ఎస్ఐఆర్, ఓటు చోరీకి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసనలు మిన్నంటున్న విషయం తెలిసిందే. కేంద్ర ఎన్నికల కమిషనర్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ప్రతిపక్ష కాంగ్రెస్, విపక్షాలు కదం తొక్కుతున్నాయి.సీఈసీ రాజీనామా చేసే వరకు ఈ పోరాటం ఆగదని ఓవైపు కాంగ్రెస్ పార్టీ, మరోవైపు కాక్రోచ్ జనతా పార్టీ స్పష్టంచేశాయి. ఈ క్రమంలోనే నిన్న ఇండియా (INDIA) కూటమి నిర్వహించిన 'చలో ఢిల్లీ - మార్చ్ ఫర్ డెమోక్రసీ' (March for Democracy) నిరసన ప్రదర్శనలో లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీతో కలిసి ఆల్ ఇండియా స్టూడెంట్స్ అసోసియేషన్ (AISA) జాతీయ అధ్యక్షురాలు నేహా బోరా పాల్గొన్నారు.
న్యూఢిల్లీలోని బారాఖంబ రోడ్ జంక్షన్ నుంచి దేశసర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు వైపు ప్రతిపక్షాల భారీ మార్చ్ జరిగింది. ఇందులో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రాలతో పాటు నేహా బోరా ముందుండి ర్యాలీని నడిపించారు. సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని ఆద్యంతం నేహాబోరా, ఇండియా కూటమి ఎంపీలు డిమాండ్ చేశారు.
నేహా బోరా బాడీ డబుల్..!
అంతకుముందు జంతర్ మంతర్ వద్ద జరిగిన నిరసనల్లోనూ నేహాబోరా పోలీసుల కళ్లు గప్పి నిరసన ప్రదర్శనల్లో పాల్గొన్నారు. ఆమెను ముందస్తుగా అదుపులోకి తీసుకోవాలని భావించిన ఖాకీలకు ఊహించని షాక్ తగిలింది. నిరసన సమయంలో అచ్చం నేహాబోరా లాగే ఉన్న ఓ అమ్మాయి పోలీసుల దృష్టిని ఆకర్షించింది. కళ్లద్దాలు పెట్టుకుని ఫేస్ మాస్క్ పెట్టుకుని ఆమెను చూసి నిజమైన నేహాబోరా అనుకుని పోలీసులు అరెస్టు చేశారు.తీరా చూస్తే అసలైన నేహాబోరా నిరసనల్లో పాల్గొని నినాదాలు చేయడం పోలీసుల కంట పడింది.
దీంతో ఒకరికి బదులు మరొకరిని అరెస్టు చేశామని పోలీసులు నాలుక కరుచుకున్నట్టు తెలిసింది. ఆర్కే ఆశ్రమం వద్ద మాస్కుతో ఉన్న అమ్మాయిని చూసి నేహా బోరానే అనుకొని ఆమెను అరెస్టు చేయడం హాస్యాస్పదంగా మారింది. అదే సమయంలో కన్నాట్ ప్లేస్‌లో తాను అనుకున్నట్టుగానే నిరసనలో నేహా బోరా పాల్గొంది. చివరకు విజయ్ చౌక్ వద్ద అసలైన నేహా బోరాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం తాను విడుదల అయ్యాక తనని పోలి ఉన్న అమ్మాయితో కలిసి ఫోటో దిగిన నేహా బోరా నెట్టింట్లో షేర్ చేయగా వైరల్ అవుతోంది.


