బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, నాటి మంత్రి కొండా సురేఖల మధ్య చోటుచేసుకున్న వివాదం రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే.. అయితే నేడు కొండా సురేఖ-కేటీఆర్ పై చేసిన వ్యాఖ్యల పట్ల విచారం వ్యక్తం చేస్తూ బహిరంగంగా క్షమాపణలు చెప్పడం చర్చలకు దారితీసింది. సురేఖ మాటల మలుపు వెనుక కేవలం ఆత్మపరిశీలన ఉందా లేక బలమైన రాజకీయ వ్యూహం దాగి ఉందా అనేది రాష్ట్రంలో ఆసక్తిగా మారింది.
గతంలో కొండా సురేఖా సినీ రంగానికి చెందిన ప్రముఖుల విడాకుల వ్యవహారాలను, డ్రగ్స్, ఫోన్ ట్యాపింగ్ వంటి అత్యంత సున్నితమైన అంశాలను కేటీఆర్‌కు ముడిపెడుతూ చేసిన వ్యాఖ్యలు చిత్ర పరిశ్రమతో పాటు సమాజంలో తీవ్ర ఆగ్రహజ్వాలలను రగిలించాయి. దీనిపై అక్కినేని నాగార్జున సైతం కోర్టును ఆశ్రయించి రూ.100 కోట్ల పరువు నష్టం దావాలు వేయడం సంచలనంగా మారింది. ఇక హైదరాబాద్ సివిల్ కోర్టు కూడా నాటి వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడం తెలిసిందే.
ఆ తర్వాత రాజకీయాల్లో జరిగిన నాటకీయ పరిణామాల వల్ల రేవంత్ రెడ్డి మంత్రివర్గం నుంచి కొండా సురేఖ బర్తరఫ్ కావడం, కాంగ్రెస్ లో తన ప్రాబల్యం తగ్గడం వంటివి చోటుచేసుకున్నాయి.. ఇలాంటి రాజకీయ ప్రతికూల పరిస్థితుల నేపథ్యంలో ఈ క్షమాపణలు రావడం గమనార్హం. భావోద్వేగపూరిత నేతగా పేరొందిన సురేఖ, తీవ్రమైన పదజాలం వాడటం, ఆ తర్వాత దాన్ని సమర్థించుకోవడం మొదటి నుంచీ చూస్తున్నదే అయినా, ప్రస్తుత తరుణంలో ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక ఆమె భవిష్యత్ రాజకీయ ప్రణాళికలే కారణమని అంటున్నారు..
మరోవైపు రాజకీయ విశ్లేషకుల అంచనాల ప్రకారం, తెలంగాణలో వేగంగా మారుతున్న పొలిటికల్ సమీకరణాల నేపథ్యంలో కొండా సురేఖ తన రాజకీయ పునాదులను భద్రపరుచుకునే ప్రయత్నాల్లో ఉన్నారనే ప్రచారం జరుగుతుంది. కాంగ్రెస్‌లో పదవి కోల్పోయిన తర్వాత ఒంటరిగా మారిన ఆమె, రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ వైపు వెళ్లే ఆలోచనలో ఉన్నారనే ఊహాగానాలు గట్టిగా వినిపిస్తున్నాయి.
ఇక బీఆర్ఎస్ అగ్రనేత కేటీఆర్‌పై చేసిన వ్యక్తిగత ఆరోపణలు ఆమె ఎంట్రీకి అడ్డు తగిలే అవకాశాలున్న నేపథ్యంలో బీఆర్ఎస్ లోకి ప్రవేశించడం సాధారంగా అసాధ్యం అని భావించి.. రాజకీయ మైత్రి కోసమే.. ఇప్పుడు స్పందించారనే టాక్ పొలిటికల్ వర్గాలలో వినిపిస్తుంది. అందుకే ముందుగా చట్టపరమైన చిక్కుల నుంచి బయటపడటంతో పాటు, బీఆర్ఎస్తో భవిష్యత్ సంబంధాలకు ఉన్న అతిపెద్ద అడ్డంకిని తొలగించుకోవడానికి ఇప్పట్నుంచే ప్రయత్నాలు మొదలు పెట్టినట్టు చెప్పుకుంటున్నారు.
