సికింద్రాబాద్‌లో చిన్నారి కిడ్నాప్, హత్య కేసులో కీలక విషయాలు వెలుగుచూశాయి. సెక్యూరిటీ గార్డుతో పాటు మరో ఇద్దరిని ఈ కేసులో నిందితులుగా పోలీసులు తేల్చారు. డబ్బుల కోసమే కిడ్నాప్ చేసినట్టు నిర్దారణకు వచ్చారు. చిన్నారి మృతితో కుటుంబసభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. బొల్లారం పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన నిన్న చోటుచేసుకోగా షాకింగ్ నిజాలు వెలుగుచూశాయి.
వివరాల్లోకివెళితే.. కౌకూర్‌లోని 'విల్లా ఆర్చిడ్స్' అపార్ట్‌మెంట్‌లో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్న విక్రమ్.. అదే అపార్ట్‌మెంట్‌లో ఉంటున్న ఆరేళ్ల చిన్నారి అరులియా మోజెస్‌ను కిడ్నాప్ చేసి రూ.20 లక్షలు ఇవ్వాలని కుటుంబ సభ్యులను డిమాండ్ చేశాడు. డబ్బులు సర్దుబాటు చేస్తామని, పాపను క్షేమంగా అప్పగించాలని తల్లిదండ్రులు వేడుకున్నా నిందితుడు ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని విచారణ ప్రారంభించారు.
పోలీసులను గమనించిన నిందితుడు ఎక్కడ దొరికిపోతానో అన్న భయంతో చిన్నారిని హత్య చేశాడు.అనంతరం అపార్ట్‌మెంట్ క్లబ్‌హౌస్ సెల్లార్‌లోని నీళ్ల సంపులో పడేసి పరారయ్యాడు. కిడ్నాప్ చేయడానికి రెండ్రోజుల ముందు నిందితుడు.. చిన్నారి ఇంటి చుట్టూ అనుమానాస్పదంగా తిరిగినట్టు సీసీ ఫుటేజ్ ద్వారా పోలీసులు గుర్తించారు. చిన్నారి వెనుకాలే నిందితుడు వెళ్తున్న దృశ్యాలు కెమెరాల్లో రికార్డయ్యాయి. బాలికను హత్య చేసిన అనంతరం నిందితుడు ఒంటరిగా సికింద్రాబాద్ వైపు పరారైనట్టు గుర్తించారు.
బాలిక కోసం పోలీసులు వెతుకుతుండగా క్లబ్‌హౌస్ సెల్లార్‌లోని నీళ్ల సంపులో విగతజీవిగా కనిపించింది. అపార్ట్‌మెంట్ వాసుల్లో కొందరిని అదుపులోకి తీసుకుని విచారించారు. అనంతరం నిందితుడి మొబైల్ సిగ్నళ్ల ఆధారంగా ట్రేస్ చేయగా.. సికింద్రాబాద్ పరిసర ప్రాంతాల్లోనే ఉన్నట్లుగా గుర్తించి, ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ఈ మర్డర్ కేసులో విక్రమ్‌కు మరో సెక్యూరిటీ గార్డ్ సహకరించినట్టు సమాచారం.
పాప కిడ్నాప్ సమయంలో విల్లా కమ్యూనిటీలో బతుకమ్మ వేడుకలు జరగగా.. స్పీకర్ సౌండ్ ఎక్కువగా పెట్టి నిందితుడికి ఎలక్ట్రిషియన్ సాయం చేసినట్టు కూడా పోలీసులు గుర్తించారు. విక్రమ్‌కు సహకరించిన సెక్యూరిటీ గార్డ్, ఎలక్ట్రిషియన్‌ను అదుపులోకి తీసుకున్నారు.విక్రమ్ ప్రవర్తన సరిగా లేకపోవడంతో అతన్ని గతంలో ఉద్యోగం నుంచి తొలగించినందునే పగ పెంచుకుని బాలికను కిడ్నాప్ చేసి హత్య చేసినట్టు తేల్చారు.


