ఏపీ

అర్నబ్ తుపాన్ బాధితులకు అమిత్ షా అభయం.. 4 రాష్ట్రాల సీఎంలతో సమీక్ష!

రచన: Mamatha puppala••5 నిమిషాల పఠనం

దేశంలోని పలు తీర ప్రాంత రాష్ట్రాలను కుదిపేస్తున్న 'ఆర్నబ్ తుఫాన్' (Cyclone Arnab) ప్రభావం, నష్ట తీవ్రతపై కేంద్ర ప్రభుత్వం అత్యున్నత స్థాయిలో స్పందించింది. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తుపాన్ ప్రభావిత రాష్ట్రాల సీఎంలతో ఫోన్‌లో మాట్లాడి మాట్లాడి పరిస్థితులపై విస్తృత సమీక్ష నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్, పుదుచ్చేరి, ఒడిశా, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మాట్లాడిన ఆయన, తుపాన్ సృష్టించిన విధ్వంసం, చేపడుతున్న సహాయక చర్యలను అడిగి తెలుసుకున్నారు.

 తుపాన్ ధాటికి దెబ్బతిన్న ప్రాంతాల్లో ఎన్‌డీఆర్‌ఎఫ్ (NDRF), ఎస్డీఆర్‌ఎఫ్ (SDRF) బలగాలు ఇప్పటికే రంగంలోకి దిగి బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించడం, సహాయ పునరావాస కార్యక్రమాలను యుద్ధప్రాతిపదికన నిర్వహిస్తున్నాయని కేంద్ర హోంమంత్రి తెలిపారు. ఆర్నబ్ తుఫాన్ వల్ల సంభవించిన పంట, ఆస్తి, మౌలిక సదుపాయాల నష్ట తీవ్రతను ప్రత్యక్షంగా విశ్లేషించడానికి త్వరలోనే ఇంటర్-మినిస్టీరియల్ కేంద్ర బృందాలు (IMCTs) ప్రభావిత రాష్ట్రాల్లో పర్యటిస్తాయని వెల్లడించారు. ప్రకృత్తి విపత్తు సంభవించిన ఈ కష్టసమయంలో కేంద్ర ప్రభుత్వం పటిష్టమైన కట్టుబాటుతో బాధితులకు అండగా నిలుస్తుందని ఆయన పునరుద్ఘాటించారు.

 ఇప్పటికే ఏపీలో ఆర్నబ్ తుపాన్ వల్ల తీవ్ర ఆస్తి, పంట నష్టం వాటిల్లడంతో సీఎం నారా చంద్రబాబు నాయుడు కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు లేఖ రాయడంతో పాటు నేరుగా ఫోన్‌లో మాట్లాడి పరిస్థితిని వివరించిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాలు, ఈదురుగాలుల కారణంగా వేలాది ఎకరాల్లో పంటలు దెబ్బతినడమే కాకుండా ఇళ్లు, రోడ్లు, విద్యుత్ స్తంభాలు ధ్వంసమయ్యాయని ఆయన వెల్లడించారు. ముందస్తు చర్యల వల్ల ప్రాణనష్టాన్ని నివారించగలిగామని, వీలైనంత త్వరగా నష్టాన్ని అంచనా వేసేందుకు విపత్తు నిర్వహణ కేంద్ర బృందాలను ఏపీకి పంపాలని సీఎం చంద్రబాబు కోరిన నేపథ్యంలో కేంద్రం ఈ సానుకూల నిర్ణయం తీసుకుంది.

 కేంద్ర బృందాల పర్యటన అనంతరం ఇచ్చే నివేదిక ఆధారంగా ప్రభావిత రాష్ట్రాలకు కేంద్ర విపత్తు సహాయ నిధి (NDRF) నుంచి తగినంత ఆర్ధిక సహాయం విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అటు ఏపీ ప్రభుత్వం కూడా తుఫాన్ బాధితులను ఆదుకునేందుకు ఇప్పటికే పునరావాస చర్యలతో పాటు ప్రాథమిక నష్టపరిహార అంచనాలను వేగవంతం చేసింది.

 తుపాన్ సహాయక చర్యలపై మంత్రి లోకేశ్ అభినందనలు

'అర్నబ్' తుపాను బీభత్సం వేళ తక్షణ సహాయక చర్యలపై రాష్ట్ర విద్యా, ఐటీ, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి నారా లోకేశ్ తీవ్ర హర్షం వ్యక్తం చేశారు. తుపాను అత్యంత ప్రమాదకర రీతిలో తీరం దాటిన సమయంలో రాష్ట్రవ్యాప్తంగా అస్తవ్యస్త పరిస్థితులు నెలకొన్నప్పటికీ, ప్రభుత్వ యంత్రాంగం, క్షేత్రస్థాయి సిబ్బంది నిద్రాహారాలు మాని శ్రమించి ప్రజలకు అండగా నిలిచారని ప్రశంసించారు. ఈ మేరకు ఆయన సామాజిక మాధ్యమం 'ఎక్స్' (ట్విట్టర్) వేదికగా ఒక ప్రత్యేక సందేశాన్ని పంచుకున్నారు. సహాయ పునరావాస కార్యక్రమాల్లో రాత్రీపగలు తేడా లేకుండా పాల్గొన్న శానిటేషన్ కార్మికులు, విద్యుత్ ఉద్యోగులు, రెవెన్యూ, పోలీసు అధికారులు, విపత్తు నిర్వహణ సిబ్బందికి మంత్రి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. బాధితులందరినీ ఆదుకునే వరకు ప్రభుత్వం విశ్రమించదని, పునరావాస పనులు వేగంగా కొనసాగుతాయని ఆయన పేర్కొన్నారు.

 

 

 

#CycloneArnabReview#AmitShahCycloneReview#APNewsTelugu#ChandrababuAmitShah#NDRFRescueOperations#CentralTeamsAP#AndhraPradeshNews2026#naralokesh
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి