ప్రపంచ కుబేరుడు టెస్లా కార్ల సంస్థ అధినేత ఎలాన్ మస్క్ ‘అంబానీ’ని టార్గెట్ చేస్తూ వరుస ట్వీట్లు చేస్తున్నారు. ‘స్టార్ లింక్’ ఇండియాలో అడుగుపెట్టకుండా ఆయన అడ్డుకుంటున్నారని ఆరోపించారు. స్టార్‌లింక్ వస్తే ఇండియాలోని వినియోగదారులకు వేగవంతమైన ఇంటర్నెట్ దొరుకుతుందని పేర్కొన్నారు.
అయితే, ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన, చవకైన ఇంటర్నెట్ భారత్‌లో ఇప్పటికే దొరుకుతోందని ఓ నెట్టిజన్ పోస్టు పెట్టారు. నెలకు 4 డాలర్లతో 60 జీబీ సూపర్ ఫాస్ట్ ఇంటర్నెట్ లభిస్తుందని రాసుకొచ్చాడు. స్టార్‌లింక్ అంటే కూడా ఇష్టమేనని భారత్‌లో వారికి లైసెన్స్ ఇవ్వాలని కోరారు. ఆ ట్వీట్‌కు మరో వ్యక్తి స్పందిస్తూ .. స్టార్ లింక్ భారత్‌లోకి వస్తే ఎలాంటి లాభం ఉండదని ట్వీట్ చేశారు. నెటిజన్ల ట్వీట్‌లపై ఎలాన్ మస్క్ స్పందించారు. అంబానీకి చెందిన ఇంటర్నెట్ దళారుల సైన్యం చేస్తున్న హాస్యాస్పద వాదనలకు ఏ మాత్రం అర్థం లేదని పేర్కొన్నారు.
అంబానీ కంపెనీ మూతబడదు..
ఓవైపు భారత్‌లో అంబానీకి ఉన్న బెనిఫిట్స్, అద్భుతమైన తక్కువ ధరకు అందించే ఇంటర్నెట్‌తో స్టార్ లింక్ ఏ మాత్రం పోటీపడలేదని చెబుతూనే, అదే నోటితో స్టార్ లింక్ బలమైన పోటీదారు అవుతుందని వాదిస్తున్నారని చెప్పారు. ఇది అసంబద్ధమైన వాదన అని చెప్పారు. నిజానికి పోటీ అనేది భారతదేశ సగటు పౌరుడికి మరిన్ని ఆప్షన్స్ ఇవ్వడం ద్వారా ప్రయోజనం చేకూరుతుందని వెల్లడించారు. స్టార్ లింక్ ఇండియాలో ఎంట్రీ ఇవ్వడం వలన అంబానీ లాభాలు తగ్గుతాయి కానీ, ఆయన వ్యాపారం మూతపడదని స్పష్టంచేశారు.
అంతేకాకుండా భారత్‌లో స్టార్ లింక్ ధరలు ఎక్కువగా ఉంటే దాన్ని ఎవరూ కొనరని చెప్పారు.కాబట్టి దాని ధరలను కూడా తాము అందుబాటులోకి తీసుకురావాల్సి ఉంటుందని వెల్లడించారు.అంతకుముందు రోజు రిలయన్స్ శాటిలైట్ కమ్యూనికేషన్స్ మార్కెట్‌లో తమ గుత్తాధిపత్యాన్ని కాపాడుకోవడానికే స్టార్‌లింక్‌ను అడ్డుకుంటోందని మస్క్ ‘ఎక్స్’ వేదికగా ఆరోపించారు. 'ప్రధానమంత్రి అంబానీ' అంటూ వ్యంగ్యంగా విమర్శించడమే కాకుండా, భారత్‌కు అసలైన యజమాని మీరేనని తాను గ్రహించలేకపోయానని పేర్కొన్నారు. అంతటితో ఆగకుండా, రిలయన్స్ మద్దతు ఉన్న సంస్థలు అధికార బీజేపీకి విరాళాలు ఇచ్చినట్లు వచ్చిన వార్తా కథనాల స్క్రీన్‌షాట్‌లను ట్యాగ్ చేశారు.
ఆకాశ్ అంబానీ కౌంటర్..
మస్క్ వరుస ట్వీట్లపై ముకేష్ అంబానీ కుమారుడు ఆకాష్ అంబానీ స్పందిస్తూ.. వివాదాల్లోకి వెళ్ళడానికి నిరాకరించారు. తమ కంపెనీ స్వదేశీ సాంకేతికతతో సొంత శాటిలైట్ కమ్యూనికేషన్స్ సిస్టమ్‌ను అభివృద్ధి చేస్తోందని, అవసరమైన నిబంధనలు, అనుమతుల కోసం నియంత్రణ సంస్థలతో కలిసి పనిచేస్తున్నామని స్పష్టంచేశారు.


