ఓటరు జాబితా సమగ్ర సవరణ (SIR)లో భాగంగా కేంద్ర ఎన్నికల సంఘం ఏకపక్షంగా వ్యవహరిస్తోందని, పెద్దఎత్తున అర్హుల ఓట్లను తొలగిస్తోందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలోనే ఇండియా కూటమిలోని పార్టీలు, కాక్రోచ్ జనతా పార్టీ కేంద్ర ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాయి. ఈ మేరకు ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ పెద్దఎత్తున నిరసనలకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే.
నిన్న నిరసనల్లో పాల్గొనేందుకు వెళ్తున్న సీజేపీ ప్రతినిధులు అభిజీత్ దీప్కే, సౌరవ్ దాస్,అశుతోష్ రంకాలను ఢిల్లీ పోలీసులు ముందస్తు అరెస్టు చేశారు. దీప్కే బృందం బెంగళూరు నుంచి ఢిల్లీకి విమానంలో రాగా.. ఎయిర్ పోర్టులోనే వారిని అదుపులోకి తీసుకున్నారు. వీరు నిరసనల్లో పాల్గొంటే నీట్ పేపర్ లీకేజీ నిరసనల సమయంలో చోటుచేసుకున్నట్టు మరోసారి శాంతి భద్రతలు క్షీణిస్తాయని భావించిన ఢిల్లీ ప్రభుత్వం.. ముందస్తుగా అరెస్టులు చేయించింది. తీవ్ర ఉద్రిక్తతలు చోటుచేసుకోకుండా న్యూ ఢిల్లీ పరిసరాల్లో కేంద్రప్రభుత్వం సైతం భారీగా భద్రతా బలగాలను మోహరించింది.
అయితే, 'కాక్రోచ్ జనతా పార్టీ' (CJP) నేతలు అభిజీత్ దిప్కే, సౌరవ్ దాస్, అశుతోశ్ రంకాలకు ఆదివారం ఉదయం షరతులతో కూడిన బెయిల్ మంజూరు అయ్యింది. రూ. 50,000 పూచీకత్తుతో సంవత్సరం పాటు శాంతి భద్రతలకు విఘాతం కల్పించకుండా సత్ప్రవర్తనతో ఉండాలంటూ ఢిల్లీ కంటోన్మెంట్ పోలీస్‌స్టేషన్‌లోని ఎగ్జిక్యూటీవ్ మెజిస్ట్రేట్ బెయిల్ మంజూరు చేశారు.
మున్ముందు ఇలాంటి చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరికలు కూడా చేసినట్టు సమాచారం. కాగా, కేంద్ర ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలనే డిమాండుతో నిన్న జంతర్ మంతర్ వద్ద ఆందోళనలకు సీజేపీ పిలుపునివ్వగా.. వివిధ పార్టీల నేతలు, విద్యార్థి సంఘాల నాయకులు పెద్దఎత్తున హాజరయ్యారు.
ఇదిలాఉండగా, ఇవాళ కూడా జంతర్ మంతర్ వద్ద నిరసనలకు సీజేపీ పిలుపునిచ్చింది. దీప్కే అరెస్టు నేపథ్యంలో నిరసనలు సీజేపీ ఇన్‌చార్జి అజింక్య షిండే ఆధ్వర్యంలో కొనసాగుతాయని నిన్న అభిజీత్ ఓ వీడియో విడుదల చేసిన విషయం తెలిసిందే. ఆదివారం సెలవు రోజు కావడంతో ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరసనల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. 30 వేల మందికిపైగా పోలీసులు, పారామిలిటరీ సిబ్బందిని జంతర్ మంతర్ సమీపంలో మోహరించినట్టు సమాచారం.


