KTR: సీఎం రేవంత్ రెడ్డిపై నిప్పులు చెరిగారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. రాష్ట్రం కరువులో ఉంటే మూసీ సుందీకరణ ఎవరు అడిగారు అని కేటీఆర్ ప్రశ్నించారు. అధికారుల నుంచి అందిన విశ్వసనీయ సమాచారం ప్రకారం మూసీ ప్రాజెక్ట్ ముసుగులో వేలాది ఎకరాల లూటీకి సీఎం రేవంత్ తెరలేపారని ఆరోపించారు. అందుకే పబ్లిక్ హియరింగ్ అంటే రేవంత్ రెడ్డి ఉలిక్కి పడుతున్నారు, భయపడుతున్నారు అని చెప్పారు.
పబ్లిక్ హియరింగ్ అంటూ పబ్లిక్ గొంతు నొక్కడం ఏంటి?
పబ్లిక్ రాకుండా తూతూ మంత్రంగా ఏదో చేశామంటే చేశాం అనిపించుకోవడానికి ఒక ప్రొసీజరల్ ఇష్యూ లాగా చాపకింద తోసేసే ప్రయత్నం చేస్తున్నారని వ్యాఖ్యానించారు. దీన్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదని కేటీఆర్ తేల్చి చెప్పారు. మూసీ సుందరీకరణ ప్రాజెక్ట్ డీపీఆర్ ఇవాళ్టి వరకు లేదన్నారు. ఒకవేళ ఉంటే పబ్లిక్ డొమైన్ లో పెట్టాలని డిమాండ్ చేశారు. సుందరీకరణ పేరుతో ఆడుతున్న డ్రామాలు ఆపాలన్నారు.
సుందీకరణ పనులు వెంటనే ఆపేయాలి
రాష్ట్రం కరువులో ఉంటే ఏ వర్గం ప్రజలు సుందీకరణ అడుగుతున్నారని ముఖ్యమంత్రి రేవంత్ ను నిలదీశారు కేటీఆర్. రాహుల్, సోనియా, ప్రియాంకా గాంధీ అడిగారా? అని ప్రశ్నించారు. పబ్లిక్ హియరింగ్ జరగదు. రాష్ట్రం కరువులో ఉంటుంది. కానీ, సుందరీకరణ మాత్రం ఆగదు.. ఇదెక్కడి ఆలోచనా విధానం అంటూ రేవంత్ రెడ్డిపై ధ్వజమెత్తారు కేటీఆర్. ప్రభుత్వం చెబుతున్న పొదుపు చర్యల్లో భాగంగానే సుందరీకరణ పనులు వెంటనే ఆపేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. మళ్లీ వర్షాలు వచ్చాక మొదలుపెట్టాలని సూచించారు.
మింగా మెతుకు లేదు కానీ మీసాలకు సంపెంగ నూనె
'ఒకవైపు రాష్ట్రం కరువులో ఉంటే.. ఎండిన పంటలతో అన్నదాతలు, పశుగ్రాసం లేక పశువులు అల్లాడిపోతుంటే.. నీళ్లు లేక హైదరాబాద్ ప్రజలు మొత్తుకుంటుంటే.. 10 టీఎంసీల నీళ్లు మల్లన్న సాగర్ నుంచి తీసుకొచ్చి మూసీలో పోస్తాడంట. బుద్ధున్న ముఖ్యమంత్రి చేసే పనేనా ఇది? సాగు నీటికి దిక్కు లేదు, తాగునీటికి దిక్కు లేదు. కానీ 10 టీఎంసీల నీళ్లు తీసుకొచ్చి మూసీలో పోసి సుందరీకరిస్తాడట. మింగా మెతుకు లేదు కానీ మీసాలకు సంపెంగ నూనె అని సామెత. సరిగ్గా అలానే ఉంది ముఖ్యమంత్రి రేవంత్ ఆలోచనా విధానం.
వారం రోజుల్లో నలుగురు రైతులు ఆత్మహత్య
ఈ ముఖ్యమంత్రిని మా నెత్తి మీద, రాష్ట్రం నెత్తి మీద రుద్దిన రాహుల్ గాంధీని అడుగుతున్నా. ఏ రకమైన ప్రాధాన్యాలు మీవి? ఇదేనా మీ ఆలోచనా విధానం? ప్రజల కష్టాలు చూడరు, రైతుల కన్నీళ్లు తుడవరు. ఆదిలాబాద్ లో గత వారం రోజుల్లోనే నలుగురు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. వాటి గురించి ముఖ్యమంత్రికి, ఈ ప్రభుత్వానికి సోయి లేదు.
ఈ ప్రభుత్వానికి అసలు మానవత్వం ఉందా?
రాష్ట్రం కరువులో ఉంది. కానీ సుందరీకరణ మాత్రం ఆగదు. ఈ ప్రభుత్వానికి అసలు మానవత్వం ఉందా? హైదరాబాద్ లో తాగేందుకు నీళ్లు లేవు. కానీ కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగమైన మల్లన్నసాగర్ నీళ్లు తీసుకొచ్చి మూసీలో పోస్తారట. ఎంతసేపు మీకు ఢిల్లీకి వెళ్లి ఈఎంఐ కట్టడంలోనే సరిపోతుందా? ఇదేం పట్టింపు? మీకు సుందరీకరణ మీదున్న శ్రద్ధ, సుందరీకరణ మీదున్న ఆసక్తి, మూసీ మీదున్న తాపత్రయం.. వేరే విషయాల్లో ఎందుకు లేదు'' అని ముఖ్యమంత్రి రేవంత్ ని ప్రశ్నించారు కేటీఆర్.


