వచ్చే ఏడాది ప్రారంభంలో పంజాబ్ అసెంబ్లీకి ఎన్నికలు జరనున్నాయి. ఈ తరుణంలో రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో కీలక పరిణామం చోటుచేసుకుంది. పంజాబ్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పీపీసీసీ) అధ్యక్ష పదవికి అమరీందర్ సింగ్ రాజా వారింగ్ నిన్న రాజీనామా చేశారు. గత కొన్ని నెలలుగా రాజా వారింగ్, మాజీ సీఎం చరణ్‌జీత్ సింగ్ చన్నీ వర్గాల మధ్య తీవ్ర ఆధిపత్య పోరు సాగడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది.
పార్టీ నాయకత్వం విషయంలో ఇరువర్గాల నాయకులు, ఎమ్మెల్యేలు రెండుగా చీలిపోయి హైకమాండ్ వద్ద బలాన్ని నిరూపించుకునే ప్రయత్నాలు చేసినట్టు తెలిసింది. ఎన్నికల ముందు నేతల మధ్య ఇలాంటి విభేదాలు పార్టీకి నష్టం కలిగిస్తాయని నిర్ణయానికి వచ్చిన కాంగ్రెస్ అధినాయకత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.
కొత్త అధ్యక్షుడిని ఎన్నుకునే దిశగా పావులు కదిపింది. అధినాయకత్వం ఆదేశాల మేరకు పంజాబ్ పీసీసీ చీఫ్ అమరీందర్ సింగ్ రాజీనామా చేశారు. అయితే, కొత్త అధ్యక్ష పదవి రేసులో మాజీ మంత్రి విజయ్ ఇందర్ సింగ్లా, జలంధర్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే పర్గత్ సింగ్, గుర్దాస్‌పూర్ ఎంపీ సుఖ్‌జిందర్ సింగ్ రంధావా పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి.ఇదిలాఉండగా, కాంగ్రెస్ అగ్ర నాయకత్వం విజయ్ ఇందర్ సింగ్లా పేరును దాదాపు ఖరారు చేసిందని సమాచారం. రేపు దీనిపై అధికారిక ప్రకటన ఉండనుందని తెలుస్తోంది.
కాగా, రాజా వారింగ్ 2022 ఏప్రిల్‌లో పీసీసీ చీఫ్‌గా బాధ్యతలు చేపట్టగా, సుమారు నాలుగున్నరేళ్ల పాటు ఆ పదవిలో కొనసాగారు.పార్టీలో అంతర్గత కలహాల కారణంగా ఆయన తన పదవికి రాజీనామా చేయాల్సి రావడంతో ఆయన వర్గం నిరాశకు లోనయినట్టు తెలుస్తోంది. కాగా, ఆయన కాంగ్రెస్‌లోనే కొనసాగుతారా? అధికార ఆమ్ ఆద్మీ పార్టీలోకి వెళ్తారా? లేదా బీజేపీలోకి వెళ్తారా? అనేది తెలియాల్సి ఉంది.
బలవంతంగా ఆయనతో రాజీనామా చేయించినందున పార్టీ మారాలని ఆయన అనుచరులు సూచించినట్టు జోరుగా ప్రచారం జరుగుతోంది. అయితే, పంజాబ్ శాసనసభ ఎన్నికలు 2027 ఫిబ్రవరి లేదా మార్చి నెలల్లో జరిగే అవకాశం ఉంది. ప్రస్తుత ముఖ్యమంత్రి భగవంత్ మాన్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) ప్రభుత్వ పదవీకాలం 2027 మార్చి 16తో ముగియనుంది.వచ్చే ఎన్నికల్లో ఆప్, కాంగ్రెస్ మధ్య హోరాహోరి పోరు ఉంటుందని టాక్.


