సౌదీ అరేబియా రాజధాని రియాద్‌లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. దేశంలోని కీలక విమానయాన కేంద్రం కింగ్ ఖలీద్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని లక్ష్యంగా చేసుకుని క్షిపణి దాడి జరిగడం కలకలం రేపుతోంది. ఈ ఘటనలో 12 మంది ప్రాణాలు కోల్పోగా, 300 మందికి పైగా గాయపడినట్లు సమాచారం. మృతుల్లో నలుగురు సౌదీ పౌరులు ఉన్నారని, మిగిలినవారు బంగ్లాదేశ్, అమెరికా, ఈజిప్ట్, జోర్డాన్, సిరియా, పాలస్తీనా, సూడాన్ దేశాలకు చెందిన వారని అధికారులు వెల్లడించారు.
మరోవైపు గాయపడిన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే సమీపంలోని వివిధ ఆసుపత్రులకు క్షతగాత్రులను తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇక స్థానిక మీడియా కథనం ప్రకారం ఈ దాడులకు తామే బాధ్యులమని యెమెన్‌కు చెందిన హౌతీ తిరుగుబాటుదారులు ప్రకటించినట్లు తెలుస్తుంది. చాలా కాలంగా ఇరాన్ మద్దతు పొందుతున్న హౌతీ తిరుగుబాటుదారులు, సౌదీ అరేబియా నేతృత్వంలోని కూటమి మధ్య ఘర్షణలు కొనసాగుతున్నాయి.
సౌదీ నేతృత్వంలోని కూటమి యెమెన్‌లో ప్రభుత్వానికి మద్దతుగా గతంలో సైనిక చర్యలు చేపట్టగా, హౌతీలు కూడా క్షిపణులు, డ్రోన్లతో ప్రాంతీయ లక్ష్యాలపై దాడులకు పాల్పడిన సందర్భాలున్నాయి. ఇలాంటి దాడులు గల్ఫ్ ప్రాంత భద్రతతో పాటు అంతర్జాతీయ విమానయాన రంగంపైనా ప్రభావం చూపుతున్నాయి. ఇక ఈ తాజా దాడి నేపథ్యంలో కింగ్ ఖలీద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపివేసినట్లు సమాచారం.
అదేవిధంగా ప్రయాణికులను సురక్షిత ప్రాంతాలకు తరలించడంతో పాటు, పలు విమానాలను రద్దు చేయడం, మరికొన్నింటిని ఇతర విమానాశ్రయాలకు మళ్లించడం వంటి చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది. ఈ ఘటనతో విమానాశ్రయ పరిసరాల్లో భద్రతను మరింత కట్టుదిట్టం చేయాల్సిన పరిస్థితి నెలకొంది. మరోవైపు, రియాద్‌లోని అమెరికా, బ్రిటన్ రాయబార కార్యాలయాలు తమ పౌరులకు భద్రతా సూచనలు జారీ చేసినట్లు సమాచారం.


