Nagarjuna: అక్కినేని నాగార్జున కెరీర్‌లో ఎప్పటికీ గుర్తుండిపోయే సినిమాల్లో ‘గీతాంజలి’ ఒకటి. దర్శకుడు మణిరత్నం తెరకెక్కించిన ఈ ప్రేమకథా చిత్రం అప్పట్లో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. నాగార్జున, గిరిజ జంటగా నటించిన ఈ సినిమా.. ప్రేమ, భావోద్వేగాలు, సంగీతం, విజువల్స్ కలగలిపిన అందమైన ప్రేమకావ్యంగా నిలిచిపోయింది. అయితే, ఈ సినిమాను ఈ ఏడాది నవంబర్ 13న మళ్ళీ థియేటర్స్‌లోకి తీసుకురాబోతున్నారు. తాజాగా, ఈ విషయాన్ని కన్‌ఫర్మ్ చేస్తూ పోస్టర్‌ను రిలీజ్ చేశారు.
నాగ్ కెరీర్‌లో గీతాంజలి సినిమా ఓ సూపర్ క్లాసిక్. ఇప్పుడు ఈ క్లాసిక్ మూవీని మరోసారి థియేటర్లలో చూసే అవకాశం అభిమానులకు రాబోతోంది. ‘గీతాంజలి’ సినిమాను నవంబర్ 13న రీ రిలీజ్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. 4క్ వెర్షన్‌లో ఈ మూవీ రిలీజ్ చేస్తున్నారు. నాగార్జున నటించిన శివ కూడా ఇలా, రీ రిలీజై మంచి వసూళ్లను రాబట్టింది. ఈ క్రమంలోనే, ఇప్పుడు నాగార్జున గీతాంజలి మళ్ళీ విడుదలకి సిద్ధమవుతోంది.
1989లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘గీతాంజలి’ అప్పట్లోనే ఓ కొత్త తరహా ప్రేమకథను తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేసింది. నాగార్జున పాత్ర, గిరిజ పాత్ర మధ్య సాగే ప్రేమకథ ప్రేక్షకులను భావోద్వేగానికి గురి చేసింది. ముఖ్యంగా సినిమాలోని ప్రేమ సన్నివేశాలు, ప్రకృతి అందాలను మణిరత్నం చూపించిన తీరు ఇప్పటికీ ప్రత్యేకంగా చెప్పుకుంటారు.

ఇళయరాజా సంగీతం మరో ప్రత్యేకత..
‘గీతాంజలి’ సినిమాకు ఇళయరాజా అందించిన సంగీతం ఈ సినిమాకు మరో ప్రధాన బలం. సినిమాలోని పాటలు అప్పట్లోనే కాదు.. ఇప్పటికీ సంగీత ప్రియులను అలరిస్తూనే ఉన్నాయి. రీ రిలీజ్ సందర్భంగా ఈ పాటలను థియేటర్‌లో బిగ్ స్క్రీన్‌పై, మంచి సౌండ్‌తో వినాలని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక, ఈ సినిమాలో నాగ్ సరికొత్త మేకోవర్‌తో కనిపించి ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా, క్లైమాక్స్‌లో ఆయన పర్ఫార్మెన్స్ అద్భుతం అని చెప్పాలి.


