కేంద్ర ఎన్నికల కమిషనర్ (CEC) జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ కాక్రోచ్ జనతా పార్టీ నిన్న ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద చేపట్టిన ఆందోళనలు తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసిన విషయం తెలిసిందే. వీరికి తోడు పలు లెఫ్ట్ వింగ్ విద్యార్థి సంఘాలు సైతం ఆందోళనల్లో పాల్గొన్నాయి. నిరసన కారుల్లో కొందరు రాళ్లు రువ్వగా వారిని చెదరగొట్టిన ఢిల్లీ పోలీసులు.. ఎక్కడికక్కడ అరెస్టులు చేసి తరలించారు.
అయితే, సీజేపీ కీలక నేతలను జంతర్ మంతర్ వద్దకు రాకుండానే ఢిల్లీ పోలీసులు ముందస్తు అరెస్టు చేశారు. కాక్రోచ్ జనతా పార్టీ చీఫ్ అభిజిత్ దీప్కే, సౌరవ్ దాస్, తదితరులతో పాటు ప్రముఖ యూట్యూబర్ ధ్రువ రాఠీని సైతం అరెస్టు చేశారు. అనంతరం వారిని స్థానిక పోలీస్ స్టేషన్లకు తరలించారు.దీంతో నేడు కూడా సీజేపీ నిరసనలకు పిలుపునిచ్చింది.
ఇదిలాఉండగా, తన భర్తను విడిచిపెట్టాలని కోరుతూ యూట్యూబర్ ధృవ్ రాఠీ భార్య జ్యూలీ రాథీ సోషల్ మీడియా వేదికగా ఢిల్లీ పోలీసులను రిక్వెస్ట్ చేసింది. తన భర్త ఆచూకీ లభించడంలేదని, తన భర్తతో పాటు అతడి స్నేహితుల ఫోన్స్ కూడా పనిచేయడం లేదని ఆవేదన వ్యక్తం చేసింది. దయచేసి ఢిల్లీ పోలీసులు కస్టడీ నుంచి తన భర్తను విడిచిపెట్టాలని వేడుకుంటూ కన్నీటి పర్యంతమైంది. ఈ మేరకు బాధను వ్యక్తపరిచే ఎమోజీలను షేర్ చేసింది. కాగా, ధృవ్ రాఠీ తన భార్యతో కలిసి జర్మనీలో నివసిస్తున్న విషయం తెలిసిందే.
అక్కడి నుంచి భారత ప్రభుత్వం మీద యూట్యూబ్‌లో వీడియోలు చేసి విమర్శలు గుప్పిస్తుంటారు. ఎస్ఐఆర్ ప్రక్రియపై ఆరోపణలు, ఓటు చోటు చోరీ అంశంపై పెద్దఎత్తున ఫిర్యాదులు, విమర్శలు వస్తున్న తరుణంలో కేంద్ర ఎన్నికల కమిషనర్ రాజీనామా కోరుతూ సీజేపీ తలపెట్టిన నిరసనల్లో పాల్గొనేందుకు ధ్రువ్ రాఠీ జర్మనీ నుంచి ఇండియాకు వచ్చారు.
నిన్న ఆయన నిరసనల్లో పాల్గొనడానికి వెళ్తున్న క్రమంలో పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. సీజేపీ ముఖ్య నేతలు, లీగల్ అడ్వైజర్‌ను సైతం అదుపులోకి తీసుకున్నారు.కాగా, ధృవ్ రాఠీని ఏ పోలీస్ స్టేషన్‌లో ఉంచారు అనేది పోలీసులు గోప్యంగా ఉంచారు.ఈ క్రమంలోనే ఆయన భార్య సోషల్ మీడియా వేదికగా తన భర్తను విడుదల చేయాలని ఢిల్లీ పోలీసులను వేడుకోవడం గమనార్హం.


