తెలంగాణ

'పురుగుల మందు తాగలేదా?' అన్న వివాదంలో ట్విస్ట్.. ఎమ్మార్వోకు మద్దతుగా రైతు!

రచన: Mamatha puppala••4 నిమిషాల పఠనం

సిద్దిపేట జిల్లా గజ్వేల్ తహసీల్దార్ పీహెచ్ స్వామి ఓ రైతును ఉద్దేశించి ‘బతికే ఉన్నావా నువ్వు? పురుగుల మందు తాగలేదా?’ అన్న మాటలు వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో తీవ్ర దుమారం రేగిన సంగతి తెలిసిందే. ఈ వివాదంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సహా పలువురు ప్రముఖులు ఈ ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయగా, అధికారుల తీరుపై విమర్శలు వెల్లువెత్తాయి.

 సిద్దిపేట జిల్లా గజ్వేల్ తహసీల్దార్ పీహెచ్ స్వామి ఓ రైతును ఉద్దేశించి ‘బతికే ఉన్నావా నువ్వు? పురుగుల మందు తాగలేదా?’ అన్న మాటలు వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో తీవ్ర దుమారం రేగిన సంగతి తెలిసిందే. ఈ వివాదంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సహా పలువురు ప్రముఖులు ఈ ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయగా, అధికారుల తీరుపై విమర్శలు వెల్లువెత్తాయి. అయితే ఈ వివాదంపై తాజాగా సదరు రైతు స్వయంగా స్పందించి నిజం ఏంటో చెప్పగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది.

 వైరల్ అయిన ఆ వీడియోలో ఉన్న రైతు ఏసు తాజాగా మీడియాతో మాట్లాడుతూ.. సోషల్ మీడియాలో ప్రచారంలో ఉన్న ఆ సంభాషణ ప్రస్తుతానిది కాదని, దాదాపు ఆరు నెలల క్రితం నాటిదని స్పష్టం చేశారు. తమ కుటుంబానికి గత 30ఏళ్లుగా ఉన్న క్లిష్టమైన భూ వివాదాన్ని తహసీల్దార్ స్వామి ప్రత్యేక చొరవ తీసుకుని పరిష్కరించారని తెలిపాడు. ఆ తహసీల్దార్ చొరవ వల్లే తమకు రావాల్సిన భూసేకరణ పరిహారం డబ్బులు సులభంగా అందాయని, ప్రస్తుతం తమకు ఎలాంటి సమస్య లేదని ఆయన స్పష్టం చేశారు.

 మరోవైపు ఈ వివాదంపై తహసీల్దార్ స్వామి స్పందిస్తూ.. రైతుతో ఉన్న సాన్నిహిత్యం, చనువు కారణంగానే తాను ఆ మాట అన్నానని వివరణ ఇచ్చారు. అంతకుముందు ఆ రైతు తన భూ సమస్య పరిష్కారం కాకపోవడంతో తీవ్ర మనోవేదనకు గురై పలుమార్లు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంటానని అన్నాడని, ఆ ఉద్దేశంతోనే తాను అలా హెచ్చరించాల్సి వచ్చిందని తెలిపారు.

 ఆఫీసులోని కొందరు సిబ్బంది తనపై ఉన్న కక్షతో, కావాలనే ఆ సంభాషణలోని కేవలం కొద్ది భాగాన్ని మాత్రమే కట్ చేసి సోషల్ మీడియాలో తప్పుగా ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. రైతు ఏసు స్వయంగా వీడియో ద్వారా క్లారిటీ ఇచ్చినప్పటికీ, ఈ ఘటనపై ఇప్పటికే తీవ్ర చర్చ జరగడంతో ఉన్నతాధికారులు దీనిపై అంతర్గత విచారణను కొనసాగిస్తున్నారు. అధికారి మాట్లాడిన తీరుపై విమర్శలు వస్తున్నప్పటికీ, రైతు మాత్రం తనకు మేలు జరిగిందని స్వయంగా చెప్పినప్పటికీ భిన్న వాదనలు వినిపిస్తున్నాయి.

#GajwelTehsildar#RythuVadapalli#KTR#SiddipetNews#TelanganaControversy#ViralVideoTwist#LandDisputeTelangana
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి