వికారాబాద్ జిల్లా వ్యవసాయ శాఖలో వేరుశనగ విత్తనాల పంపిణీ వ్యవహారం తీవ్ర కలకలం రేపుతోంది. వరుస ఆరోపణలు, విచారణల క్రమంలో తాజాగా మరొక కీలక అధికారిపై సస్పెన్షన్ వేటు పడింది. దౌల్తాబాద్ మండల వ్యవసాయాధికారిగా పనిచేసిన పీ. లావణ్యను సస్పెండ్ చేస్తూ వ్యవసాయ శాఖ డైరెక్టర్ డాక్టర్ బి. గోపీ ఉత్తర్వులు జారీ చేశారు..
అసలు వివాదం ఏమిటి?
2025–26 యాసంగి సీజన్‌లో ఎన్‌ఎంఈఓ–ఓఎస్ పథకం కింద రైతులకు వేరుశనగ విత్తనాలను పంపిణీ చేశారు. ఈ ప్రక్రియలో సబ్సిడీ యేతర మొత్తాన్ని ప్రభుత్వ ఖాతాలో జమ చేయడంలో భారీగా అక్రమాలు జరిగినట్లు అధికారులు గుర్తించారు. విధుల్లో నిర్లక్ష్యం వహించడం, నగదు జమ ప్రక్రియలో గోల్‌మాల్‌కు పాల్పడినందుకు గానూ లావణ్యపై క్రమశిక్షణా చర్యలు తీసుకున్నారు.
విచారణ నివేదికలతో కదిలిన ఫైల్
ఈ అక్రమాలపై వికారాబాద్ జిల్లా కలెక్టర్ నివేదికతో పాటు, అదనపు కలెక్టర్ నిర్వహించిన క్షేత్రస్థాయి విచారణ నివేదికను ఆధారం చేసుకుని ఈ చర్యలు చేపట్టారు. అందుబాటులో ఉన్న ఆధారాలను పరిశీలించిన అనంతరం లావణ్యను సస్పెండ్ చేయక తప్పలేదని డైరెక్టర్ స్పష్టం చేశారు. టీజీఎస్‌సీసీఏ నిబంధనల ప్రకారం విచారణ పూర్తయ్యే వరకు ఆమె సస్పెన్షన్‌లోనే ఉంటారు. ఈ సమయంలో ఆమె వికారాబాద్ హెడ్‌క్వార్టర్ వదిలి వెళ్లకూడదని, నిబంధనల ప్రకారం ఆమెకు జీవన నిర్వహణ భత్యం అందజేస్తామని స్పష్టం చేశారు. కాగా వ్యవసాయశాఖలో ప్రస్తుతం వేరుశనగ విత్తనాల నగదు జమ వ్యవహారం హాట్‌టాపిక్‌గా మారింది.
ఇప్పటికే ముగ్గురిపై వేటు!
మరోవైపు వేరుశనగ విత్తనాల గోల్ మాల్ వ్యవహారంలో గతంలోనే ఒక ఏడీఏ, మరొక ఎంఏఓ స్థాయి అధికారులపై చర్యలు తీసుకున్నారు. తాజాగా లావణ్య సస్పెన్షన్‌తో కలిపి ఇప్పటివరకు మొత్తం ముగ్గురు అధికారులు శాఖాపరమైన చర్యలకు గురయ్యారు. ఒకే విషయంలో వరుసగా ముగ్గురు అధికారులపై వేటు పడటం ఇప్పుడు వ్యవసాయ శాఖలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
మిగతా అధికారుల సంగతేంటి?
అయితే మండల స్థాయి అధికారులపై వేటు పడుతున్నా.. పర్యవేక్షణ బాధ్యతలు వహించాల్సిన ఉన్నతాధికారులపై చర్యలు ఏవని స్థానికంగా ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో రిటైర్మెంట్ దశలో ఉన్న డీఏఓ రాజరత్నం, టెక్నికల్ ఏడీఏ సందీప్ పాత్రపై ఎలాంటి నిర్ణయం తీసుకున్నారనేది ఇంకా స్పష్టం కాలేదు.
అదేవిధంగా ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గ పరిధిలోనే ఇలాంటి తీవ్రమైన అక్రమాలు వెలుగుచూడటం గమనార్హం. ఈ నేపథ్యంలో అవినీతి రహిత పాలనకు శ్రీకారం చూట్టాలని ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు ఇలాంటి కొందరి వల్ల ఫలించలేక పోతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.. ఇప్పటికైనా ప్రభుత్వ పెద్దలు ఇలాంటి అంశాలపై కఠిన చర్యలు తీసుకోవాలనే విజ్ఞప్తులు వినిపిస్తున్నాయి..












