క్రైమ్

అబ్దుల్లాపూర్‌మెట్ ఎమ్మార్వో సుదర్శన్ రెడ్డి ఇంట్లో కొనసాగుతున్న సోదాలు!

రచన: Mamatha puppala••4 నిమిషాల పఠనం

రంగారెడ్డి జిల్లా రెవెన్యూ విభాగంలో అవినీతి మూలాలపై యాంటీ కరప్షన్ బ్యూరో (ACB) అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు. నిన్న రాత్రి నుంచి రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు ఏకకాలంలో పలు ప్రాంతాల్లో విస్తృత తనిఖీలు చేపట్టారు.

 రంగారెడ్డి జిల్లా రెవెన్యూ విభాగంలో అవినీతి మూలాలపై యాంటీ కరప్షన్ బ్యూరో (ACB) అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు. నిన్న రాత్రి నుంచి రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు ఏకకాలంలో పలు ప్రాంతాల్లో విస్తృత తనిఖీలు చేపట్టారు. ఇందులో భాగంగా అబ్దుల్లాపూర్‌మెట్ తహసీల్దార్ (MRO) సుదర్శన్ రెడ్డి నివాసంతో పాటు ఆయన కార్యాలయంలోనూ సోదాలు నిరంతరంగా కొనసాగుతున్నాయి.

 భూముల క్లియరెన్సులు, సర్వేలు, వివిధ ధ్రువీకరణ పత్రాల జారీలో భారీగా ముడుపులు దండుకుంటున్నారన్న పక్కా సమాచారంతో అధికారులు ఈ ఆకస్మిక దాడులు నిర్వహించినట్లు తెలుస్తోంది. సుదర్శన్ రెడ్డికి సంబంధించిన ఇళ్లు, బంధువుల నివాసాలు, ఇతర ప్రాంతాల్లో ఏకకాలంలో తనిఖీలు చేపట్టడంతో రెవెన్యూ వర్గాల్లో తీవ్ర కలకలం రేగింది. ఈ సోదాలలో భారీగా అక్రమాస్తులు, బంగారు ఆభరణాలు, కీలక భూముల పత్రాలు, నగదు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.

 తహసీల్దార్ కార్యాలయంలోని రికార్డులను, కంప్యూటర్ హార్డ్‌డిస్క్‌లను ఏసీబీ అధికారులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. అవినీతి అధికారుల అక్రమ దందాలకు అడ్డుకట్ట వేసేలా ఏసీబీ చేపట్టిన ఈ తాజా దాడులు జిల్లాలో తీవ్ర సంచలనం సృష్టించాయి. తహసీల్దార్ బండారు సుదర్శన్‌రెడ్డి, సర్వేయర్ శ్రీనివాసులు రూ.20లక్షలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న విషయం తెలిసిందే.

 అబ్దుల్లాపూర్‌మెట్ మండల పరిధిలోని ఒక లేఔట్‌కు సంబంధించి క్షేత్రస్థాయి పరిశీలన, సర్వే రిపోర్ట్ కోసం రూ.30లక్షల వరకు లంచం డిమాండ్ చేశారు. అంత మొత్తం ఇచ్చుకోలేనని బాధితుడు ప్రాధేయపడటంతో చివరకు రూ.20లక్షలకు ఒప్పందం కుదిరింది. ఈ క్రమంలో బాధితుడు వెంటనే ఏసీబీ ఉన్నతాధికారులను ఆశ్రయించాడు. అధికారులు పక్కా ప్లాన్ ప్రకారం రంగంలోకి దిగి రూ.20లక్షలు లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అరెస్టయిన తహసీల్దార్ సుదర్శన్‌రెడ్డి, సర్వేయర్ శ్రీనివాసులను నాంపల్లిలోని ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానంలో హాజరుపరచనున్నారు.

#AbdullapurmetMRO#ACBRaidsRangareddy#MROSudarshanReddy#VijayaReddyMRO#TelanganaRevenueCorruption#ACBTrapsTelugu#RangareddyNews
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి