ప్రధాని నరేంద్ర మోదీని ఉద్దేశించి చేసిన ‘చౌకీదార్ చోర్ హై’ వ్యాఖ్యలపై నమోదైన క్రిమినల్ పరువునష్టం కేసులో కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి సర్వోన్నత న్యాయస్థానంలో ఊరట లభించింది. ఈ కేసుకు సంబంధించి దిగువ ట్రయల్ కోర్టులో కొనసాగుతున్న విచారణ ప్రక్రియపై సుప్రీంకోర్టు స్టే విధించింది.
జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్‌లతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్‌పై విచారణ జరిపి మహారాష్ట్ర ప్రభుత్వానికి నాలుగు వారాల గడువుతో నోటీసులు జారీ చేసింది. 2018లో రఫేల్ యుద్ధ విమానాల ఒప్పందంపై రాజకీయ దుమారం రేగిన సమయంలో రాజస్థాన్‌లో జరిగిన బహిరంగ సభలో రాహుల్ గాంధీ ప్రధాని మోదీపై ఈ వ్యాఖ్యలు చేశారు.
దీనిపై బీజేపీ స్థానిక నేత మహేష్ శ్రీశ్రీమల్ ముంబైలోని గిర్గావ్ మేజిస్ట్రేట్ కోర్టులో పరువునష్టం దావా వేశారు. 2019లో మేజిస్ట్రేట్ కోర్టు ఈ కేసులో విచారణకు ఆదేశించగా, ఆ ఉత్తర్వులను కొట్టివేయాలంటూ రాహుల్ బాంబే హైకోర్టును ఆశ్రయించారు. అయితే హైకోర్టు ఆయన పిటిషన్‌ను తిరస్కరించడంతో రాహుల్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
సుప్రీంకోర్టులో రాహుల్ తరఫున సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి వాదనలు వినిపించారు. రాజకీయ వ్యాఖ్యలపై పరువునష్టం కేసులు ఏ విధంగా వర్తిస్తాయనే అంశంపై సుప్రీంకోర్టు విచారణ చేపట్టనుంది. ఈ నేపథ్యంలో ట్రయల్ కోర్టు చర్యలను తాత్కాలికంగా నిలిపివేస్తూ ధర్మాసనం ఆదేశాలు జారీ చేయడంతో కాంగ్రెస్ శిబిరంలో ఊరట లభించింది.


