టాప్ న్యూస్

TG : మిగిలింది రెండేండ్లే.. ‘నామినేటెడ్’ ఊరించుడు ఇంకెన్నాళ్లు?

రచన: Kumar••9 నిమిషాల పఠనం

రాష్ట్రంలో నామినేటెడ్ పదవుల భర్తీకి సంబంధించి మరోసారి ఊహాగానాలు వినిపిస్తున్నాయి.ఈసారైనా పదవులు భర్తీ చేస్తారా? ఊరించి ఊరించి ఊసురూమనిస్తారా? అని పార్టీలో అంతర్గతంగా చర్చ జరుగుతోంది. అదిగో చేస్తాం, ఇదిగో చేస్తామంటూ ఇంకెంత కాలం వెయిట్ చేయిస్తారని పలువురు సీనియర్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

-భారీ సంఖ్యలో ఎదురుచూస్తున్న ఆశావహులు

-ఇంకెప్పుడు ఇస్తారని నేతల అసహనం

-రెన్యూవల్ చేయాలంటూ మరికొందరి వినతులు

-జోరుగా లాబీయింగ్ చేస్తోన్న కొత్త, మాజీ లీడర్లు!

-దసరాకు ముహూర్తం కుదిరేనా?

-ఇప్పటికే కసరత్తు పూర్తి చేసిన సీఎం, పీసీసీ చీఫ్!

-హైకమాండ్ ఆమోదిస్తే పదవుల పండగే..

రాష్ట్రంలో నామినేటెడ్ పదవుల భర్తీకి సంబంధించి మరోసారి ఊహాగానాలు వినిపిస్తున్నాయి.ఈసారైనా పదవులు భర్తీ చేస్తారా? ఊరించి ఊరించి ఊసురూమనిస్తారా? అని పార్టీలో అంతర్గతంగా చర్చ జరుగుతోంది. అదిగో చేస్తాం, ఇదిగో చేస్తామంటూ ఇంకెంత కాలం వెయిట్ చేయిస్తారని పలువురు సీనియర్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన కొత్తలో 2024 జూలై 7వ తేదీన 37 రాష్ట్రస్థాయి కార్పొరేషన్లు, ఫెడరేషన్లకు చైర్మన్లను నియమించింది. వారి రెండేండ్ల పదవీకాలం జూలై 8, 2026తో ముగిసింది. పదవీకాలం ముగిసినా కొందరు నేతలు తమకు రెన్యూవల్ వస్తుందనే భరోసాతో కార్పొరేషన్ కార్యాలయాలను వీడటం లేదని తెలుస్తోంది. పదవులు ముగిసిన వారిలో మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి భార్య నిర్మల, పటేల్‌ రమేశ్‌రెడ్డి, గురునాథ్‌ రెడ్డి, ఎం వీరయ్య తదితరులు తమకు మరోసారి అవకాశం ఇవ్వాల్సిందేనని పట్టుబడుతున్నారు. ఢిల్లీస్థాయిలో పైరవీలు చేస్తున్నట్టు తెలిసింది.మరి కొందరు నేతలు గాంధీభవన్‌, మంత్రుల చుట్టూ తిరుగుతున్నట్టు సమాచారం.

మిగిలింది రెండేండ్లే..

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి దాదాపు మూడేండ్లు కావొస్తుంది.కేవలం ఒకసారి మాత్రమే నామినేటెడ్ పోస్టులు భర్తీ చేశారు. మరో రెండేండ్లు గడిస్తే అసెంబ్లీకి ఎన్నికలు వస్తాయి.మరోసారి పార్టీ అధికారంలోకి వస్తుందా? లేదా? అనేది ప్రజలే నిర్ణయిస్తారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో మరోసారి అధికారంలోకి వస్తామని హస్తం పార్టీ నేతలే ధీమాగా చెప్పలేకపోతున్నారు. అందుకు క్షేత్రస్థాయిలో నెలకొన్న పరిస్థితులే కారణమని కొందరు పెదవి విరుస్తున్నారు. దీంతో ఏండ్లుగా కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతూ పార్టీకి సేవ చేస్తున్న వారు తమకు పదవులు రావడం లేదని తీవ్ర నిరాశలో ఉన్నారు. ఇంకెప్పుడు పోస్టులు భర్తీ చేస్తారని ఆశగా ఎదురుచూస్తున్నారు. ఇతర పార్టీల నుంచి వచ్చిన వారిని అందలం ఎక్కించారని, తమ పరిస్థితి ఏంటని కీలక నేతల వద్ద తమ అసహనాన్ని వెల్లిబుచ్చుతున్నట్టు తెలిసింది. ఈసారి తమకు ఎలాగైనా అవకాశం కల్పించాలని ఎమ్మెల్యేలు, మంత్రులపైనా ఒత్తిడి పెంచుతున్నట్టు తెలిసింది.

ఈ సారి భారీ నియామకాలు..