గతంలో కూడా టీడీపీ, జనసేన సపోర్ట్ అంశాలు ప్రచారంలోకి రావడం, ప్రాంతీయ సమీకరణాల్లో మార్పులు సూచించడం చూస్తుంటే, సురేఖ వేస్తున్న ప్రతిడుగు వ్యూహంలో భాగమేనని రాజకీయ పండితులు అంటున్నారు.. మరోవైపు కాంగ్రెస్ పార్టీలో సురేఖకు ప్రాధాన్యత ఇచ్చిన ఆమె దాన్ని కాపాడుకోవడంలో విఫలం అయినట్టు పొలిటికల్ వర్గాలు చెబుతున్నాయి.. అదేవిధంగా కొండా సురేఖ PA-ఆమె కూతురు సుస్మిత.. అలాగే భర్త మురళి పై తీవ్రమైన ఆరోపనలున్న నేపథ్యంలో అధిష్టానం కఠినంగా వ్యవహరించక తప్పలేదనే ప్రచారం కూడా గతంలో జరిగింది.
కాబట్టి రేవంత్ రెడ్డి ఉన్నంత కాలం ప్రజా ప్రభుత్వంలో కొండా సురేఖ రాజకీయ భవిష్యత్తు తెరవెనుక ఆర్టిస్టు గా ఉంటుందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్న క్రమంలో పొలిటికల్ కెరియర్ కోసం కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటున్నట్టు తెలుస్తుందని అనుకుంటున్నారు.. ఇందులో భాగంగానే కేటీఆర్ ను ప్రసన్నం చేసుకునే పనిలో పడినట్టు చెప్పుకుంటున్నారు..
ఏది ఏమైనా, క్షమాపణలతో ఒక వివాదానికి తెరపడినప్పటికీ, కొండా సురేఖ వేసిన ఈ అడుగు తెలంగాణ రాజకీయాల్లో మున్ముందు ఎటువంటి కొత్త పరిణామాలకు దారితీస్తుందో వేచి చూడాలనే ఆసక్తి కలుగుతుందని జనం అనుకుంటున్నారు.. అయితే ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే.. గతంలో కొండా సుస్మిత సీఎం రేవంత్ రెడ్డి మీద అనుచిత వ్యాఖ్యలు చేస్తూ సవాల్ విసిరిన సందర్భంలో రేవంత్ క్యాబినెట్ లో మంత్రి గా ఉన్న సురేఖ స్పందనపై కాంగ్రెస్ పార్టీ వర్గాలు అసంతృప్తిని వ్యక్తం చేశాయి..
ఆ సమయంలో సీఎం కు సురేఖ రాఖీ కట్టడంతో అంతా సమసిపోయిందని భావించారు. కానీ తర్వాత ఎలాంటి ఆర్భాటం లేకుండా మంత్రి పదవి నుండి సురేఖ ను తప్పించడం.. ఆమె పార్టీ అధిష్టానాన్ని కలసి చర్చలు జరపడం కూడా జరిగింది. తన పలుకుబడితో పదవిని కాపాడుకుందామని ఆమె చేసిన ప్రయత్నాలు బూడిదలో పోసిన పన్నీరులా మారాయనే విమర్శలు కూడా వచ్చాయి..
ఇప్పుడు కేటీఆర్ పరువు ఎంత తీయాలో అంత తీసి క్షమాపణ చెబితే.. రామన్న మనసులో వేసిన ముద్ర, పోయిన పరువు మరచిపోయి బీఆర్ఎస్ లోకి సురేఖకు ఎంట్రీ ఇస్తాడా? అనే అనుమానాలు లేవనెత్తుతున్నారు.. ఏది ఏమైనా కొండ సురేఖ తొందరపాటు వల్ల రాజకీయ అనిశ్చిత స్థితిలోకి వెళ్ళినట్టు తెలుస్తుందని జనం ముచ్చటించుకుంటున్నారు..


