కృత్రిమ మేధస్సులో ఓపెన్ ఏఐ(AI), ఆంథ్రోపిక్ వంటి దిగ్గజ సంస్థలకు పోటీగా మైక్రోసాఫ్ట్, గూగుల్ రేసులో నిలవగా, రేసులో కాస్త వెనుకబడిన మెటా (Meta) సంస్థ మళ్లీ ఫామ్‌లోకి వచ్చింది. అత్యంత అత్యాధునిక మరియు శక్తివంతమైన 'మ్యూజ్ వండర్' (Muse Wonder) అనే కొత్త ఏఐ మోడల్‌ను లాంఛ్ చేసినట్లు మెటా అధినేత మార్క్ జుకర్‌బర్గ్ అధికారికంగా ప్రకటించారు.
ఈ మోడల్ విడుదలతో ఏఐ పరిశోధనల్లో, నూతన ఆవిష్కరణల్లో తమ సంస్థ మళ్లీ ప్రపంచంలోనే ముందంజలోకి వచ్చిందని ఆయన సంతోషం వ్యక్తం చేశారు. అంతకుముందు తాము విడుదల చేసిన 'మ్యూజ్ స్పార్క్' కంటే మ్యూజ్ వండర్ మోడల్ పనితీరు అత్యంత వేగవంతంగా, సంక్లిష్ట సమస్యలను పరిష్కరించేలా రూపుదిద్దుకుందని జుకర్‌బర్గ్ వివరించారు.
ప్రస్తుతం మార్కెట్‌లో ఆధిపత్యం చెలాయిస్తున్న ఆంథ్రోపిక్ సంస్థకు చెందిన 'ఓపర్ 5.5', ఓపెన్ ఏఐ కి చెందిన 'జీపీటీ 6 ఆస్ట్రా' వంటి టాప్ మోడల్స్‌కు తమ మ్యూజ్ వండర్ గట్టి పోటీనిస్తుందని స్పష్టం చేశారు. ఈ స్థాయి సాంకేతికతను అందుకోవడానికి తమ ఏఐ పరిశోధనా బృందం ఎంతో శ్రమించిందని, భారీగా పెట్టుబడులు పెట్టాల్సి వచ్చిందని పేర్కొన్నారు. ఏఐ రంగంపై పూర్తి స్థాయి పట్టు సాధించేందుకు మెటా సంచలన నిర్ణయాలు తీసుకుంటోంది.
ఇటీవల ప్రముఖ ఏఐ సంస్థ 'స్కేల్ ఏఐ' ని ఏకంగా 14 బిలియన్ డాలర్ల భారీ పెట్టుబడితో సొంతం చేసుకుంది. ఆ సంస్థ వ్యవస్థాపకుడు అలెగ్జాండర్ వాంగ్‌ను మెటా ఏఐ విభాగానికి అధిపతిగా నియమించారు. మ్యూజ్ వండర్ మోడల్ గురించి వాంగ్ మాట్లాడుతూ.. ఇది తమ పురోగతిలో ఒక మైలురాయి అని, వ్యక్తిగత, ప్రొఫెషనల్ తరహా ఏజెంటిక్ పనులను అత్యంత సమర్థవంతంగా పూర్తిచేసే సామర్థ్యం ఈ మోడల్‌కు ఉందని స్పష్టం చేశారు.
అయితే ఏఐ అభివృద్ధిపై విపరీతంగా దృష్టి పెట్టిన మెటా, ఖర్చులను తగ్గించుకోవడంలో భాగంగా ఉద్యోగుల తొలగింపులను కూడా వేగవంతం చేసింది. గత మే నెలలోనే దాదాపు 8వేల మంది సిబ్బందిని (10 శాతం మందిని) విధుల్లోంచి తొలగించింది. మరోవైపు సోషల్ మీడియా అడిక్షన్, మానసిక ఆరోగ్యానికి సంబంధించిన వివాదాలను పరిష్కరించుకునేందుకు మెటా భారీ మొత్తంలో కాంపెన్సేషన్ సెటిల్మెంట్‌లకు అంగీకరించడం గమనార్హం.


