Jio IPO: దలాల్ స్ట్రీట్ చరిత్రలో సరికొత్త అధ్యాయం మొదలైంది. భారత కార్పొరేట్ దిగ్గజం ముకేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ అనుబంధ సంస్థ 'జియో ప్లాట్‌ఫామ్స్ లిమిటెడ్' స్టాక్ మార్కెట్లోకి అడుగుపెడుతూనే సరికొత్త రికార్డులను తిరగరాసింది. ఏకంగా రూ.30,213 కోట్ల భారీ సైజుతో దేశ చరిత్రలోనే అతిపెద్ద ఐపీఓగా మార్కెట్లోకి వచ్చిన జియో.. ఇన్వెస్టర్లకు ఊహకందని లాభాల పంట పండించింది. బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈలలో జియో షేర్లు అదరగొట్టే రేంజ్‌లో లిస్ట్ కావడంతో ఇన్వెస్టర్ల సంబరాలు అంబరాన్నంటాయి.
95 నిమిషాల్లోనే క్లోజ్..
ఈ ఐపీఓకు వచ్చిన డిమాండ్ చూసి మార్కెట్ పండితులే విస్తుపోయారు. ఏకంగా రూ.7.33 లక్షల కోట్ల విలువైన బిడ్లు వెల్లువెత్తడంతో ఈ పబ్లిక్ ఇష్యూ 22.19 రెట్లు ఓవర్ సబ్‌స్క్రైబ్ అయింది. దేశ చరిత్రలోనే అత్యంత వేగంగా, బిడ్డింగ్ మొదలైన కేవలం 95 నిమిషాల్లోనే 100 శాతం సబ్‌స్క్రిప్షన్ పూర్తి చేసుకుని రికార్డు సృష్టించింది. దాదాపు 1.3 కోట్ల మందికి పైగా సాధారణ ఇన్వెస్టర్లు తమ కష్టార్జితాన్ని నమ్మి జియో చేతుల్లో పెట్టడం భారత కార్పొరేట్ రంగంలోనే ఒక అద్భుతంగా నిలిచింది.
వేదికపై కన్నీళ్లు పెట్టుకున్న ముకేష్ అంబానీ
ముంబైలో జరిగిన ఈ చారిత్రాత్మక లిస్టింగ్ వేడుక అంబానీ కుటుంబానికి ఒక భావోద్వేగ ఘట్టంగా మారింది. వేదికపై ఆకాష్, ఈషా, అనంత్ అంబానీలు తమ తండ్రి పడిన శ్రమను, విజన్‌ను గుర్తుచేసుకుంటూ మాట్లాడుతుండగా.. ముందు వరుసలో కూర్చున్న రిలయన్స్ అధినేత ముకేష్ అంబానీ తీవ్ర భావోద్వేగానికి లోనై కన్నీళ్లు తుడుచుకున్నారు. మూడు తరాల ప్రయాణంలో సాధించిన ఈ విజయం తండ్రిగా ఆయన కళ్లలో ఆనందబాష్పాలను నింపింది.
‘వ్యాపారం ఒక పూజ.. జియో ప్రజలకు ప్రసాదం’: అనంత్ అంబానీ
ఈ వేదికపై అనంత్ అంబానీ మాట్లాడిన మాటలు అందరినీ కదిలించాయి. "స్టాక్ ఎక్స్ఛేంజ్‌లో గంట మోగడమంటే గుడిలో గంట మోగినట్లే. వ్యాపారం మాకు ఒక పూజ లాంటిది.. జియో భారత ప్రజలకు దక్కిన ప్రసాదం" అని ఆయన అభివర్ణించారు. కొవిడ్ లాక్‌డౌన్ సమయంలో ప్రపంచమంతా ఆగిపోయినా జియో నెట్‌వర్క్ వల్ల చదువులు ఆగలేదని, తల్లిప్రేమకు సాంకేతికత తోడైందని గుర్తుచేశారు. భారత్ ఎప్పుడూ వెనుకబడి ఉండకూడదన్న తండ్రి సంకల్పానికి అనుగుణంగా, తాము ముగ్గురం వేర్వేరు శరీరాలైనా ఒకే ఆత్మలా కలిసి పనిచేస్తామని స్పష్టం చేశారు.
13 ఏళ్లుగా నిద్రలేని రాత్రులు..
1977లో రిలయన్స్ తొలి పబ్లిక్ ఇష్యూ సమయంలో 20 ఏళ్ల యువకుడిగా తండ్రి ముకేష్ పడిన శ్రమను ఈ సందర్భంగా ఈషా అంబానీ గుర్తుచేసుకున్నారు. గత 13 ఏళ్లుగా జియోను అగ్రస్థానంలో నిలబెట్టేందుకు ఆకాష్ అర్ధరాత్రి వరకు నిరంతరం శ్రమిస్తూనే ఉన్నాడని చెప్పారు. మొదట్లో లాభాలు రాకపోయినా, ప్రతీ భారతీయుడికి ప్రపంచ స్థాయి టెక్నాలజీని అత్యంత తక్కువ ధరకే అందించాలన్న సంకల్పంతో మొదలైన ప్రయాణం.. నేడు గ్లోబల్ లెవల్‌లో రికార్డులను తిరగరాసిందని ఆకాష్ అంబానీ పేర్కొన్నారు. దలాల్ స్ట్రీట్‌లో సరికొత్త శకానికి నాంది పలికిన ఈ జియో లిస్టింగ్.. ఇండియన్ స్టాక్ మార్కెట్ సత్తా ఏంటో ప్రపంచానికి మరోసారి ఘనంగా చాటిచెప్పింది.


