ఖైరతాబాద్ మాజీ ఎమ్మెల్యే దానం నాగేందర్ పార్టీ మారి మరో కాంగ్రెస్ నుంచి ఎంపీగా పోటీ చేసినప్పుడే ఆయన శాసనసభ సభ్యత్వం రద్దు కావాల్సిందని మాజీ ఎమ్మెల్యే, బీజేపీ సీనియర్ నేత చింతల రామచంద్రారెడ్డి అన్నారు. దానం శాసనసభ సభ్యత్వం రద్దు కోసం బీజేపీ ఎంతగానో న్యాయపోరాటం చేసిందన్నారు. హైకోర్టు, సుప్రీంకోర్టుకు వెళ్లి ఫైట్ చేశామని, ఎట్టకేలకు తమ కృషి ఫలించిందని చెప్పారు. తెలంగాణలో బీజేపీ 8 ఎంపీ స్థానాలు , 8 ఎమ్మెల్యేలు, గ్యాట్యుయేట్ ఎమ్మెల్సీ, టీచర్ ఎమ్మెల్సీ సైతం గెలిచిన విషయాన్ని గుర్తుచేశారు.
ఈసారి ఖైరతాబాద్ నియోజకవర్గంలో తాము తప్పకుండా గెలుస్తామని వెల్లడించారు.అయితే, ఖైరతాబాద్ నుంచి ఎవరు పోటీ చేస్తారనేదానిపై పార్టీ నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు.అయితే, ఖైరతాబాద్ నుంచి పోటీ చేయడానికి, టికెట్ అడిగే హక్కు తనకు ఉందన్నారు. మిగితా వాళ్లు కూడా టికెట్ అడగవచ్చని చెప్పారు. తాను ఖైరతాబాద్ వదిలి ఇప్పటి వరకు ఎక్కడకు పోలేదని గుర్తుచేశారు. టికెట్ ఇస్తే కచ్చితంగా బరిలోదిగి విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు.
ఇదిలాఉండగా, ఖైరతాబాద్ ఉపఎన్నిక రాష్ట్రంలో హాట్ టాపిక్ అయ్యింది. 2023లో బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేసి గెలిచిన దానం నాగేందర్.. పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన నేపథ్యంలో ఆయన శాసనసభ్యత్వం రద్దు అయిన విషయం తెలిసిందే. తన ఎమ్మెల్యే పదవికి,పార్టీకి రాజీనామా చేయకుండా కాంగ్రెస్ పార్టీ బీఫాం మీద సికింద్రాబాద్ ఎంపీగా కంటెస్ట్ చేసిన క్రమంలో హైకోర్టు ఆయనపై అనర్హత వేటు వేసింది. దీనిపై అప్పీల్‌కు వెళ్లగా సుప్రీంకోర్టు సైతం హైకోర్టు తీర్పును సమర్థించింది. దీంతో ఖైరతాబాద్ అసెంబ్లీ సెగ్మెంట్‌కు బైపోల్ అనివార్యమైంది.
అయితే, బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్‌లోకి మారిన దానం నాగేందర్‌పై అనర్హత వేటు పడేలా బీజేపీ సుప్రీంకోర్టు, హైకోర్టును ఆశ్రయించింది.బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి దానం నాగేందర్‌ను డిస్ క్వాలిఫై చేయాలంటూ హైకోర్టు , సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసి కొట్లాడారు.ఫలితంగా ఖైరతాబాద్‌కు ఉపఎన్నిక రావడంతో అధికార కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ నుంచి పోటీ చేయబోయే అభ్యర్థులు ఎవరు అనేదానిపై ఇంకా క్లారిటీ రాలేదు. కాగా, ఈ బైపోల్‌లో ఎలాగైనా గెలవాలని అధికార కాంగ్రెస్ ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నది. ప్రభుత్వం తమదే ఉన్నందున నియోజకవర్గ అభివృద్ధి, నిధుల కోసం పార్టీ గుర్తుమీద నిలబడే వ్యక్తికి ఓటు వేసి గెలిపించాలని కోరుతున్నారు.


