డిజిటల్ చెల్లింపుల రంగంలో సరికొత్త విప్లవానికి శ్రీకారం చుడుతూ ప్రముఖ టెలికాం దిగ్గజం రిలయన్స్ జియో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఆధారిత స్మార్ట్ కళ్లద్దాలను ఆవిష్కరించింది. న్యూఢిల్లీలో జరుగుతున్న 'ఇండియా మొబైల్ కాంగ్రెస్ (IMC) 2026' వేదికగా ఈ జియో ఏఐ గ్లాసెస్‌ను ప్రదర్శించింది. షాపింగ్ చేసినప్పుడు జేబులోంచి స్మార్ట్‌ఫోన్, డెబిట్ లేదా క్రెడిట్ కార్డులు బయటకు తీయాల్సిన అవసరం లేకుండా, కేవలం క్యూఆర్ కోడ్ వైపు చూసి మౌఖిక ఆదేశాలిస్తే చెల్లింపులు పూర్తయ్యేలా ఈ సాంకేతికతను రూపొందించారు.
యూపీఐ సర్కిల్స్ ఫీచర్ ఆధారంగా పనిచేసే ఈ సిస్టమ్ ద్వారా ప్రాథమికంగా ఒక విడతలో రూ.5వేల వరకు, నెలకు గరిష్టంగా రూ.15వేల వరకు చెల్లింపులు జరిపే వెసులుబాటును కల్పించారు. కళ్లద్దాల్లో అమర్చిన ఇన్-బిల్ట్ కెమెరా షాప్‌లోని క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేయగా, వాయిస్ అసిస్టెంట్ 'హలో జియో' ద్వారా యూజర్ చెల్లింపులు చేయొచ్చు. వినియోగదారుల భద్రతకు ప్రాధాన్యమిస్తూ భవిష్యత్తులో ఈ పరికరాన్ని మార్కెట్లోకి తీసుకురావడానికి జియో కసరత్తు చేస్తోంది.
ఈ స్మార్ట్ గ్లాసెస్ కేవలం డిజిటల్ చెల్లింపులకే కాకుండా బహుముఖ ఉపయోగాలు అందిస్తాయి. ఇందులో పొందుపరిచిన ఏఐ వాయిస్ అసిస్టెంట్ ద్వారా విదేశీ లేదా ప్రాంతీయ భాషలను దాదాపు 12 భారతీయ భాషల్లోకి రియల్-టైమ్‌లో అనువదించుకోవచ్చు. అంతేకాకుండా లైవ్ క్రికెట్ స్కోర్‌లు, కామెంట్రీ వినడం, నోట్స్ రాయడం వంటి అనేక ప్రయోజనాలు ఈ వేరబుల్ టెక్నాలజీతో సాధ్యమవుతాయి. భారత్‌లో స్మార్ట్ వేరబుల్స్ విపణిని ఇది సరికొత్త పుంతలు తొక్కించనుందని సాంకేతిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు.


