International

Flash flood Nepal: మానవాళి మనుగడకు ముప్పుగా మారుతున్న ప్రకృతి..నేపాల్​లో మళ్లీ వరదలు!!..

రచన: Venu••8 నిమిషాల పఠనం

ప్రకృతిని ప్రేమిస్తే తండ్రిలా రక్షిస్తుంది.. ప్రకృతిని కాపాడితే అమ్మలా ప్రేమిస్తుంది..మన శ్వాసకు మూలం.. ఈ జగతికి ప్రాణం.. ప్రకృతిని కాపాడుకోవడమే మానవాళికి శ్రేయస్కరం అని ప్రకృతి ప్రేమికులు చేస్తున్న ఆర్తనాదాలు పట్టించుకున్న నాధులే లేరనే ఆరోపణలున్నాయి.

ప్రకృతిని ప్రేమిస్తే తండ్రిలా రక్షిస్తుంది.. ప్రకృతిని కాపాడితే అమ్మలా ప్రేమిస్తుంది..మన శ్వాసకు మూలం... ఈ జగతికి ప్రాణం.. ప్రకృతిని కాపాడుకోవడమే మానవాళికి శ్రేయస్కరం అని ప్రకృతి ప్రేమికులు చేస్తున్న ఆర్తనాదాలు పట్టించుకున్న నాధులే లేరనే ఆరోపణలున్నాయి. కానీ ఊహించని విపత్తులు, ప్రకృతి వైపరీత్యాలు చోటు చేసుకుంటే మాత్రం.. కలుగులో దాక్కున ఎలుకలు బయటికి వచ్చినట్టు పెద్ద పెద్ద స్పీచ్ లు ఇవ్వడానికి చాలా మంది రెడీగా ఉంటారని ఎన్నో ఘటనలు నిరూపించాయి.

మరోవైపు మానవ మనుగడకు ప్రకృతికి ఉన్న అనుబంధం విడదీయరానిదని చిన్నప్పటి నుండి చదువుకుంటూనే ఉన్నాం. మనం పీల్చే శ్వాస నుంచి తాగే నీటి వరకు, తినే ఆహారం నుంచి నివసించే నివాసం వరకు ప్రతిదీ ప్రకృతి ప్రసాదించిన వరమే.. అందుకే ప్రకృతి సహకారం లేకపోతే మానవ సమాజ ఉనికినే ఊహించలేమని అంటారు. అయితే, దశాబ్దకాలంగా అభివృద్ధి పేరుతో జరుగుతున్న పర్యావరణ వినాశనం మానవ మనుగడకే ముప్పుగా మారుతోందన్న సంకేతాలు వెలువడుతున్నాయి.

వాతావరణ మార్పులు, రుతుపవనాల అస్తవ్యస్తత దీనికి స్పష్టమైన హెచ్చరికలుగా భావించాలని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.. అయినా వారి మాటలు పెడచెవిన పెడుతున్న ఈ సమాజం తమ స్వార్థం కోసం ప్రకృతి వినాశనానికి సిద్దమైందనే ఆరోపణలున్నాయి. ఇలాంటి నేపథ్యంలో ఈ మధ్యకాలంలో సంభవించిన భయంకరమైన వరదల గురించి ఇంకా మరచిపోక ముందే.. నేపాల్‌ గోర్ఖా జిల్లాలో ఆకస్మిక వరదలు బీభత్సం సృష్టించాయి.

బుధిగండకి నదిలో ఒక్కసారిగా వరద పోటెత్తి 35కి పైగా ఇళ్లు, పలు వంతెనలు కొట్టుకుపోయాయి. దీంతో అప్రమత్తమైన అధికారులు వెంటనే నదీ పరివాహక ప్రాంత ప్రజలను ఎత్తైన ప్రాంతాలకు వెళ్లాలని హెచ్చరించారు. మరోవైపు క్రమ క్రమంగా నదిలో నీటిమట్టం పెరుగుతుండటంతో రెస్క్యూ ఆపరేషన్‌ను ముమ్మరం చేశారు. అలాగే అత్యవసరం అయితే ఇక్కడి నుండి ప్రజల తరలించేందుకు హెలికాప్టర్లను సిద్దం చేశారు.

ఇక అధికారులు కథనం ప్రకారం వరద ఉధృతికి సల్లేరి, పయుకా, జగత్ తదితర ప్రాంతాల్లో ఇళ్లు కొట్టుకుపోయాయని, కానీ ఇప్పటివరకు ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని స్పష్టం చేశారు. మరోవైపు నేపాల్ హోంమంత్రి సుడాన్ గురుంగ్ ఈ ఘటనపై మాట్లాడుతూ.. వరద ఉద్ధృతికి న్యాక్‌చెట్, ఫిలిమ్ బజార్‌లను కలిపే వంతెన కొట్టుకుపోయినట్లు వెల్లడించారు. వర్షం లేకున్నా నదిలో అకస్మాత్తుగా వరద రావడానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదని వివరించారు.

