ఎస్ఐఆర్ ప్రక్రియకు వ్యతిరేకంగా, కేంద్రఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ కాక్రోచ్ జనతా పార్టీ (CJP) మరోసారి జంతర్ మంతర్ వద్ద నిరసనలకు పిలుపునివ్వడంతో తీవ్ర ఉద్రిక్తతలు చోటుచేసుకోకుండా కేంద్రంలోని మోడీ సర్కార్ పటిష్ట చర్యలు చేపట్టింది. నీట్ పేపర్ లీకేజీ సమయంలో చోటుచేసుకున్న ఉద్రిక్తతల కారణంగా భారీగా ఆస్తినష్టం సంభవించిన విషయం తెలిసిందే. నిరసనకారులు రాళ్లు రువ్వడం, పోలీసులు లాఠీ చార్జ్ చేయడంతో ఇరువర్గాలు గాయపడ్డాయి. ఈసారి అలాంటి ఉద్రిక్తతలు చోటుచేసుకోకుండా ఉండేందుకు ఢిల్లీ ప్రభుత్వంతో సమన్వయం చేసుకుంటూ మోడీ సర్కార్ ముందుకు వెళ్తోంది.ఈ క్రమంలోనే ఆందోళనలు తెలిపేందుకు నిరసనకారులు జంతర్ మంతర్ వద్దకు చేరుకోకుండా ఉండేందుకు కేంద్రం ‘చక్రవ్యూహాన్ని’ అమలు చేస్తున్నట్టు తెలిసింది.దీంతో యువత, నిరసనకారులు జంతర్ మంతర్ వద్దకు చేరుకునేలోపే వారిని బలగాలు నియంత్రిస్తున్నాయి.
మెట్రో, బస్సు సర్వీసులు బంద్..
నిరసనకారులు పెద్దఎత్తున జంతర్ మంతర్ వద్దకు చేరుకోకుండా ఢిల్లీ ప్రభుత్వం ముందస్తుగానే భద్రతా కారణాల దృష్ట్యా ఢిల్లీ మెట్రోకు చెందిన దాదాపు 45 నుండి 57 కీలక మెట్రో స్టేషన్ల ఎంట్రీ, ఎగ్జిట్ గేట్లను మూసివేయించింది. అనేక బస్సులు, రైలు సర్వీసులను కూడా దారి మళ్లించారు. అనంతరం ట్రాఫిక్ రూట్లను కూడా దారి మళ్లించారు. దాంతో నిరసన కారులు జంతర్ మంతర్ వద్దకు చేరుకోవాలంటే నాలుగంచెల భద్రతను దాటుకుని వెళ్లాల్సి ఉంటుంది.
35 వేల మంది బలగాలు..
న్యూ ఢిల్లీ వ్యాప్తంగా సుమారు 35,000 మందికి పైగా ఢిల్లీ పోలీసులు, పారామిలటరీ (CAPF) బలగాలను కేంద్రం రంగంలోకి దించింది. జంతర్ మంతర్ చుట్టూ 4 కిలోమీటర్ల పరిధిలో మొబైల్ ఇంటర్నెట్ సేవలను కూడా తాత్కాలికంగా నిలిపివేశారు. నీట్ పేపర్ లీకేజీ సమయంలో జరిగిన తప్పులు మరోసారి రిపీట్ కాకుండా ఉండేందుకు ఇంటెలిజెన్స్ బృందాలను రంగంలోకి దించారు. అలాగే సీసీ టీవీల ద్వారా మానిటరింగ్ చేస్తున్నారు.
ముందస్తు అరెస్టులు, నిర్బంధాలు..
కాక్రోచ్ జనతా పార్టీ పిలుపుమేరకు నిరసనల్లో పాల్గొనేందుకు రెడీ అయిన ఆందోళనకారులను ఎక్కడికక్కడ పోలీసులు అరెస్టులు చేశారు. నేతలను ముందస్తుగా నిర్భంధించారు. దేశవ్యాప్తంగా దాదాపు 3,000 మందికి పైగా ఆందోళనకారులను, కీలక నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.అందులో CJP వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే, కో-కన్వీనర్లు సౌరవ్ దాస్, అశుతోష్ రంకా, యూట్యూబర్ ధ్రువ్ రాఠీలు ఉన్నారు.
వారితో పాటు ఆప్ నేత అరవింద్ కేజ్రీవాల్, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ, లెఫ్ట్ నేతలు పినరయి విజయన్, మాణిక్ సర్కార్ వంటి మాజీ ముఖ్యమంత్రులను, పలువురు నేతలను కూడా పోలీసులు అడ్డుకుని, కొందరిని నిర్బంధించి రాత్రికి విడుదల చేశారు. AISA జాతీయ అధ్యక్షురాలు నేహా బోరాతో పాటు వందలాది మంది విద్యార్థులను స్టేడియంలను తాత్కాలిక జైళ్లుగా మార్చి అక్కడికి తరలించారు.
రాళ్ల దాడులు, గాయాలు..