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ అధికారంలోకి రావాలంటే ముందుగా అసంతృప్తితో ఉన్న నేతలకు పదవులు ఇవ్వాలని, దక్కని వారికి మరోవిధంగా బుజ్జగింపులు, హామీలు ఇవ్వాలని అధిష్టానం సైతం ఓ నిర్ణయానికి వచ్చినట్టు తెలిసింది.కేవలం రెండేండ్లే సమయం ఉండటంతో త్వరగా నామినేటెడ్ పోస్టులు భర్తీ చేయాలని చూస్తున్నట్టు సమాచారం. పదవులు పొందిన నేతలను పార్టీ కార్యక్రమాల్లో భాగస్వామ్యం చేసేలా క్యాలెండర్ తయారు చేస్తున్నట్టు తెలిసింది.ఈ క్రమంలోనే ఒకేసారి దాదాపు 60 కార్పొరేషన్ల చైర్మన్లు, డైరెక్టర్లను నియమించనున్నట్టు తెలిసింది. ఈ లెక్కన సుమారు 200 మందికి పదవులు వస్తాయని ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే సమర్థులైన నేతల పేర్లను సీఎం రేవంత్, పీసీసీ అధ్యక్షుడు మహేశ్ గౌడ్ ఫైనల్ చేసినట్టు సమాచారం. అధిష్టానం నుంచి ఆమోదం లభించాక అధికారికంగా ప్రకటించనున్నట్టు తెలుస్తోంది.

కొందరికే రెన్యూవల్.. మిగతా కొత్త వారికి..

ఇటీవల పదవీకాలం ముగిసిన చైర్మన్లు అందరికీ ఈసారి రెన్యూవల్ చేయడం కష్టమని ప్రచారం జరుగుతోంది. గతంలో పదవులు పొందిన నేతలు పార్టీ కోసం కష్టపడకుండా అధికారాన్ని అడ్డం పెట్టుకుని దందాలు చేసినట్టు అధిష్టానం దృష్టికి వచ్చింది. మరికొందరు క్షేత్రస్థాయిలో పర్యటించకుండా కేవలం పవర్‌‌ను ఎంజాయ్ చేయడం, అవినీతికి పాల్పడినట్టు విమర్శలు ఉన్నాయి.అలాంటి వారిని గుర్తించిన అధిష్టానం ఈసారి వారిని పక్కనబెట్టి కొత్తవారికి అవకాశం ఇవ్వాలని చూస్తున్నట్టు తెలిసింది. కేవలం ఐదారుగురు మాజీలకు మాత్రమే రెన్యువల్ చేసే అవకాశం ఉన్నట్టు తెలిసింది. అందులో నిర్మలా జగ్గారెడ్డి, పటేల్ రమేశ్ రెడ్డి, శివసేనారెడ్డి, ఈర్రవతి అనిల్, బెల్లయ్య నాయక్ , నూతి శ్రీకాంత్ ఉన్నట్టు ప్రచారం జరగుతోంది.

దసరాకు ముహూర్తం కుదిరేనా?

నామినేటెడ్ పోస్టులకు సంబంధించిన అభ్యర్తుల కసరత్తును సీఎం రేవంత్ రెడ్డి, టీపీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ పూర్తి చేసినట్టు తెలిసింది. అయితే, ప్రస్తుతం హైకమాండ్ ఎస్ఐఆర్‌, సీఈసీ జ్ఞానేష్ కుమార్‌కు వ్యతిరేకంగా పోరాటాలు చేస్తున్నది.ఏఐసీసీ చీఫ్ ఖర్గే సహా రాహుల్, ప్రియాంకగాంధీలో నిరసనల్లో పాల్గొంటున్నారు. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ సైతం బిజీబిజీగా ఉంటున్నారు. రాష్ట్రం తరఫున మంతనాలు జరపడానికి స్టేట్ వ్యవహారాల ఇన్‌చార్జి లేరు. మీనాక్షి నటరాజన్ పైచదువుల కోసం విదేశాలకు వెళ్లడంతో రాష్ట్రానికి కొత్తగా ఎవరూ అపాయింట్ కాలేదు.హైకమాండ్ అపాయింట్‌మెంట్ ఇస్తే దసరాకు నామినేటెడ్ పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్టు సమాచారం. అదే జరిగితే ఆశావహుల పంట పండనుంది. ఇప్పుడు కుదరకపోతే చాలా టైం పట్టొచ్చని తెలుస్తోంది.ఎందుకంటే ప్రస్తుతం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ఓటరు జాబితా నమోదు ప్రక్రియ కొనసాగుతోంది. త్వరలో ముగుస్తుంది. దీంతో ప్రభుత్వం దృష్టి అంతా ఆ ఎన్నికల మీదే ఉంటుంది. ఆ తర్వాత ఖైరతాబాద్ అసెంబ్లీకి బై పోల్, జీహెచ్ఎంసీ ఎన్నికలు రానున్నాయి. దీంతో నామినేటెడ్ పోస్టుల భర్తీ మరింత ఆలస్యం కానుందని సమాచారం.

#Nominated posts#congress#telangana#fillup#swechaanews
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి