రాజకీయాలు చేసే వారు ఒకే పార్టీని పట్టుకుని వేలాడితే.. వారికి పొలిటికల్ గ్రోత్ ఉండదని.. అందుకే ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ వైపే మొగ్గు చూపుతారని ఎన్నో సంఘటనలు నిరూపించాయి.. నిరూపిస్తున్నాయి. అయితే పార్టీ మారిన వారు చెప్పే మాట ఒకటే.. మా నియోజకవర్గం అభివృద్ధి కోసం ఈ నిర్ణయం తీసుకున్నామని.. నాటి నుండి నేటి వరకు ఎన్నో కొత్త పార్టీలు పుట్టాయి. కానీ నేతలు ఈ మాట చెప్పడం మాత్రం మరచిపోలేదు.
సాధారణంగా రాష్ట్రం ఏదైనా అధికార పార్టీలోకి ఎక్కువ వలసలు ఉండటం తెలిసిందే.. అందులో ఒక పార్టీ ఐదు సంవత్సరాల వరకు అధికారంలో ఉంటుంది కాబట్టి.. ఓడిన పార్టీలోని కార్యకర్తల నుండి బడా నేతల వరకు అధికార పార్టీపై ఆసక్తి చూపించడం కామన్ గా మారింది. అందుకే ఎన్నికలు అంటే గోడ దూకుళ్లు షరా మామూలు వ్యవహారంగా మారిపోయింది. ఇందులో అన్ని పార్టీలూ ఆ తానులో ముక్కలే కాబట్టి ఎవరిని నిందించినా ప్రయోజనం ఉండదు.
మరోవైపు సార్వత్రిక ఎన్నికల్లో పెద్ద తలకాయలు, ప్రథమ శ్రేణి నాయకులకు ఆపరేషన్ ఆకర్ష్ పథకాలు అమలైతే, ఈసారి ద్వితీయ, తృతీయ శ్రేణులకు పండుగ వచ్చినట్లు అని అంటున్నారు.. ఇక స్థానిక సంస్థల ఎన్నికలు అంటే అధికార పార్టీకి ఎక్కువ గెలుపు అవకాశాలు ఉంటాయన్నది ఒక లెక్క. కానీ ప్రతిపక్షంలో ఉంటే పోరాటాలు చేయాలి, సొంత నిధులు వదిలించుకోవాలి.
పోనీ ఇంతలా శ్రమించిన గెలుపు పిలుపు వినిపిస్తుందా అంటే గ్యారంటీ ఉండదు.. ప్రస్తుతం ఏపీలో ఇలాంటి పరిస్థితులే కనిపిస్తున్నాయనే టాక్ వినిపిస్తుంది. ఇప్పటికే వలసలతో అధికార పార్టీ శిబిరం కిక్కిరిసిపోతోందని అంటున్నారు. అయితే కొత్తగా వలస వచ్చేవారు భేషరతుగా వస్తే చేర్చుకోవచ్చని, కానీ, టికెట్ హామీ ముందే పొంది చేరాలనుకునే వారికి ఛాన్స్ ఇవ్వవద్దని తెలుగు తమ్ముళ్లు చర్చించుకున్నట్టు ప్రచారం జరుగుతుంది.
మరోవైపు వైసీపీ తరఫున విజయనగరం తొలి కార్పొరేషన్‌లో గెలిచి ఐదేళ్లు పదవులను అనుభవించిన ఆరేడుగురు మాజీ కార్పొరేటర్లు టీడీపీలోకి వస్తామని ఒకటే పోరు పెడుతున్నట్టు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో ముందుగానే ఒప్పందాల పక్రియను తెరమీదికి తెస్తున్నట్టు తెలుస్తుంది. టీడీపీలో చేరితే తమ వార్డుల్లో మళ్లీ పోటీ చేసేందుకు టికెట్లు ఇవ్వాలనే షరతు విధిస్తున్నట్టు ప్రచారం జరుగుతుంది.
అయితే గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు వారిపై పోటీ చేసి ఓడిన తమ్ముళ్లు ఈసారైనా కార్పొరేటర్లు కావాలని ఆశపడుతున్నారట.. ఈ నేపథ్యంలో వలసలు వచ్చి తమ అవకాశాలను తీసుకుపోతామంటే ఊరుకునేది లేదని గట్టిగా భీష్మించి కూర్చున్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. మరోవైపు జిల్లాలో జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, ఇతర పదవులు అనుభవించిన మాజీలు సైతం గోడ దూకి అధికార పార్టీలోకి వెళ్లాలని చూస్తున్నా, అక్కడ కూడా ఖాళీ లేదనే సమాధానం వినిపిస్తుందట..
అయినా, పార్టీలో మంద మరీ ఎక్కువైతే వివాదాలకు చోటు ఎక్కువై పార్టీలోని పరిస్థితులు గందరగోళంగా మారే అవకాశాలున్నట్టు ఇప్పటికే ఏపీలో చర్చలు మొదలయ్యాయట.. అలాగే ఈ జంపింగ్ జపాంగ్ ల వ్యవహారం టీడీపీకి కూడా తలనొప్పిగా మారిందనే చర్చలు పార్టీ వర్గాలలో మొదలైనట్టు చెబుతున్నారు. ఎందుకంటే కొత్త క్యాడర్ వస్తే.. వాళ్ళని పాత క్యాడర్‌తో కలిపి పనిచేయించడం కష్టం..
అదేవిధంగా అసంతృప్తులను బుజ్జగించలేకపోతే, పదవులు,టికెట్ల పంపిణీలో సమతుల్యత పాటించకపోతే, ఈరోజు పార్టీలో చేరిన నాయకులే రేపు అంతర్గత పోరుకు కేంద్రంగా మారే ప్రమాదం ఉందనే ఆలోచనలో ఉన్నట్టు ప్రచారం జరుగుతుంది. ఇక ఈ ఫిరాయింపుల వ్యవహారాన్ని వైసీపీ కూడా లైట్‌గానే తీసుకుంటోందని అంటున్నారు.


