దీపావళి పండుగ సమీపిస్తున్న వేళ హైదరాబాద్‌లో పలు ప్రముఖ స్వీట్ షాపులు, ఆహార తయారీ కేంద్రాలపై ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. అత్యంత ఆదరణ పొందిన 'పుల్లారెడ్డి స్వీట్స్' (G. Pulla Reddy Sweets) సహా పలు షాపుల్లో తనిఖీలు చేసి అపరిశుభ్రత, నిబంధనల ఉల్లంఘనలను అధికారులు గుర్తించారు. అత్యంత ప్రమాదకరమైన వాతావరణంలో స్వీట్లు తయారు చేస్తున్నట్లు ఆధారాలతో సహా నిరూపితం కావడంతో పుల్లారెడ్డి స్వీట్స్‌కు చెందిన ఎఫ్ఎస్ఎస్ఏఐ (FSSAI) లైసెన్స్‌ను అధికారులు తక్షణమే సస్పెండ్ చేశారు.
తెలంగాణ స్టాండర్డ్స్ అథారిటీ ఫర్ ఫుడ్ అండ్ ఎసెన్షియల్ డ్రగ్స్ (TG-SAFE), పోలీసుల సాయంతో మొత్తం 13 ప్రత్యేక బృందాలు జీహెచ్ఎంసీ (GHMC) పరిధిలోని 16 ప్రధాన స్వీట్ తయారీ కేంద్రాలపై ఏకకాలంలో తనిఖీలు చేపట్టాయి. ఈ మెరుపు దాడుల్లో ఏకంగా రూ.16.86 లక్షల విలువైన 3,546 కిలోల కల్తీ, కుళ్లిన, గడువు ముగిసిన ఆహార పదార్థాలను అధికారులు స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. ఆహార భద్రతా ప్రమాణాలు పాటించని 5 ప్రముఖ సంస్థల లైసెన్సులను రద్దు చేయగా, కనీస లైసెన్సులు లేకుండా అక్రమంగా నడుస్తున్న మరో ఐదు షాపులను సీజ్ చేశారు.
సనత్‌నగర్‌లోని పుల్లారెడ్డి స్వీట్స్ ప్రధాన తయారీ యూనిట్లో అధికారులు తనిఖీలు నిర్వహించిన సమయంలో అక్కడ కనిపించిన దృశ్యాలు అధికారులను నిర్ఘాంతపోయేలా చేశాయి. వంటగది, పరిశుభ్రత కేంద్రాల్లో కుళ్లిన కూరగాయలు, ఎలుకల వ్యర్థాలు, గడువు ముగిసిన ముడిసరుకును వినియోగిస్తున్నట్లు గుర్తించారు. దాంతో ఆ యూనిట్ లైసెన్సును వెంటనే సస్పెండ్ చేసి, ఒక్క సనత్‌నగర్ తయారీకేంద్రం నుంచే రూ.15.03 లక్షల విలువ కలిగిన 3,133 కిలోల పాడైపోయిన ఆహార పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు.
ఈ దాడుల్లో భాగంగా చార్మినార్‌లోని 'ఆగ్రా మిఠాయి ఘర్', వనస్థలిపురంలోని 'స్వీట్ వన్ రుచులు', ఫలక్‌నుమాలోని 'బాలాజీ శ్రీ కిషన్ మిఠాయి భండార్', కాటేదాన్‌లోని 'హిరాణి ఫుడ్స్' సంస్థల లైసెన్సులను కూడా అధికారులు సస్పెండ్ చేశారు. వీటికి తోడు ఎలాంటి ముందస్తు అనుమతులు, లైసెన్సులు లేకుండా అపరిశుభ్ర వాతావరణంలో నడుస్తున్న చాంపపేట్లోని 'బాలాజీ స్వీట్స్', సికింద్రాబాద్‌లోని 'మమతా స్వీట్ హౌస్' సహా మరో మూడు దుకాణాలను సీజ్ చేసి మూసివేయించారు. తనిఖీల సమయంలో సేకరించిన 22 ఆహార నమూనాలను శాస్త్రీయ విశ్లేషణ కోసం ల్యాబ్‌కు పంపించామని, ఆ నివేదికలు రాగానే సదరు నిర్వాహకులపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు స్పష్టం చేశారు.


