దేశవ్యాప్తంగా సెప్టెంబర్ నెలలో వర్షపాతం సాధారణం కంటే తక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) వెల్లడించింది. సాధారణంగా సెప్టెంబర్‌లో 167.9 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా, ఈసారి దీర్ఘకాలిక సగటులో 91శాతం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశాలు ఉన్నట్లు స్పష్టం చేసింది. వర్షాలు తగ్గుముఖం పట్టడంతో పాటు, దేశంలోని మెజారిటీ ప్రాంతాల్లో గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే గణనీయంగా పెరిగి ఎండ తీవ్రత, ఉక్కపోత ఎక్కువగా ఉంటుందని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు.
పసిఫిక్ మహాసముద్రంలో ఏర్పడిన బలమైన ‘ఎల్‌నినో’ (El Nino) వాతావరణ పరిస్థితులే ఈ తీవ్ర వైపరీత్యానికి ప్రధాన కారణమని ఐఎండీ స్పష్టం చేసింది. రాబోయే నెలల్లో ఈ ఎల్‌నినో ప్రభావం మరింత తీవ్రమయ్యే అవకాశం ఉండటంతో రుతుపవనాల నిష్క్రమణ సమయంలో వర్షాభావ పరిస్థితులు మరింత స్పష్టంగా కనిపించనున్నాయి. అయితే దేశంలోని వాయవ్య, ఈశాన్య, తూర్పు, ఆగ్నేయ ద్వీపకల్పంలోని కొన్ని పరిమిత ప్రాంతాల్లో మాత్రం సాధారణం నుంచి సాధారణం కంటే కాస్త ఎక్కువ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తన నివేదికలో పేర్కొంది.
వర్షాలు సాధారణం కంటే గణనీయంగా తగ్గిపోవడం వల్ల దేశంలో వ్యవసాయం, తాగునీటి సరఫరా, జలవిద్యుత్ ఉత్పత్తి రంగాలపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉందనే ఆందోళన వ్యక్తమవుతోంది. ముఖ్యంగా వానాకాలం సీజన్ సీజన్ ముగింపు దశలో ఉన్న పంటలకు నీటి ఎద్దడి తలెత్తే ముప్పు ఉండటంతో రైతాంగం తగిన ప్రత్యామ్నాయ సాగు ప్రణాళికలు, తడుల నిర్వహణ సిద్ధం చేసుకోవాలని నిపుణులు కోరుతున్నారు. అదేవిధంగా, పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లో జలవనరులను సమర్థవంతంగా మేనేజ్ చేస్తూ, నీటిని పొదుపుగా వాడుకోవాలని ప్రభుత్వ ఏజెన్సీలను వాతావరణ శాఖ అప్రమత్తం చేసింది.
ఇప్పటికే ఈ ఏడాది వర్షాకాలం ఆశించిన స్థాయిలో లేకపోగా, సెప్టెంబర్ నెల కూడా పొడిగా మారనుండటం ఆందోళన కలిగిస్తోంది. ఈ పరిస్థితులన్నింటినీ పరిగణనలోకి తీసుకుని రాబోయే అక్టోబర్-డిసెంబర్ కాలానికి సంబంధించిన ఈశాన్య రుతుపవనాల అధికారిక అంచనాలను సెప్టెంబర్ చివరి వారంలో విడుదల చేయనున్నట్లు ఐఎండీ అధికారులు తెలిపారు. రైతాంగం, నీటిపారుదల శాఖలు ఈ సూచనలను గమనించి ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంది.












