ఏపీలో కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చాక ఎదురైన సమస్యలు, వాటి పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటున్నదో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తాజాగా వివరించారు. సమస్యల పరిష్కారానికి కొంత సమయం పడుతుందని, సినిమాల్లో వలే రెండు గంటల్లో పూర్తి చేయడం సాధ్యం కాదని సంచలన కామెంట్స్ చేశారు. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఆ మాత్రం తెలియకుండానే రాజకీయాల్లోకి ఎందుకు వచ్చారని, సినిమాల్లో లాగా డైలాగ్స్ కొడితే పని జరగదని ఇంతకాలానికి తెలుసుకున్నారా? అని పలువురు సోషల్ మీడియా వేదికగా విమర్శలు గుప్పిస్తున్నారు.
ఆదివారం పోలవరం జిల్లాలో పర్యటించిన ఉన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.. ఈ సందర్భంగా పలు కార్యక్రమాల్లో పాల్గొని మాట్లాడారు. రంపచోడవరంలో ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ.. సినిమాల్లో బ్యా గ్రౌండ్ పాట పెట్టి కేవలం రెండున్నర గంటల్లోనే చాలా చేసేయవచ్చని అన్నారు. కానీ, నిజ జీవితంలో మాత్రం అలా కుదరదన్నారు. పన్నెండు, పదిహేను సంవత్సరాలు కింద మీద పడుతూ కష్టపడాల్సి ఉంటుందన్నారు.
పిల్లలకు ఆరోగ్యం సరిగ్గా లేకపోయినా అన్ని మర్చిపోయి పనిచేయాలని, ప్రజలంటే తనకు అంత ప్రేమ అని వెల్లడించారు. సిటీలో రోడ్లు వేయడం వేరని, అక్కడ తలసరి ఆదాయం వస్తుందని ఎక్కువ జనాభా ఉంటారని వివరించారు. కానీ, గ్రామాల్లో 70 కుటుంబాలు మాత్రమే ఉంటాయని, ఓట్లు రావని సమస్యను పక్కన పెట్టలేదని నొక్కిచెప్పారు. మారుమూల గ్రామాల్లోనూ రోడ్లు వేస్తున్నామని చెప్పారు. ఒక రోడ్డు వేస్తే బిడ్డల భవిష్యత్ మారిపోతుందన్నారు. అందుకే రోడ్ల కోసం పంతం పట్టుకుని కూర్చుకున్నానని, ఏజెన్సీ ప్రాంతాలకు రోడ్లు రావాల్సిందేనని స్పష్టంచేశారు.
అరకులో వైసీపీ పార్లమెంట్ అభ్యర్థిని గెలిపించినా తాము ఇక్కడకు రావడానికి కారణం గిరిజన ప్రాంతాలంటే ఇష్టం ఉండటమే అని చెప్పారు. తనకు అల్లూరి సీతారామరాజే స్పూర్తి అని పేర్కొన్నారు. తాను మీలో ఒకడిగా పుట్టకపోయినా మీలో ఒకడిని అయ్యానని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. స్థానిక ఎన్నికల్లో జనసైనికులు సత్తా చూపించాలని ఈ సందర్భంగా పిలునిచ్చారు. మీరు అడిగినవన్నీ చేస్తామని, జనసైనికులు కండువానే ఆయుధంగా మార్చుకున్నారన్నారు. రాష్ట్ర సీఎం చంద్రబాబు నాయకుడు డబ్బులు లేకపోయినా తన అనుభవంతో రాష్ట్రాన్ని ముందుకు నడుపుతున్నారని తెలిపారు.


