International

PM Modi: 'యుద్ధం కాదు.. శాంతే మార్గం' పుతిన్ ముందే మోదీ శాంతి మంత్రం!

రచన: Mamatha puppala4 నిమిషాల పఠనం

బిష్కెక్‌ వేదికగా జరుగుతున్న 26వ షాంఘై సహకార సంస్థ (ఎస్‌సీఓ) శిఖరాగ్ర సదస్సు సందర్భంగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ముందే ప్రధాని నరేంద్ర మోదీ శాంతి మంత్రాన్ని జపించారు. "ముగింపు లేని యుద్ధాల నుంచి.. యుద్ధానికి ముగింపు పలికే దిశగా అడుగులు పడాలి" అని పిలుపునిచ్చారు.

బిష్కెక్‌ వేదికగా జరుగుతున్న 26వ షాంఘై సహకార సంస్థ (ఎస్‌సీఓ) శిఖరాగ్ర సదస్సు సందర్భంగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ముందే ప్రధాని నరేంద్ర మోదీ శాంతి మంత్రాన్ని జపించారు. "ముగింపు లేని యుద్ధాల నుంచి.. యుద్ధానికి ముగింపు పలికే దిశగా అడుగులు పడాలి" అని పిలుపునిచ్చారు. గాంధీ, బుద్ధుడు నడిచిన నేతగా భారతదేశం ఎప్పుడూ శాంతినే కోరుకుంటుందని, శాంతి స్థాపనకు జరిగే ప్రతి ప్రయత్నానికి భారత్ మద్దతు ఇస్తుందని స్పష్టం చేశారు.

త్వరలోనే న్యూఢిల్లీ వేదికగా జరగనున్న బ్రిక్స్ (BRICS) సదస్సుకు రావాల్సిందిగా రష్యా అధ్యక్షుడిని ప్రధాని మోదీ ఆహ్వానించగా, అందుకు పుతిన్ సానుకూలంగా స్పందించారు. భారత్-రష్యాల మధ్య ఉన్న 'విశేష వ్యూహాత్మక భాగస్వామ్యం' నిరంతరం బలోపేతమవ్వడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కనబరుస్తున్న వ్యక్తిగత శ్రద్ధ, చొరవ, ఇరు నేతల మధ్య ఉన్న ఆప్యాయమైన స్నేహబంధమే ప్రధాన కారణమని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కొనియాడారు.

ఇరు దేశాల మధ్య కేవలం వ్యూహాత్మక, వాణిజ్యపరమైన ఒప్పందాలు మాత్రమే కాకుండా, బలమైన వ్యక్తిగత విశ్వాసం నిండి ఉందనడానికి ఈ సమావేశం నిదర్శనంగా నిలిచింది. ద్వైపాక్షిక సంబంధాల పురోగతిపై పుతిన్ తీవ్ర సంతృప్తిని వ్యక్తం చేస్తూ, గ్లోబల్ సౌత్, తూర్పు దేశాల మధ్య సమన్వయాన్ని పెంచే ఎస్‌సీఓ సదస్సు వేదికగా మోదీని కలవడం సంతోషంగా ఉందన్నారు.

ఇరు దేశాల మధ్య వాణిజ్య, ఆర్థిక రంగాలు ఎంతో ఆశాజనకంగా ఉన్నాయని, గత ఏడాది స్వల్ప తగ్గుదల నమోదైనప్పటికీ ఈ ఏడాది మొదటి ఆరు నెలల్లోనే వాణిజ్య టర్నోవర్ 2.6 శాతం వృద్ధి చెందిందని వెల్లడించారు. విద్యా రంగంలోనూ రెండు దేశాల భాగస్వామ్యం అద్భుతంగా సాగుతోందని, రష్యాలో చదువుకుంటున్న భారతీయ విద్యార్థుల సంఖ్య గత దశాబ్దంలో ఏడు రెట్లు పెరిగి దాదాపు 40వేలకు చేరడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు.

మరొకవైపు, 2027 నాటికి భారత్-రష్యా దౌత్య సంబంధాలు 80 ఏళ్ల మైలురాయిని చేరుకోనున్న దృష్ట్యా ఈ బంధాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని ఇరు నాయకులు నిర్ణయించారు. ద్వైపాక్షిక భేటీ ముగిసిన అనంతరం ప్రధాని మోదీ, అధ్యక్షుడు పుతిన్ ఒకే వాహనంలో ప్రయాణించి బిష్కెక్‌లో ప్రారంభమైన ‘వరల్డ్ నోమాడ్ గేమ్స్’ వేడుకకు కలిసి వెళ్లడం ప్రపంచ దౌత్య వర్గాలలో ఆకర్షణగా నిలిచింది.

#ModiPutinMeet#SCOSummit2026#IndiaRussiaTies#VladimirPutin#NarendraModi#BishkekSCO#swechaanews
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి