క్రైమ్

తగలబెట్టి ప్రాణాలు తీసినా మారనితీరు.. అబ్దుల్లాపూర్‌మెట్‌లో అవినీతి తిమింగలాలు!

రచన: Mamatha puppala•••5 నిమిషాల పఠనం

రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ రెవెన్యూ కార్యాలయం మళ్లీ వార్తల్లోకెక్కింది. గతంలో అవినీతి, లంచాల వేధింపులు భరించలేక ఓ వ్యక్తి కార్యాలయంలోనే నాటి మహిళా తహసీల్దార్ విజయారెడ్డిపై పెట్రోల్ పోసి తగలబెట్టిన ఘోర ఉదంతం రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే.

  • విజయారెడ్డి ఘటనతోనైనా మారని తీరు..

  • అబ్దుల్లాపూర్‌మెట్ రెవెన్యూ కార్యాలయంలో మళ్లీ అవినీతి కలకలం!

  • అదే చాంబర్‌లో లంచాల దందా!

  • రూ.20లక్షల లంచం.. ఏసీబీకి చిక్కిన తహసీల్దార్, సర్వేయర్!

  • లేఅవుట్ సర్వే నివేదికకు భారీ డిమాండ్

  • అవినీతికి అడ్డుకట్ట ఎక్కడ?

 రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ రెవెన్యూ కార్యాలయం మళ్లీ వార్తల్లోకెక్కింది. గతంలో అవినీతి, లంచాల వేధింపులు భరించలేక ఓ వ్యక్తి కార్యాలయంలోనే నాటి మహిళా తహసీల్దార్ విజయారెడ్డిపై పెట్రోల్ పోసి తగలబెట్టిన ఘోర ఉదంతం రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే. భూమికి సంబంధించిన వివాదం, పాస్ పుస్తకాల జాప్యంపై నిందితుడు కేసుకు సంబంధించి పెంచుకున్న కక్షే విజయారెడ్డి హత్యకు ప్రధాన కారణం కాగా ఆ ఘటనలో ఆమె ప్రాణాలు కోల్పోయినా, రెవెన్యూ యంత్రాంగం వైఖరిలో మార్పు రాకపోవడం గమనార్హం.

సరిగ్గా అదే కార్యాలయంలో, అదే తహసీల్దార్ చాంబర్‌లో ఏకంగా రూ.20లక్షల లంచం తీసుకుంటూ అధికారులు ఏసీబీకి రెడ్‌హ్యాండెడ్‌గా చిక్కడం ప్రజలను తీవ్ర ఆగ్రహావేశాలకు గురిచేస్తోంది. ఒక లేఅవుట్ సర్వే నివేదికను అనుకూలంగా ఇచ్చేందుకు అబ్దుల్లాపూర్‌మెట్ తహసీల్దార్ బి.సుదర్శన్ రెడ్డి ఆదేశాల మేరకు మండల సర్వేయర్ బటుక శ్రీనివాసులు బాధితుడి నుంచి రూ.20లక్షల భారీ మొత్తాన్ని వసూలు చేస్తుండగా ఏసీబీ అధికారులు పకడ్బందీగా దాడి చేసి పట్టుకున్నారు. తహసీల్దార్, సర్వేయర్ ఇద్దరినీ అదుపులోకి తీసుకుని అర్ధరాత్రి నుంచి సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో వీరిద్దరి అక్రమ సంపాదనకు సంబంధించిన కీలక పత్రాలు, ఆధారాలు లభించినట్లు ఏసీబీ వర్గాలు వెల్లడించాయి.

 కళ్లముందే తోటి అధికారి దారుణ హత్యకు గురైనా, ఆ చాంబర్‌లోనే కూర్చుని లక్షలాది రూపాయల లంచాలు దండుకోవడం అధికారుల తెగింపునకు అద్దం పడుతోంది. ప్రభుత్వ భూముల క్లియరెన్స్, లేఅవుట్ సర్వేల పేరుతో సామాన్యులను, వ్యాపారులను జలగల్లా పీడిస్తున్న అవినీతి అధికారుల పట్ల ప్రజల్లో తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. చట్టాలు, ఏసీబీ దాడులు ఉన్నప్పటికీ లంచాల దందా ఏమాత్రం తగ్గకపోవడంపై పౌర సమాజం ఆందోళన వ్యక్తం చేస్తోంది.

 ఇలాంటి లంచగొండి అధికారులపై కేవలం బదిలీలు, సస్పెన్షన్లు మాత్రమే కాకుండా ఉద్యోగాల నుంచి శాశ్వతంగా తొలగించి, వారి అక్రమాస్తులను జప్తు చేసేలా కఠిన చట్టాలు అమలు చేయాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు. ప్రజా రక్షణ, అవినీతి రహిత పాలన అందించడంలో విఫలమవుతున్న అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటే తప్ప వ్యవస్థలో మార్పు రాదని స్పష్టమవుతోంది.

#AbdullapurmetMRO#ACBRaidsRangareddy#MROSudarshanReddy#VijayaReddyMRO#TelanganaRevenueCorruption#ACBTrapsTelugu#RangareddyNews
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి