రాజకీయాలు

Congress: ప్రియాంక గాంధీ ఎంట్రీ.. రాహుల్ గాంధీ రాజకీయానికి చెక్ పడనుందా?..

రచన: Venu••14 నిమిషాల పఠనం

ఒకప్పుడు కాంగ్రెస్ అంటే ఇందిరా గాంధీ.. ఆ తర్వాత సోనియా గాంధీ.. కానీ ఇప్పుడు కాంగ్రెస్ అంటే రాహుల్ గాంధీ అనే పరిస్థితి అంతగా బలపడలేదనే అభిప్రాయం ఉన్నట్టు ఆరోపణలున్నాయి..

ఇందిరా గాంధీ కాంగ్రెస్ రాజకీయాల్లో ఒక ప్రభంజనం అయితే.. సోనియా గాంధీ ఒక పునరుజ్జీవనం అని అంటారు.. ఈ క్రమంలో ప్రియాంక గాంధీ కూడా రానున్న కాలంలో ఒక కొత్త రాజకీయ అధ్యాయంగా నిలుస్తారా.. కాంగ్రెస్ భవిష్యత్తును నిర్ణయించే నాయకురాలిగా ఎదుగుతారా.. అనే ఆసక్తి ఇప్పటికే పార్టీ వర్గాలలో నెలకొంది.. గతంలో పార్టీ తరపున నిర్వహించే పలు సభల్లో మెరిసిన ప్రియాంక.. తమ పార్టీలో కీలకంగా మారనుందనే సంకేతాలు వెలువడుతున్నాయి..

ప్రియాంకకు 2030 నుంచి గ్రహబలం పెరుగుతుందని, 2034 తర్వాత ఆమె రాజకీయంగా అత్యున్నత స్థాయికి చేరే అవకాశముందని జ్యోతిష్య విశ్లేషకురాలు ఆస్ట్రో శర్మిష్ఠ చెప్పిన మాటలు ఇప్పుడు రాజకీయ వర్గాలలో ఆసక్తిని పెంచుతున్నాయి.. అంతేకాదు కాంగ్రెస్ నాయకత్వం, గాంధీ కుటుంబ వారసత్వం, రాహుల్ గాంధీ రాజకీయ భవిష్యత్తు, 2029 లోక్‌సభ ఎన్నికల తర్వాత దేశ రాజకీయాల్లో చోటుచేసుకోబోయే పరిణామాలపై కూడా ఆస్ట్రో శర్మిష్ఠ మాటలు కొత్త చర్చకు తెరలేపాయి..

ఒకప్పుడు కాంగ్రెస్ అంటే ఇందిరా గాంధీ.. ఆ తర్వాత సోనియా గాంధీ.. కానీ ఇప్పుడు కాంగ్రెస్ అంటే రాహుల్ గాంధీ అనే పరిస్థితి అంతగా బలపడలేదనే అభిప్రాయం ఉన్నట్టు ఆరోపణలున్నాయి.. ఈ పరిస్థితుల్లో రేపటి కాంగ్రెస్‌ కు ఆశాకిరణం ప్రియాంక గాంధీనే అనే బలమైన నమ్మకం ఆ పార్టీలో ఉన్నట్టు గతంలో కొన్ని కథనాలు కూడ వెల్లడించాయి.. అదీగాక ఇందిరా గాంధీ తర్వాత దేశ రాజకీయాల్లో అంతటి ప్రభావాన్ని చూపించే మహిళా నాయకురాలిగా ఎదిగే చరిష్మ ఇప్పుడు ప్రియాంకకు మాత్రమే ఉందనే ప్రచారం కూడా గతంలో జరిగింది.

మరోవైపు భారత రాజకీయ చరిత్రను పరిశీలిస్తే ఇందిరా గాంధీ ప్రస్థానం ప్రత్యేకమైనదిగా పేర్కొంటారు.. ప్రధానమంత్రిగా 1966లో బాధ్యతలు చేపట్టిన ఆమె, క్రమంగా రాజకీయాల్లో తనదైన శైలితో ఆకట్టుకోవడమే కాదు.. రాజకీయ పునాదులను బలంగా నిర్మించుకున్నారు. ఇక 1971 ఎన్నికల విజయం, బంగ్లాదేశ్ విముక్తి యుద్ధం, అత్యవసర పరిస్థితి వంటి పరిణామాలు ఆమె రాజకీయ జీవితంలో కీలక మలుపులుగా నిలిచాయని అంటారు..

అదీగాక కాంగ్రెస్‌ను దేశవ్యాప్తంగా ప్రభావవంతమైన రాజకీయ శక్తిగా నిలపడంలో ఇందిరా గాంధీ నాయకత్వం ఎంతగానో ఉపయోగపడినట్టు చెబుతారు.. ఇక ఇందిరా గాంధీ మరణం తర్వాత గాంధీ కుటుంబ రాజకీయ ప్రభావం కొనసాగినా, కాంగ్రెస్‌కు స్థిరమైన నాయకత్వం లభించడం అంత సులభం కాలేదని.. అంతలోనే రాజీవ్ గాంధీ హత్య జరగడం ఆ పార్టీకి కోలుకోలేని విధంగా మార్చినట్టు విశ్లేషకులు చెబుతున్నారు..

అయితే అప్పటి వరకు రాజకీయాల్లో పెద్దగా ప్రభావం చూపలేని సోనియా గాంధీ కొంతకాలం రాజకీయాలకు దూరంగా ఉన్నారు. అయితే 1998లో కాంగ్రెస్ పార్టీ బాధ్యతలు చేపట్టిన తర్వాత పార్టీని తిరిగి నిలబెట్టేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ 2004లో అధికారంలోకి రావడం సోనియా గాంధీ రాజకీయ నాయకత్వంలో కీలక ఘట్టంగా నిలిచింది..

ఇక 2004 నుంచి 2014 వరకు కేంద్రంలో యూపీఏ ప్రభుత్వాలు కొనసాగడంలో ఆమె పాత్ర ముఖ్యమైనది. ప్రధానమంత్రి పదవిని స్వీకరించకుండా మన్మోహన్ సింగ్‌ను ఆ బాధ్యతల్లో కొనసాగించడం ద్వారా కూడా ఆమె తన రాజకీయ వ్యూహాన్ని ప్రదర్శించారు. అయితే 2014 తర్వాత కాంగ్రెస్ బలహీనపడింది. 2019లోనూ ఆశించిన ఫలితాలు రాకపోవడంతో పార్టీ నాయకత్వంపై ప్రశ్నలు తలెత్తాయి.. ఇలాంటి పరిస్థితుల్లో రాహుల్ గాంధీతోపాటు ప్రియాంక గాంధీ రాజకీయ పాత్ర కూడా ప్రాధాన్యం సంతరించుకుంది.

అయితే రాజకీయాల్లోకి ప్రియాంక గాంధీ అధికారికంగా రావడానికి ముందే కాంగ్రెస్ ప్రచార కార్యక్రమాల్లో కీలక పాత్ర పోషించారు. ముఖ్యంగా అమేథీ, రాయ్‌బరేలీ నియోజకవర్గాల్లో గాంధీ కుటుంబానికి మద్దతును నిలబెట్టడంలో ఆమె చురుగ్గా వ్యవహరించారు. అలాగే కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా 2019లో బాధ్యతలు చేపట్టి ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. ఉత్తరప్రదేశ్‌లో పార్టీని బలోపేతం చేయాల్సిన బాధ్యతను స్వీకరించారు.

మరోవైపు రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర, భారత్ జోడో న్యాయ్ యాత్ర ద్వారా ప్రజలతో అనుసంధానం పెంచుకునే ప్రయత్నం చేశారు. అదేవిధంగా ప్రియాంక ప్రత్యక్ష ప్రచారం, సభల్లో ప్రసంగాలు, స్థానిక నాయకులతో సంబంధాలు, ఎన్నికల సమయంలో ప్రత్యర్థులపై నేరుగా విమర్శలు చేయడం వంటి అంశాలతో ముందుకు వెళ్లారు.. అదీగాక 2021లో ఉత్తరప్రదేశ్‌లో లడ్కీ హూన్, లడ్ సక్తీ హూన్ ప్రచారంతో మహిళా ఓటర్లను ఆకర్షించేందుకు ప్రయత్నించారు.

లఖింపూర్ ఖేరీ ఘటన తర్వాత బాధిత రైతు కుటుంబాలను పరామర్శించేందుకు చేసిన ప్రయత్నాలు రాజకీయంగా గుర్తింపు తెచ్చాయి. ఇక ప్రియాంకకు ఉన్న బలం ప్రజలతో నేరుగా మాట్లాడగలగడం, ప్రసంగాల్లో భావోద్వేగాన్ని పండించడం, గాంధీ కుటుంబ వారసత్వాన్ని తనదైన శైలిలో ప్రదర్శించడం. ఈ విషయంలో రాహుల్ గాంధీ కాస్త వెనుకబడినట్టు చెప్పుకోవడం తెలిసిందే.. అయితే ఈ మధ్యకాలంలో పార్టీలో యాక్టివ్ ఉన్నా.. ఇప్పటికే రాహుల్ నేతృత్వంలో కాంగ్రెస్ పుంజుకోవాలనే విమర్శలున్నాయి..

ఇక రాహుల్ గాంధీ 2024 లోక్‌సభ ఎన్నికల్లో రాయ్‌బరేలీతోపాటు వయనాడ్‌లోనూ విజయం సాధించారు. అనంతరం వయనాడ్ స్థానాన్ని వదులుకోవడంతో జరిగిన ఉప ఎన్నికలో ప్రియాంక గాంధీ పోటీ చేసి విజయం సాధించారు. 2024 నవంబర్‌లో వెలువడిన ఫలితాల్లో ఆమె నాలుగు లక్షలకు పైగా ఓట్ల ఆధిక్యాన్ని నమోదు చేశారు. ఇది ఆమె ప్రత్యక్ష ఎన్నికల రాజకీయాలకు బలమైన ఆరంభంగా నిలిచిందని చెబుతున్నారు..

అదీగాక పార్లమెంటులో ఆమె తొలి ప్రసంగం కూడా చర్చనీయాంశమైంది. రాజ్యాంగం, ప్రజాస్వామ్యం, చరిత్ర, అధికార పక్షం అనుసరిస్తున్న విధానాలపై ఆమె చేసిన ప్రసంగానికి సొంత పార్టీ నుంచే కాకుండా ఇతర పార్టీల నుండి కూడా స్పందన వచ్చింది. తన సోదరి తొలి ప్రసంగం తన తొలి ప్రసంగం కంటే మెరుగ్గా ఉందని రాహుల్ గాంధీ స్వయంగా ప్రశంసించడం కూడా అప్పట్లో వార్తల్లో నిలిచింది.

మరోవైపు 2026 అక్టోబర్ 24న ప్రచురితమైన ది ప్రింట్ కథనం ప్రకారం, ఉత్తరప్రదేశ్‌లో 2027 అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ సీట్ల కేటాయింపు వ్యూహంపై ప్రియాంక మళ్లీ చురుకుగా దృష్టి సారించారు. సమాజ్‌వాదీ పార్టీతో పొత్తు చర్చల్లో కాంగ్రెస్‌కు అనుకూలమైన నియోజకవర్గాలను గుర్తించే ప్రక్రియలో ఆమె పాత్ర ప్రాధాన్యం సంతరించుకుంది. కాంగ్రెస్‌కు బలమున్న స్థానాలను గుర్తించి, పొత్తుల్లో మెరుగైన వాటా సాధించాలనే వ్యూహం ఇందులో కనిపిస్తోంది.

ఈ నేపథ్యంలో 2029 ఎన్నికల తర్వాత రాహుల్ గాంధీ పరిస్థితి ఏమిటినే చర్చలు కూడా తెరమీదికి వస్తున్నాయి.. ప్రస్తుతం రాహుల్ గాంధీ లోక్‌సభలో ప్రతిపక్ష నేతగా ప్రభుత్వ విధానాలను ప్రశ్నిస్తున్నారు. 2024 ఎన్నికల్లో కాంగ్రెస్ సీట్ల సంఖ్య పెరగడం, ప్రతిపక్ష కూటమికి బలం చేకూరడం ఆయన నాయకత్వానికి ఊరటనిచ్చిన పరిణామాలుగా చెప్పుకోవచ్చు.. అయితే 2029 ఎన్నికల్లో కాంగ్రెస్ ఆశించిన స్థాయిలో ఫలితాలు సాధించకపోతే, పార్టీ నాయకత్వంపై మళ్లీ చర్చ మొదలయ్యే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు.

