ACB Raids: హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రిలో మరోసారి తనిఖీల కలకలం రేగింది. ఏసీబీ అధికారులు సహా డ్రగ్ కంట్రోల్, ఫుడ్ సేఫ్టీ అధికారులు రంగంలోకి దిగారు. ఏకకాలంలో సోదాలు చేస్తున్నారు. మూడు శాఖలకు సంబంధించిన అధికారులు తనిఖీల్లో పాల్గొన్నారు. నిమ్స్ డాక్టర్ లక్ష్మీ భాస్కర్ వ్యవహారంలో ఈ తనిఖీలు కొనసాగుతున్నాయి. క్యాంటీన్ తో పాటు మెడికల్ స్టోర్స్ నుంచి పెద్ద ఎత్తున లంచాలు తీసుకున్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. ఏటా రూ.50 లక్షల వరకు లంచాల రూపంలో వెళ్తున్నట్లు కనుగొన్నారు. నిమ్స్ అడిషనల్ సూపరింటెండెంట్ లక్ష్మీ భాస్కర్ కేసులో దొరికిన లింకుల ఆధారంగా ఈ సోదాలు చేస్తున్నారు.
ఏకకాలంలో ఏసీబీ, ఫుడ్ సేఫ్టీ, డ్రగ్ కంట్రోల్ అధికారుల సోదాలు
నిమ్స్ పరిపాలనా విభాగంలో రికార్డులను చెక్ చేశారు ఏసీబీ అధికారులు. మరోవైపు నిమ్స్ క్యాంటీన్లో నాలుగు టీమ్స్ ముమ్మరంగా తనిఖీలు చేపట్టాయి. సర్జికల్ స్టోర్లో మందులు, పరికరాల నిల్వల రికార్డులను నలుగురు డ్రగ్ ఇన్స్పెక్టర్ల బృందం తనిఖీ చేసింది. నిమ్స్ లో ఏక కాలంలో ఏసీబీ, ఫుడ్ సేఫ్టీ, డ్రగ్ కంట్రోల్ అధికారులు సోదాలు చేపట్టడం చర్చనీయాంశంగా మారింది. అధికారులు పలు రికార్డులు స్వాధీనం చేసుకున్నారు. కీలక స్థానాల్లో ఉన్న కొంతమంది అధికారులకు మెడికల్ స్టోర్స్, సర్జికల్ స్టోర్స్, క్యాంటీన్ నుంచి లంచాలు వెళ్లినట్లు గుర్తించారు.
లక్ష్మీ భాస్కర్ కేసు ఆధారంగా సోదాలు
ఇటీవల నిమ్స్ డాక్టర్ లక్ష్మీ భాస్కర్ పై ఏసీబీ అవినీతి కేసులు నమోదు చేసింది. లక్ష్మీ భాస్కర్ భారీగా అవినీతికి పాల్పడినట్లు గుర్తించింది. ఆయన ఇళ్లు, ఆఫీసుల్లో సోదాలు జరిపినప్పుడు పెద్ద ఎత్తున నగదు, ఆస్తిపత్రాలను ఏసీబీ స్వాధీనం చేసుకుంది. లక్ష్మీ భాస్కర్ లింక్స్ ఆధారంగానే ప్రస్తుతం ఏసీబీ సోదాలు జరుపుతోంది. కీలక అధికారులకు పెద్ద ఎత్తున లంచాలు వెళ్తున్నట్లు గుర్తించారు. డ్రగ్ కంట్రోల్ కి సంబంధించి డ్రగ్స్, సర్జికల్ మెటీరియల్ పెద్ద ఎత్తున పక్కదారి పట్టిస్తున్నారని.. వాటిలో లంచాల రూపంలో అధికారులు తీసుకుంటున్నారని గుర్తించారు.
క్యాంటీన్లోనూ అవకతవకలు.. పెద్దఎత్తున లంచాలు
మరోవైపు క్యాంటీన్ కి సంబంధించి కూడా పెద్దఎత్తున అధికారులకు లంచాలు ముడుతున్నాయి, క్యాంటీన్ లోనూ అవకతవకలు జరుగుతున్నాయని ఏసీబీ అధికారులు గుర్తించారు. దీని ఆధారంగానే ఫుడ్ సేఫ్టీ అధికారులు సైతం రంగంలోకి దిగి నిమ్స్ క్యాంటీన్ లో సోదాలు జరుపుతున్నారు. కొన్ని శాంపుల్స్ కూడా సేకరించి తూకం చేస్తున్నారు. క్యాంటీన్ లో ఎవరెవరికి ఏ రూపంలో కాంట్రాక్టులు ఇచ్చారు, కాంట్రాక్టులు ఇచ్చినందుకు అధికారులకు లంచాల రూపంలో ముట్టజెప్పారా, లేక కమీషన్ రూపంలో నెలకు ఎంత అందుతోంది అనేదాని గురించి ఆరా తీస్తున్నారు.