శనివారం జంతర్ మంతర్ వద్ద జరిగిన ఆందోళనల్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఎన్నికల ప్రధాన కమిషనర్ (CEC) జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలనే డిమాండ్‌తో సీజేపీ, వివిధ విద్యార్థి సంఘాలు (AISA) జంతర్ మంతర్ వద్దకు వెళ్లేందుకు ప్రయత్నించాయి. పోలీసులు వారికి అనుమతి నిరాకరించినప్పటికీ వేలాది మంది నిరసనకారులు తరలివచ్చారు. దీంతో ఢిల్లీ మొత్తం భారీ పోలీస్ పహారాతో ఒక యుద్ధ ప్రాంగణాన్ని తలపించింది. ఈ క్రమంలోనే సెంట్రల్ ఢిల్లీలోని ఇంతియాజ్ అలీ మార్గ్, ఆకాశవాణి భవన్, కన్నాట్ ప్లేస్ సమీపంలో నిరసనకారులు బారికేడ్లను నెట్టేసి లోపలికి దూసుకెళ్లేందుకు ప్రయత్నించారు. వారిని అడ్డుకోవడంతో పోలీసులపైకి పలువురు నిరసన కారులు రాళ్లు రువ్వారు. ఈ ఘటనలో ఒక సబ్-ఇన్‌స్పెక్టర్‌తో సహా ఇద్దరు పోలీసు సిబ్బంది గాయపడ్డారు. దాంతో ఆందోళనకారులను పోలీసులు చెదరగొట్టారు.
జంతర్ మంతర్ వద్దకు చేరెదెలా?
సీజేపీ ముఖ్యనేతల అరెస్టుతో ఆదివారం కూడా నిరసనలు కొనసాగుతాయని కాక్రోచ్ జనతా పార్టీ పిలుపునిచ్చింది.అయితే, వారు నిరసన స్థలికి చేరుకోకుండా భద్రతా బలగాలు భారీగా మోహరించాయి. మెట్రో, బస్సు సర్వీసులు క్లోజ్ కావడం, సెక్షన్ 163 అమలులో ఉండటంతో జంతర్ మంతర్ వద్దకు చేరుకోవడం ఆందోళనకారులకు పెద్ద సవాల్‌గా మారింది. సీఈసీ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేసే వరకు వెనక్కి తగ్గేదే లేదని ఆందోళన కారులు చెబుతున్నారు. కీలక నేతలు జైల్లో ఉన్నందున ఇవాళ్టి నిరసనలకు CJP తరపున అజింక్య షిండే నాయకత్వం వహిస్తారని ఆ పార్టీ తెలిపింది.
జంతర్ మంతర్‌కు అత్యంత సమీప మెట్రోస్టేషన్ పటేల్ చౌక్, జన్‌పథ్, రాజీవ్ చౌక్‌లను ముందస్తుగా క్లోజ్ చేయగా..జంతర్ మంతర్ రోడ్, కన్నాట్ ప్లేస్ రేడియల్ రోడ్లు, అశోకా రోడ్, బాబా ఖరక్ సింగ్ మార్గ్ వైపు వెళ్లే రహదారులపై పోలీసులు భారీగా బారికేడ్లు ఏర్పాటు చేశారు.కన్నాట్ ప్లేస్ లేదా శివాజీ స్టేడియం వద్దకు చేరుకుంటే అక్కడి నుండి కాలినడకన వెళ్లాల్సి ఉంటుందని సమాచారం.
సీజేపీ ప్రతినిధుల విడుదల..
నిన్న ముందస్తుగా అరెస్టు చేసిన కాక్రోజ్ జనతా పార్టీ నేతలు అభిజీత్ దీప్కే, సహ కన్వీనర్లు సౌరభ్ దాస్, అశుతోష్ రాంకాలకు ఆదివాయం ఉదయం కంటోన్మెంట్ మెజిస్ట్రేట్ కండిషనల్ బెయిల్ మంజూరు చేయగా.. ధ్రువ్ రాఠీని సైతం పోలీసులు విడుదల చేశారు. మిగతా రాజకీయ నేతలను సైతం నిన్న రాత్రే విడుదల చేశారు. కాగా, మెట్రో సర్వీసులను కూడా పునరుద్ధరించినట్టు సమాచారం.
ఈసీ కీలక నిర్ణయం..
ఎస్ఐఆర్ ప్రక్రియకు వ్యతిరేకంగా సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామాకు డిమాండ్లు వెల్లువెత్తుతుండటంతో కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది.ఓటర్ల జాబితా నుంచి పేర్లను తొలగించేందుకు ఉపయోగించే ‘ఫారమ్-7’ విషయంలో పరిమితులు విధించింది.ఇకమీదట ఒక వ్యక్తి ఫారమ్ -7ను గరిష్టంగా 10 సార్ల కంటే ఎక్కువగా దాఖలు చేయకుండా లిమిట్ పెట్టింది. ఓటర్ల జాబితాల సవరణ ప్రక్రియ దుర్వినియోగం కాకుండా, అర్హులైన ఓటర్ల పేర్లను తొలగించకుండా నిరోధించడానికి ఈసీఐ ఈ నిర్ణయం తీసుకుంది. ప్రత్యేక సవరణ సమయంలో రాజకీయ పార్టీల బూత్ లెవల్ ఏజెంట్లు బీఎల్ఓకి రోజుకు డ్రాఫ్ట్ పబ్లికేషన్‌కు ముందు 50 దరఖాస్తులు, ఆ తర్వాత రోజుకు 10 దరఖాస్తులు మాత్రమే సమర్పించేందుకు అనుమతి ఇచ్చారు. సరైన ఆధారాలు లేకుండా లేదా నిర్ణీత గడువు దాటిన తర్వాత వచ్చిన దరఖాస్తులను ఈఆర్‌ఓలు తిరస్కరిస్తారు. నిబంధనల ప్రకారం ఉన్న దరఖాస్తుదారులకు మొదట నోటీసు జారీ చేసి, వారిని స్వయంగా విచారించి, స్టేట్‌మెంట్లు నమోదు చేసిన తర్వాతే తుది నిర్ణయం తీసుకోనున్నారు.


