Sunil Bansal: తెలంగాణలో అధికారం దక్కించుకోవడమే లక్ష్యంగా బీజేపీ అధిష్ఠానం అస్త్రశస్త్రాలను సిద్ధం చేస్తోంది. రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్‌ఛార్జ్‌గా రెండోసారి బాధ్యతలు చేపట్టిన ‘ఎలక్షన్ మాస్టర్ మైండ్’ సునీల్ బన్సల్.. తెలంగాణపై కన్నేశారు. బెంగాల్, ఒడిశా వంటి గడ్డు కోటలను సైతం బీజేపీ ఖాతాలో వేయడంలో కీలక పాత్ర పోషించిన బన్సల్, ఇప్పుడు తెలంగాణను తన వ్యక్తిగత ‘ఇజ్జత్ కా సవాల్’గా మార్చుకున్నారు. అక్కడ సక్సెస్ కొట్టి ఇక్కడ విఫలమైతే తన ట్రాక్ రికార్డుకు మచ్చ పడుతుందన్న భావనతో, తెలంగాణలో కాషాయ జెండా ఎగరేయాల్సిందేనని అత్యంత పట్టుదలతో పావులు కదుపుతున్నారు.
యూపీ టూ బెంగాల్.. ఇక నెక్స్ట్ టార్గెట్ తెలంగాణే
గతంలో ఉత్తరప్రదేశ్‌లో సంస్థాగత ప్రధాన కార్యదర్శిగా ఉంటూ బీజేపీని తిరుగులేని విజయపథంలో నడిపించిన ఘనత సునీల్ బన్సల్ సొంతం. ఆ తర్వాత ఆయన మార్గదర్శకత్వంలోనే బెంగాల్, ఒడిశాలలో బీజేపీ చారిత్రక విజయాలు నమోదు చేసి ప్రభుత్వాలను ఏర్పాటు చేయగలిగింది. ఇప్పుడు ఆయన బాధ్యతల్లో పెండింగ్‌లో ఉన్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమే. అందుకే మిగిలిన రాష్ట్రాల్లో కనిపించిన దూకుడును ఇక్కడా కొనసాగించి, వచ్చే ఎన్నికల్లో తెలంగాణ గడ్డపై పాగా వేయడమే ఏకైక లక్ష్యంగా బన్సల్ వ్యూహరచన చేస్తున్నారు. "తెలంగాణలో అధికారం మాదే" అని ఆయన నేతలతో గంటాపథంగా స్పష్టం చేస్తున్నారు.
పార్టీ కేంద్రంగానే రాజకీయం
తెలంగాణ బీజేపీలో ఎవరికి వారే యమునా తీరే అన్నట్లు సాగే గ్రూపు రాజకీయాలకు బ్రేక్ వేసేందుకు బన్సల్ కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నారు. గ్రూపులు కట్టేవారికి, కేవలం తమ వ్యక్తిగత ఇమేజ్ నమ్ముకుని బతికేవారికి పార్టీలో ఎలాంటి స్థానం ఉండబోదని ఆయన అంతర్గత సమావేశాల్లో హెచ్చరించినట్లు సమాచారం. వ్యక్తులను నమ్ముకుంటే సీట్లు రావని, పార్టీనే పరమావధిగా భావించి పనిచేస్తేనే టికెట్లు వస్తాయని కుండబద్దలు కొట్టారు.
‘జోగే బ్యాచ్‌కు చెక్’..
తెలంగాణ బీజేపీలో తిష్ఠవేసి కార్యకలాపాలు చేయకుండా కేవలం పదవుల కోసం ‘జోగే’ నేతలకు ఇకపై పుట్టగతులు ఉండవని బన్సల్ స్పష్టం చేశారు. క్షేత్రస్థాయిలో కష్టపడి పనిచేసే సామాన్య కార్యకర్తలు, నాయకులకే అసలైన ప్రాధాన్యత ఉంటుందని వెల్లడించారు. త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా సుడిగాలి పర్యటనలు చేపట్టి గ్రౌండ్ లెవల్‌లో కేడర్‌ను ఉత్తేజపరచడానికి ఆయన రూట్ మ్యాప్ సిద్ధం చేస్తున్నారు. ఎప్పుడూ నైరాశ్యంలో, ఆధిపత్య పోరుతో మునిగి తేలే తెలంగాణ బీజేపీని సునీల్ బన్సల్ ఏ మేరకు దారికి తెస్తారు? అసెంబ్లీ రేసులో కమలాన్ని విజేతగా ఎలా నిలుపుతారనేది ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.


