Karnataka Congress: మొన్నటివరకు "జ్ఞానేష్.. ఇట్స్ డన్ బ్రో" అంటూ బీజేపీపై విపక్షాలు సెటైర్లు వేస్తే, ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. కర్ణాటకలో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌కు బీజేపీ-జేడీఎస్ కూటమి దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది. శాసన మండలిలో ఖాళీ అయిన నాలుగు టీచర్స్, గ్రాడ్యుయేట్స్ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ ఖాతా కూడా తెరవలేకపోయింది. నాలుగుకి నాలుగు సీట్లను ఎన్డీయే కూటమి గెలుచుకుని 4-0తో క్లీన్ స్వీప్ చేసింది. రిజల్ట్స్ రాగానే బీజేపీ నేతలు సీఎం డీకే శివకుమార్‌ను టార్గెట్ చేస్తూ.. "డీకే.. మీ పని అయిపోయింది బ్రో" అంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి ఒక రేంజ్లో ఆడుకుంటున్నారు.
చెవిలో పూల ఫొటోతో బీజేపీ గట్టి కౌంటర్
గతంలో బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అసెంబ్లీలో నిరసన తెలుపుతూ డీకే శివకుమార్ చెవిలో బంతిపూలు పెట్టుకున్న పాత ఫొటోను బీజేపీ బయటకు తీసింది. మండలి ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ నేతల చెవుల్లోనే పూలు పెట్టారంటూ ఎక్స్‌లో దారుణంగా ట్రోల్ చేసింది. ఈ నాలుగు స్థానాల్లో.. గతంలో కాంగ్రెస్ గెలిచిన ఏకైక సిట్టింగ్ సీటును ఈసారి జేడీఎస్ ఎగరేసుకుపోయింది. ఇక మిగిలిన మూడు స్థానాల్లోనూ బీజేపీ తమ సిట్టింగ్ సీట్లను సులభంగా కాపాడుకుని సత్తా చాటింది.
ఏ స్థానంలో ఎవరికి దెబ్బ పడింది?
బెంగళూరు టీచర్స్ స్థానంలో కాంగ్రెస్ సిట్టింగ్ ఎమ్మెల్సీ పుట్టన్నకు ఊహించని షాక్ తగిలింది. జేడీఎస్ అభ్యర్థి ఏపీ రంగనాథ్ 908 ఓట్ల తేడాతో ఆయనపై విజయం సాధించి ఆ స్థానాన్ని లాగేసుకున్నారు. ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే సొంత ఇలాకా కల్బుర్గి పరిధిలోనూ కాంగ్రెస్‌కు పరాభవం తప్పలేదు. బీజేపీ సిట్టింగ్ ఎమ్మెల్సీ శశిల్ జి నమోషి 3,297 ఓట్లతో కాంగ్రెస్‌పై గెలిచి వరుసగా ఐదోసారి జైత్రయాత్ర కొనసాగించారు. సౌత్ ఈస్ట్ గ్రాడ్యుయేట్స్ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థి కేఎం సురేష్ ఏకంగా 23,098 ఓట్ల భారీ తేడాతో కాంగ్రెస్ అభ్యర్థి శశి హులికుంటే మట్టను చిత్తు చేశారు. వెస్ట్ గ్రాడ్యుయేట్స్ స్థానంలో బీజేపీ సిట్టింగ్ ఎమ్మెల్సీ ఎస్వీ సంకనూర్ 9,323 ఓట్ల మెజారిటీతో కాంగ్రెస్ ప్రత్యర్థి మోహన్ లింబికాయపై తిరుగులేని విజయం సాధించారు.
సిద్ధూ, డీకేలకు గట్టి ఎదురుదెబ్బ!
ఈ ఎన్నికల కోసం సీనియర్ నేత బీకే హరిప్రసాద్‌తో పాటు పలువురు మంత్రులు నేరుగా గ్రౌండ్లోకి దిగి ప్రచారం చేసినా కాంగ్రెస్‌కు ఫలితం దక్కలేదు. ఉద్యోగులు, గ్రాడ్యుయేట్లలో ప్రభుత్వంపై ఉన్న అసంతృప్తే ఈ ఓటమికి కారణమని గ్రౌండ్ లెవల్ నుంచి వినిపిస్తోంది. దీనికితోడు బీజేపీ, జేడీఎస్ ఓట్లు పూర్తిగా ఒకరికొకరు బదిలీ కావడంతో కూటమి వ్యూహం పక్కాగా వర్కౌట్ అయిందని అంటున్నారు.
ప్రస్తుతం 75 మంది ఉన్న కర్ణాటక మండలిలో కాంగ్రెస్‌కు 38 మంది సభ్యులున్నారు కాబట్టి సంఖ్యాపరంగా ప్రభుత్వానికి ఎలాంటి ఢోకా లేదు. కానీ టీచర్లు, గ్రాడ్యుయేట్లు లాంటి చదువుకున్న వర్గాలు ఓట్లు వేసే ఎన్నికల్లో అధికారంలో ఉండి కూడా ఒక్క సీటు కూడా గెలవలేకపోవడం సిద్ధరామయ్య, సీఎం డీకే శివకుమార్‌లకు నిజంగా పెద్ద నైతిక ఎదురుదెబ్బే అని అంటున్నారు.


