రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిస్థితులపై బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ తన సన్నిహితుల వద్ద కీలక వ్యాఖ్యలు చేసినట్టు తెలుస్తోంది. పార్టీలోని ముఖ్యనేతలతో ఇటీవల సమావేశమైన కేసీఆర్.. ఇప్పటికిప్పుడు తెలంగాణలో ఎన్నికల్లో వస్తే బీఆర్ఎస్ పార్టీ బంపర్ మెజార్టీతో గెలుస్తుందని, ‘సెంచరీ’ (వందకు పైగా సీట్లు) కొడతామని పేర్కొన్నట్టు సమాచారం. ఆరు గ్యారెంటీల పేరుతో అబద్ధపు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ వాటిని అమలు చేయడంలో ఫెయిల్ అయ్యిందని గుర్తుచేసినట్టు తెలిసింది.
అంతేకాకుండా, రాష్ట్రంలో ఎల్‌నినో పరిస్థితులు నెలకొనగా వర్షాలు లేక రైతాంగం తీవ్ర ఇబ్బందులు పడుతుంటే, సాగు కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాంటి ప్రత్యేక చర్యలు తీసుకోవడం లేదని, అన్నదాతలు ఆగ్రహంగా ఉన్నారని పేర్కొన్నట్టు సమాచారం.వర్షాలు లేక ప్రాజెక్టుల్లో నీళ్లు లేవని, సాగుకు నీరివ్వకపోవడంతో పంట పొలాలు ఎండుతున్నాయని, దీంతో అన్నదాతలు ఆవేదన చెందుతున్నారని పార్టీ ముఖ్యలతో చర్చించినట్టు తెలుస్తోంది. మూడేండ్లలోనే రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత మొదలైందని సమాచారం అందిందని వారితో అన్నట్టు తెలిసింది.
అందుకే వచ్చే ఎన్నికలను బీఆర్ఎస్ నేతలు ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని, నేతలంతా క్షేత్రస్థాయిలోనే ఉండాలని ఆదేశించినట్టు సమాచారం. ఇప్పుడున్న 119 అసెంబ్లీ నియోజకవర్గ స్థానాలకు ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ‘సెంచరీ’ కొడతామని, ఒకవేళ నియోజకవర్గాలు పెరిగితే 150 సీట్లు గెలుస్తామని మాజీ సీఎం కేసీఆర్ ధీమాతో ఉన్నట్టు తెలిసింది.కాంగ్రెస్ సర్కార్‌పై ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని తిరిగి అధికారంలో వచ్చే అవకాశం కనుచూపు మేరల్లో లేదని స్పష్టంచేసినట్టు తెలిసింది.
ప్రతి ఇంట్లో బీఆర్ఎస్ పాలనే రావాలని గుర్తు చేసుకుంటున్నారని, ఈసారి ఉదమ్యకారుల కుటుంబాలకు టికెట్లు ఇద్దామని కేసీఆర్ ముఖ్యనేతలకు సూచించినట్టు సమాచారం. అంతేకాకుండా, ఈసారి ప్రజల్లో ఉండి పోరాడిన వారికే పార్టీ టికెట్లు దక్కుతాయని, తెలంగాణ భవన్ చుట్టూ చక్కర్లు కొట్టే వాళ్లకు కాదని స్పష్టంచేసినట్టు తెలిసింది. కేసీఆర్ స్టేట్మెంట్‌తో బీఆర్ఎస్ పార్టీలోని ముఖ్యనేతలు సైతం ఆలోచనలో పడ్డారని, తమ అనుచరులకు అసలు విషయం చెప్పి గ్రౌండ్ లెవల్లో పర్యటించాలని సూచించినట్టు సమాచారం.