అయితే బుధిగండకి ఉపనది అయిన సియార్ వాగు ప్రవాహానికి హిమపాతం అడ్డుపడి ఉండొచ్చని, అందువల్ల అది కరిగి ఒక్కసారిగా ఉప్పెనలా వరద వచ్చి ఉండొచ్చని అధికారులు అనుమానిస్తున్నారు. మరోవైపు ఈ ఘనటపై నేపాల్​ ప్రధాని బాలేంద్ర షా స్పందించారు. నేపాల్​ సైన్యం వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టినట్టు పేర్కొన్నారు. ఈ క్రమంలో కొండచరియలు విరిగిపడే అవకాశం ఉన్న జగత్ ప్రాంతం నుంచి ఆరుగురిని హెలికాప్టర్ ద్వారా సురక్షిత ప్రాంతానికి తరలించామని, అలాగే ఖాఠ్మాండులో ఉన్న కాంపోజిట్ క్విక్ రియాక్షన్ టీమ్ ను సైతం వరద ప్రభావిత ప్రాంతానికి తరలించినట్టు ఎక్స్ లో చేసిన పోస్టులో పేర్కొన్నారు..

మరోవైపు గత కొంత కాలంగా భూగోళం వేడెక్కడం... గ్లోబల్ వార్మింగ్ ప్రభావంతో హిమాలయాల్లోని మంచు వేగంగా కరిగిపోతోంది. మానవ తప్పిదాలు, వాతావరణ మార్పుల కారణంగా హిమానీనదాలు కరిగి, ఉప్పొంగుతున్న సరస్సులు నేడు నదుల రూపంలో కాళరాత్రిని మిగులుస్తున్నాయి. ఇటీవలే సిక్కింలో సంభవించిన ఘోర విపత్తు దీనికి ప్రత్యక్ష సాక్ష్యం..

ఉత్తర సిక్కింలో సుమారు పదిహేడు వేల అడుగుల ఎత్తులో ఉన్న సౌత్ లోనాక్ హిమానీనద సరస్సు ఒక్కసారిగా కట్టలు తెంచుకుంది. క్షణాల వ్యవధిలో తీస్తా నది ఉగ్రరూపం దాల్చి, చూంగ్‌థాంగ్ డ్యామ్‌ను నామ రూపాలు లేకుండా చేసింది. పదుల సంఖ్యలో ప్రాణాలను బలితీసుకుంది.. అలాగే ఉత్తరాఖండ్ చమోలీ జిల్లాలో నందాదేవి హిమానీనదం నుంచి భారీ మంచు కొండచరియ విరిగిపడి రుషిగంగ, ధౌలీగంగా నదుల్లో సృష్టించిన ప్రాణనష్టం ఇప్పటికీ కళ్లముందే మెదులుతోంది.

తపోవన జలవిద్యుత్ ప్రాజెక్టును నీటముంచి, రెండు వందల మందికి పైగా కార్మికులను ఈ విపత్తు బలితీసుకుంది. అలాగే ఇటీవలి కాలంలో అత్యంత ఘోరమైన విపత్తు.. వందల మంది ప్రాణాలు తీసిన వరదలు నేపాల్-టిబెట్ సరిహద్దు ప్రాంతాల్లో సంభవించిన ఫ్లాష్ వరదలు.. లంగ్తాంగ్ లిరుంగ్ పర్వత ప్రాంతంలో మంచుకొండ కుప్పకూలడం వల్ల భోటెకోశి, త్రిశూలి నదుల్లో అకస్మాత్తుగా ఉప్పెనలా వరదలు వచ్చాయి.

ఈ ప్రకృతి విపత్తు కారణంగా నేపాల్-టిబెట్ పరిసర ప్రాంతాలలో 1,400 మందికి పైగా మరణించారు, అలాగే వేలాది మంది గల్లంతయ్యారు.. ఇక పదేళ్ల క్రితం కేదార్‌నాథ్‌ను ముంచెత్తిన చోరాబారీ హిమానీనద విపత్తు నుంచి మొదలుకొని, నేపాల్ హిమాలయాల్లో జరుగుతున్న ఆకస్మిక ప్రవాహాల వరకు ప్రతీదీ ప్రకృతి ఇస్తున్న హెచ్చరికే.. పర్వతాగ్రాన పేరుకుపోయిన మంచు నీటి ప్రవాహమై నగరాలను, గ్రామాలను ముంచెత్తుతోంది.

ఈ నేపథ్యంలో పర్యావరణ పరిరక్షణకు చర్యలు ఇప్పటికైనా తీసుకోకపోతే... ఆ మంచు కరిగే కొద్దీ మానవాళి మనుగడ కూడా కరిగిపోవడం ఖాయం అనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. పర్యావరణ శాస్త్ర వేత్తలు సైతం హెచ్చరిస్తున్నారు..

#Flash flood Nepal#BudhigandakiRiver#GorkhaNepal#NepalFloods#GlacialBreak#NepalRescueOperation#NepalArmy#NaturalDisaster
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి