తెలంగాణ రాష్ట్రం ప్రస్తుతం అవినీతి, అక్రమాలు, దోపిడీకి తోడు కల్తీ వ్యాపారాలకు నిలయంగా మారుతోందనే విమర్శలు మూటగట్టుకుంటుంది. ప్రజా ప్రయోజనాలను పక్కనబెట్టి, అక్రమార్కులు యథేచ్ఛగా సాగిస్తున్న దందాలు సామాన్య ప్రజల జీవితాలను అతలాకుతలం చేస్తున్నాయి..
మనుషులలో కల్తీ, మనసుల్లో కల్తీ, చివరికి తినే ఆహార పదార్థాల నుంచి నిత్యావసరాల వరకు ప్రతి దాంట్లో కల్తీ రాజ్యమేలుతుండటంతో ప్రజలు తీవ్ర భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అధికారుల పర్యవేక్షణ లోపం, రాజకీయ అండదండలతోనే ఈ దోపిడీ పర్వం కొనసాగుతోందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
సమాజానికి శాపంగా మారిన ఈ అక్రమార్కులపై ప్రభుత్వం కఠిన చర్యలు చేపడుతున్న వీరి ఆగడాలకు అడ్డు అదుపు లేకుండాపోతుంది. ఇప్పటికే వీటితో సతమతం అవుతున్న సామాన్యుడి పాలిట ఎల్ నినో శాపంగా మారింది. రానున్న పరిస్థితులు దేవుడెరుగు.. కానీ ఇప్పటికే నిత్యవసరాల ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి.. ముఖ్యంగా గతంలో అందరికీ అందుబాటులో ఉన్న బియ్యం ధరలు.. ఎల్ నినో ఎఫెక్ట్ పేరుతో పేదల కడుపుకు పరీక్షగా మారాయి.. ఆకలికి భయపడే పరిస్థితులను తెస్తున్నాయి..
ప్రస్తుతం ప్రభుత్వం అందిస్తున్న రేషన్ బియ్యం చాలామందికి వరంగా మారింది. అయితే ఈ బియ్యాన్ని కొందరు ఆక్రమార్కులు నల్లబజారుకు తరలించి ఆక్రమార్జనకు తెరలేపిన సంఘటనలు నిత్యం వెలుగులోకి రావడం తెలిసిందే.. ఇది చాలదన్నట్లు కొంత మంది వ్యాపారులు ఇదే అదనుగా భావించి భారీగా అక్రమాలకు తెరలేపుతున్న ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి..
తాజాగా హైదరాబాద్‌లో మరో రేషన్ బియ్యం స్కామ్ వెలుగులోకి వచ్చింది.. కొందరు నీతితప్పిన వ్యక్తులు ఒక మాఫియాలాగా ఏర్పడి.. రేషన్ బియ్యానికి పాలిష్ చేసి బయట మార్కెట్లో అమ్మేస్తున్న చీకటి గుట్టు రట్టైంది. ఈ క్రమంలో నగరంలోని కర్మన్‌ఘాట్ ప్రాంతంలో ఏకకాలంలో పలు రైస్ డిపోలపై, సివిల్ సప్లయ్స్, విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహించారు. కర్మన్‌ఘాట్‌లోని పలు రైస్ డిపోల్లో బియ్యం సంచులపై ముద్రించిన లెక్కలకు, వినియోగదారులకు ఇస్తున్న లెక్కల మధ్య వ్యత్యాసం ఉందనే ఫిర్యాదులతో వీరు రంగంలోకి దిగినట్టు సమాచారం.
మరోవైపు పేదల కోసం ప్రభుత్వం పంపిణీ చేస్తున్న రేషన్ బియ్యాన్ని తక్కువ ధరకే కొనుగోలు చేసి, వాటికి పాలిష్ పెట్టి బ్రాండెడ్ కంపెనీ బియ్యం పేరుతో వ్యాపారులు బహిరంగ మార్కెట్లో అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు తనిఖీల్లో కనుగొన్నారు.. ఈ బియ్యాన్ని సుమారుగా కిలో రూ.80 నుంచి రూ.100 వరకు విక్రయిస్తున్నట్లు గుర్తించారు.. ఇదిలా ఉండగా పలువురు వ్యాపారులు సివిల్ సప్లైస్, విజిలెన్స్ అధికారులు వస్తున్నారనే సమాచారంతో తమ దుకాణాలను మూసివేసినట్లు సమాచారం.
ఈ తనిఖీల్లో భాగంగా కొన్ని రైస్ డిపోలు ట్రేడ్ లైసెన్స్ లేకుండానే వ్యాపార కలాపాలు నిర్వహిస్తున్నట్లు అధికారులు గుర్తించారని తెలుస్తుంది.. ఇక ఈ దందా వెనుక ఎవరి హస్తం ఉందనే కోణంలో విచారణ చేపట్టినట్టు తెలుస్తుంది. అసలే ఒకవైపు పగబట్టిన ప్రకృతి, మరోవైపు కల్తీ ఆహారం, రాజకీయ దోపిడి మధ్య నలిగిపోతున్న సామాన్యుడికి అందవలసిన రేషన్ బియ్యం అక్రమార్కుల ధనాశ వల్ల ఇలా బహిరంగ మార్కెట్లోకి వెళ్ళడం ఆందోళన కలిగిస్తుంది.
ఈ ఘటనపై ఇప్పటికైన ప్రభుత్వం, అధికారులు ఉక్కుపాదం మోపి కఠిన చర్యలు చేపట్టకపోతే రానున్న రోజుల్లో ఆకలి చావులు ఎదురైన ఆశ్చర్యపోవలసిన అవసరం లేదనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.. లోపం ఎవరిదైన ఈ సమయంలో బాధ్యతగా వ్యవహరించవలసిన అవసరం ప్రభుత్వానికి ఉందని జనం ముచ్చటించుకుంటున్నారు..


