Super ElNino: వాతావరణం మారిపోతుండటం ఇప్పుడు జనాలకు పెద్ద తలనొప్పిగా మారింది. అసలే ఎండకాలం వస్తే ఆ వేడిని తట్టుకోవడం కష్టమైపోతుంది. అలాంటిది ఈసారి రాబోతున్న ‘సూపర్ ఎల్‌నినో’తో ప్రపంచవ్యాప్తంగా లక్షల మంది ప్రాణాలు పోయే ప్రమాదం ఉందన్న వార్త జనాల్లో భయాన్ని రేపుతోంది. ముఖ్యంగా మన దేశంలో అక్టోబర్ నుంచి వచ్చే మార్చి లోపే ఎండల దెబ్బకు, వడగాలులకు ఏకంగా 55 వేల మంది చనిపోయే ఛాన్స్ ఉందని తాజా నివేదికలు చెబుతున్నాయి. వచ్చే ఆరు నెలల్లో ప్రపంచవ్యాప్తంగా సాధారణంగా చనిపోయే వాళ్ల కంటే అదనంగా దాదాపు 3.73 లక్షల మంది కేవలం ఈ ఎల్‌నినో ఎండల వల్లే చనిపోవచ్చని నిపుణులు లెక్కగట్టారు.
అందులోనూ ఇండియాలో వచ్చే మార్చిలోనే ఎక్కువ మంది చనిపోయే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. రోజూ ఎండలో కష్టపడే కూలీలు, రైతులు, సరైన నీడ లేని పేదల పైనే ఈ ప్రభావం ఎక్కువగా పడనుంది. మనతో పాటు నైజీరియాలో 56 వేలు, ఇండోనేషియాలో 29 వేల మంది వరకు ఈ తీవ్రమైన వేడికి బలయ్యే అవకాశం ఉందని అంటున్నారు. 1950 తర్వాత ఇంత తీవ్రమైన ఎల్‌నినో ఎప్పుడూ రాలేదని, దీని ప్రభావం 2027 దాకా కొనసాగుతుందని వాతావరణ సంస్థలు ఇప్పటికే చెప్పాయి. ఇప్పటికైనా అధికారులు మేల్కొని తగిన ఏర్పాట్లు చేయకపోతే రాబోయే రోజుల్లో పరిస్థితులు మరింత దారుణంగా మారే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నాయి.


