాలు చవిచూశామని చాంబర్ ఆఫ్ ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ (CTI) ప్రతినిధులు పేర్కొన్నారు.
అతిపెద్ద పండుగ దీపావళికి సరిగ్గా వారం రోజుల ముందు ఈ భారీ సభను చేపడితే రోడ్ల మూసివేత, ప్రజారవాణా నిలిచిపోతుందని, మరో రూ. 10 వేల కోట్ల వ్యాపారం నష్టపోయే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయ పార్టీలకు శాంతియుతంగా నిరసన తెలిపే ప్రజాస్వామ్య హక్కును తాము గౌరవిస్తున్నామని, వ్యాపారుల ప్రయోజనాలు, ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఈ ర్యాలీని నవంబర్ 10 తర్వాత నిర్వహించాలని రాహుల్ గాంధీకి అత్యవసర విజ్ఞప్తి చేశారు.


