ఆరుగాలం కష్టపడి పంట పండించిన రైతులకు కన్నీళ్లే మిగులుతున్నాయి.. వ్యవసాయం దండగా అనే ఆలోచనలు కలుగుతున్న నేటి రోజుల్లో ఇంకా భూమినే నమ్ముకున్న శ్రమ జీవులు రైతులు.. ప్రస్తుతం నెలకొన్న వాతావరణ పరిస్థితుల వల్ల వారు ఎదుర్కొంటున్న ఇబ్బందులు వర్ణాతీతంగా మారాయి.. ఒకవైపు రైతు లేకపోతే మనిషికి మనుగడ లేదని తాము ఎప్పుడు రైతు క్షేమమే కోరుకుంటామని చెప్పుకుంటున్న రాజకీయ నాయకులు.. మరోవైపు రైతు సంక్షేమాన్ని మరచి జేబులు నింపుకుంటున్న పాలకులు..
మొత్తానికి రైతు కన్నీళ్ళు నీటి మీది రాతలుగా చూస్తూ.. వారికిచ్చిన హామీలు కాగితాలకే పరిమితం చేసిన ప్రభుత్వాల తీరుతో వ్యవసాయం, వృధాసాయంగా మారుతుందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.. దీనికి తోడు ప్రకృతి ప్రకోపం వల్ల రాష్ట్రంలో రైతుల పరిస్థితి దారుణంగా ఉందనే విమర్శలు ఎదురవుతున్నాయి.. నీళ్లులేక, కరెంట్ రాక అప్పులు చేసి పంటలు పండిస్తే తీరా అమ్ముకునే సమయానికి గిట్టిబాటు ధర కూడా దక్కకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు.
ఈ నేపథ్యంలో పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు సైతం కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా పత్తికి గిట్టుబాటు ధర కల్పించాలని వికారాబాద్ జిల్లా కొడంగల్ మండలం నీటూర్ గేటు సమీపంలోని విజయ్ ఇండస్ట్రీస్ కాటన్ మిల్లు వద్ద రైతుల నిరసన చేపట్టారు. నీళ్లు లేక దిగుబడి తగ్గితే, ఉన్న పత్తికి కూడా సరైన ధర ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తూ రైతులు ఆందోళనకు దిగారు. ఇది రేవంత్ రెడ్డి నియోజకవర్గం కావడంతో రాజకీయ వర్గాలలో చర్చనీయాంశంగా మారింది.
మరోవైపు వరి పండించిన రైతుల పరిస్థితి కూడా దయనీయంగా మారిందనే ఆరోపణలున్నాయి.. ఒకవైపు బియ్యం ధరలు సెంచరికి చేరువలో ఉండగా వడ్లకు మాత్రం గిట్టుబాటు ధర కూడా దక్కడం లేదని ఆవేదన చెందుతున్న రైతులు సోషల్ మీడియా వేదికగా తమ గోడు వెళ్లబోసుకుంటున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి.. మిల్లర్లు, దళారులు సిండికేట్‌గా మారి ధరలను తగ్గిస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు.
అదీగాక ఏపీలో నెలకొన్న తుఫాను ప్రభావంతో ఆకాశం మేఘావృతం కావడంతో రాష్ట్రంలో వర్షాలు పడతాయేమోనన్న భయం రైతులను వెంటాడుతోంది. దీంతో కొందరు గిట్టుబాటు ధర కోసం ఎదురుచూడక, అందుబాటులో ఉన్న ధరకే ధాన్యాన్ని విక్రయించాల్సిన పరిస్థితి ఏర్పడిందని వాపోతున్నారు. గతంలో రైతులకు పంట కోతలకు ముందే అడ్వాన్స్ ఇచ్చి ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు ముందుకొచ్చిన వ్యాపారులు, ఇప్పుడు తక్కువ ధరకు అమ్మాలని ఒత్తిడి చేస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇక నష్టాలను పూడ్చులేక రైతులు ఇబ్బందులు పడుతుండగా మరోవైపు వాతావరణ పరిస్థితులు రైతులను కలవరపెడుతున్నాయి. తుఫాను ప్రభావంతో ఎప్పుడు వర్షాలు పడతాయోనన్న ఆందోళన నెలకొంది. వరి కోతలు పూర్తిచేసి ధాన్యాన్ని ఆరబెట్టి, తేమ శాతం తగ్గిన తర్వాత విక్రయించాలంటే సమయం పడుతుంది. ఈలోగా వర్షాలు కురిస్తే పంట తడిసి నష్టపోయే ప్రమాదం ఉందని రైతులు భయపడుతున్నారు.
దీంతో కొందరు రైతులు పంటను పొలంలోనే పచ్చి ధాన్యంగా విక్రయించేందుకు సిద్ధమవుతున్నారు. ఈ పరిస్థితిని ఆసరాగా చేసుకుని కొందరు వ్యాపారులు ధరలను మరింత తగ్గిస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. పంట చేతికొచ్చిన సమయంలోనే ధరలు పడిపోవడంతో ఏం చేయాలో తెలియని పరిస్థితి నెలకొందని వాళ్ళు వాపోతున్నారు. మరోవైపు మార్కెట్‌లో బియ్యం ధరలు భారీగా పెరిగాయని, కొన్ని సన్న రకాల బియ్యం క్వింటాల్‌కు రూ.10 వేల వరకు పలుకుతున్నాయని రైతులు, వినియోగదారులు పేర్కొంటున్నారు.
అదేవిధంగా కరువు పరిస్థితుల్లోనూ కష్టపడి పంట పండించిన రైతులకు గిట్టుబాటు ధర లభించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ధాన్యం కొనుగోళ్లపై అధికారులు నిరంతరం పర్యవేక్షణ చేపట్టాలని, ధరల తగ్గింపునకు గల కారణాలను పరిశీలించాలని, మిల్లర్లు, దళారులు సిండికేట్‌గా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలపై విచారణ జరిపి, అక్రమాలు జరిగితే చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు.


