ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం మెటా (Meta) తన ఇన్‌స్టాగ్రామ్ (Instagram) వినియోగదారుల కోసం ఒక విప్లవాత్మక మార్పుకు శ్రీకారం చుట్టింది. ఇప్పటివరకు కేవలం కొన్ని సెకన్లు లేదా నిమిషాల వరకే పరిమితమైన రీల్స్ ఇకపై ఏకంగా 90నిమిషాల (గంటన్నర) నిడివి ఉన్న సుదీర్ఘ వీడియోలను పోస్ట్ చేసేలా కొత్త ఫీచర్‌పై ప్రయోగాలు చేస్తోంది. ప్రముఖ వీడియో స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారమ్ యూట్యూబ్‌కు (YouTube) గట్టి పోటీ ఇచ్చే లక్ష్యంతోనే మెటా ఈ సంచలనాత్మక నిర్ణయం తీసుకున్నట్లు సాంకేతిక నిపుణులు విశ్లేషిస్తున్నారు.
ఈ కొత్త వీడియో ఫార్మాట్‌కు ‘ఫీచర్స్’ (Features) అని పేరు పెట్టారు. ఈ ఫీచర్ ద్వారా క్రియేటర్లు తమ 90 నిమిషాల సుదీర్ఘ వీడియోలను ల్యాండ్‌స్కేప్ (Horizontal) మోడ్‌లో పోస్ట్ చేయడానికి వీలు కలుగుతుంది. ప్రస్తుతం అమెరికా, బ్రెజిల్‌లోని ఎంపిక చేసిన క్రియేటర్లకు మాత్రమే ప్రయోగాత్మకంగా ఈ ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకువచ్చారు. పాడ్‌కాస్ట్‌లు, కామెడీ షోలు, ఇంటర్వ్యూలు, డ్యాక్యుమెంటరీల వంటి నిడివి ఎక్కువ ఉన్న కంటెంట్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లోనే నేరుగా అందించడానికి ఇది ఎంతగానో ఉపయోగపడనుంది.
ఈ ఫీచర్‌లో మరో ప్రధాన ఆకర్షణ ఏమిటంటే.. క్రియేటర్లు తమ సుదీర్ఘ వీడియోలకు సంబంధించిన చిన్న రీల్‌ను (Short Reel) ముందుగా పోస్ట్ చేయవచ్చు. ఆ రీల్ చూసి ఆకట్టుకున్న యూజర్లు, దానిపై ఒకే ఒక్క క్లిక్‌తో పూర్తి గంటన్నర వీడియోను చూసే వెసులుబాటును కల్పించారు. ఈ వీడియోలు ఇన్‌స్టాగ్రామ్ ఫీడ్, ఎక్స్‌ప్లోర్ (Explore) విభాగాల్లో కూడా వినియోగదారులకు నేరుగా కనిపిస్తాయి.
అయితే, ఈ సుదీర్ఘ వీడియోల ద్వారా క్రియేటర్లకు లభించే ప్రకటనల ఆదాయం (Ad Revenue Sharing), దానికి సంబంధించిన నిబంధనలపై ఇన్‌స్టాగ్రామ్ ఇంకా ఎలాంటి అధికారిక స్పష్టత ఇవ్వలేదు. ప్రస్తుతానికి బ్రాండ్ భాగస్వామ్యాల ద్వారా క్రియేటర్లు ఆదాయం పొందే వెసులుబాటు ఉండగా, భవిష్యత్తులో యూట్యూబ్ తరహా మానిటైజేషన్ పాలసీని ప్రవేశపెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ ఫీచర్ ప్రపంచవ్యాప్తంగా అందరికీ ఎప్పటికీ అందుబాటులోకి వస్తుందనే దానిపై కంపెనీ త్వరలోనే ప్రకటన చేసే అవకాశం ఉంది.


