Miyapur Lands: రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం మియాపూర్ పరిధిలోని సర్వే నెంబర్లు 100, 101 లకు చెందిన భూవివాదంపై సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వం విజయం సాధించింది. ఈ రెండు సర్వే నెంబర్లలోని 550 ఎకరాల భూమి ప్రభుత్వానిదే అంటూ సర్వోన్నత న్యాయస్థానం తీర్పు ఇచ్చింది. కాగా, కొందరు ప్రైవేట్ వ్యక్తులు ఈ భూమి తమదేనంటూ గతంలో ఆక్రమించే ప్రయత్నం చేశారు. ఈ వ్యవహారంలో ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ జరిపిన హైకోర్టు ఈ భూమి ప్రభుత్వానికే చెందుతుందని 2003లో తీర్పు ఇచ్చింది.
అక్రమ మార్పులతో యాజమాన్య హక్కులు పొందలేరు
ఈ తీర్పుని సవాల్ చేస్తూ ప్రైవేట్ వ్యక్తులు సుప్రీంకోర్టుని ఆశ్రయించారు. అయితే, వారు దాఖలు చేసిన అప్పీళ్లను సుప్రీంకోర్టు కొట్టివేసింది. 2003 నాటి హైకోర్టు తీర్పును సమర్థించింది. 550 ఎకరాలకు పైగా విస్తీర్ణంలో ఉన్న ప్రభుత్వ భూమి పరిరక్షణకు చూపిన ప్రత్యేక చొరవను న్యాయస్థానం అభినందించింది. ఈ భూములు ప్రభుత్వ రికార్డుల్లో నమోదై ఉన్నాయని.. రెవెన్యూ రికార్డుల్లో అక్రమ మార్పులతో యాజమాన్య హక్కులు పొందలేరని స్పష్టం చేసింది.
రెవెన్యూ అధికారులతో కుమ్మక్కై ప్రభుత్వ భూమిని కబ్జా చేసేందుకు మోసపూరిత ప్రయత్నాలు జరిగాయంది. కోట్లాది రూపాయల విలువైన ప్రభుత్వ భూములు ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి వెళ్లేందుకు అనుమతించబోమని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది.
ప్రైవేట్ వ్యక్తుల అప్పీళ్లు కొట్టివేత
23ఏళ్లుగా నలుగుతున్న ఈ భూ వివాదంలో తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించినట్లైంది. ఈ భూములు పూర్తిగా ప్రభుత్వానివే అని స్పష్టం చేస్తూ.. ప్రైవేట్ వ్యక్తులు దాఖలు చేసి అప్పీళ్లను సుప్రీంకోర్టు ధర్మాసనం తోసిపుచ్చింది. 1912 నాటికే ఈ సర్వే నెంబర్లలో ఉన్న భూములు సర్కారీ పోరంబోకుగా అధికారిక రికార్డుల్లో స్పష్టంగా నమోదై ఉన్నాయని సుప్రీంకోర్టు తన తీర్పులో తెలిపింది.
ప్రభుత్వ రెవెన్యూ రికార్డుల ప్రకారం సర్వే నంబర్ 100లో 277 ఎకరాల 5 గుంటల భూమి, సర్వే నంబర్ 101లో 273 ఎకరాల 34 గుంటల భూమి ఉంది. ఈ రెండు సర్వే నంబర్ల పరిధిలో మొత్తం సుమారు 551 ఎకరాల భూమి ప్రభుత్వ ఆస్తిగా నమోదై ఉంది. అయితే, కొందరు ప్రైవేట్ వ్యక్తులు ఈ భూములపై తమకు యాజమాన్య హక్కులు ఉన్నాయని పేర్కొంటూ, తమ హక్కులను గుర్తించాలని కోరుతూ కోర్టును ఆశ్రయించారు. 1997లో ఒక ప్రత్యేక కోర్టు ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు ఇచ్చింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ సదరు వ్యక్తులు ఆంధ్రప్రదేశ్ హైకోర్టును ఆశ్రయించగా, 2003లో హైకోర్టు ప్రభుత్వ వాదననే సమర్థించింది. హైకోర్టు తీర్పును అంగీకరించడానికి ఇష్టపడని ప్రైవేట్ వ్యక్తులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ అప్పీళ్లు రెండు దశాబ్దాలకు పైగా పెండింగ్లో ఉండి గురువారం నాడు కొట్టివేయబడ్డాయి.