అలాంటి సమయంలో ప్రియాంకకు మరింత ప్రాధాన్యత ఇవ్వాలనే డిమాండ్ పెరగవచ్చు. ఇప్పటికే పార్టీకి అవసరమైన చోట ప్రచారం చేయగల నాయకురాలిగా ఆమెకు గుర్తింపు ఉంది. ఉత్తరప్రదేశ్ వంటి కీలక రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేయగలిగితే, ఆమె జాతీయ స్థాయి పాత్ర మరింత పెరిగే అవకాశం ఉంటుందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. అలాగే రాహుల్ జాతీయ రాజకీయాలు, పార్లమెంటరీ పోరాటంపై దృష్టి పెడితే, ప్రియాంక ఎన్నికల వ్యూహాలు, సంస్థాగత వ్యవహారాలు, ప్రజా ప్రచారంపై మరింత దృష్టి సారించే అవకాశాలున్నట్టు చెబుతున్నారు..

మరోవైపు ఇందిరా గాంధీతో ప్రియాంకను పోల్చడం కొత్తేమీ కాదు. ప్రియాంక ముఖకవళికలు, ప్రసంగ శైలి, ప్రజలతో మాట్లాడే విధానం ఇందిరా గాంధీని గుర్తు చేస్తాయని ఆమె అభిమానులు చెబుతుంటారు. అదీగాక దేశవ్యాప్తంగా ఇందిరా గాంధీకి పార్టీపై నియంత్రణ, నిర్ణయాత్మక నాయకత్వం, ఎన్నికల సమయంలో ప్రజాభిప్రాయాన్ని ప్రభావితం చేయగల సామర్థ్యం ఉండేవి. అలాగే సోనియా గాంధీ గురించి చెప్పుకుంటే కూటములను నిర్వహించడం, వివిధ పార్టీలను ఒక వేదికపైకి తీసుకురావడం, పార్టీ సంస్థాగత వ్యవస్థను నిలబెట్టడం ద్వారా తనదైన ముద్ర వేశారు.

ఈ నేపథ్యంలో ప్రియాంక ఈ రెండు లక్షణాలను ఎంతవరకు అందిపుచ్చుకుంటారన్నదే ఇక్కడ కీలకం అని అంటున్నారు.. ఇవన్నీ పరిగణలోకి తీసుకుంటే.. 2030 నుంచి గ్రహబలం.. 2034 తర్వాత అత్యున్నత స్థాయి.. ప్రియాంక సొంతం అవుతుందనే ఆస్ట్రో శర్మిష్ఠ మాటలు చూస్తే చంద్ర మహాదశ ప్రారంభం ఆమెకు అనుకూలంగా మారుతుందనేది ఈ అంచనాకు ఆధారంగా పేర్కొంటున్నారు.

ఈ నేపథ్యంలో ప్రియాంక గాంధీ ఎదుగుదల కాంగ్రెస్‌ లో కొత్త ఆశలు మొలకెత్తించవచ్చని.. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్‌లో కాంగ్రెస్ తన పునాదిని బలోపేతం చేసుకోగలిగితే, జాతీయ రాజకీయాల్లోనూ ఆమె పాత్ర పెరగవచ్చని విశ్లేషకులు అంటున్నారు.. మొత్తంగా చూస్తే, ఇందిరా గాంధీ దేశ రాజకీయాలను ప్రభావితం చేశారు. సోనియా గాంధీ కాంగ్రెస్‌ను కష్టకాలంలో నిలబెట్టి, కేంద్రంలో అధికారంలోకి తీసుకురావడంలో కీలక పాత్ర పోషించారు.

ఇప్పుడు ప్రియాంక గాంధీ ముందు అదే స్థాయి ప్రభావాన్ని సొంతం చేసుకోవాలనే సవాలు ఉంది. ఇదే జరిగితే రాహుల్ గాంధీ రాజకీయ భవిష్యత్తు పై ఏ నిర్ణయం తీసుకుంటారో అనే ఆసక్తి కలగడం ఖాయం అని అనుకొంటున్నారు.. గాంధీ కుటుంబ రాజకీయ ప్రయాణంలో మరో కీలక మలుపు మొదలవుతుందా.. కాంగ్రెస్‌కు కొత్త రాజకీయ మహర్దశ వస్తుందా.. లేక జ్యోతిష్య అంచనాలు అంచనాలుగానే మిగిలిపోతాయా అనేది తెలియాలంటే అప్పటి వరకు ఆగవలసిందే..

#Priyanka Gandhi Political Future#Priyanka Gandhi Astrology Prediction#Priyanka Gandhi 2030 Prediction#Rahul Gandhi Political Future#Congress Leadership Crisis#Indira Gandhi vs Priyanka Gandhi#Sonia Gandhi Political Legacy#Congress 2029 Election Strategy#Priyanka Gandhi Latest News#BJP vs Congress Political Analysis
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి